కర్రిగుట్టలకు బుల్లెట్‌లు కాదు.. రాజ్యాంగాన్ని పంపండి!

by Ravi |   (  Updated:2025-05-06 01:00:52  IST  )

దేశ సరిహద్దు రక్షణ చూడాల్సిన సైనిక బలగాలను కేంద్ర ప్రభుత్వం మధ్య భారత దేశంలోకి పంపి తన గర్భంలో ఉన్న

కర్రిగుట్టలకు బుల్లెట్‌లు కాదు.. రాజ్యాంగాన్ని పంపండి!
X

దేశ సరిహద్దు రక్షణ చూడాల్సిన సైనిక బలగాలను కేంద్ర ప్రభుత్వం మధ్య భారత దేశంలోకి పంపి తన గర్భంలో ఉన్న శిశువులను తానే అంతమొందించినట్టు తన రాజ్యాంగ పరిధిలో ప్రజాస్వామిక సార్వభౌమ అధికార భూమిలో జీవిస్తున్న ప్రజలను చిదిమేస్తోంది.

అసలేం జరుగుతోంది మధ్య భారతదేశంలో? ఎందుకు భారత పోలీసు, సైనిక బలగాలు ఎన్‌కౌంటర్ల పేరీట ఆదివాసీలను చంపుతున్నాయి? అసలు యుద్ధంలో బలయ్యేది ఎవరు? మావోయిస్టులా? ఆదివాసీలా? ఆదివాసులు అంటే ఈ దేశ మూలవాసులు కాబట్టి వారిని బతికించుకునే విధంగా ఆలోచన చేద్దాం.

ఆదివాసీల హననాన్ని ఆపండి

దండకారణ్యం 3 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన దట్టమైన అడవులు, కొండలు, లోయలు, ప్రకృతి జలపాతాలతో సుందరమైన ప్రాంతం కానీ నేడు ఆ ప్రాంతంలో నీటి ప్రవాహంలో నీళ్ల బదులు రక్తం ఏరులై పారుతోంది. ప్రకృతి జీవనానికి సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన ఆదివాసీల ప్రాంతం నేడు రక్తపు మరకలతో గోసరిల్లుతోంది. నేటికీ ఈ ప్రాంతాల్లో ఆధార్ కార్డులు ఉండవు, రోడ్లు ఉండవు, స్కూల్ ఉండదు. కరెంటు ఉండదు. హాస్పిటల్స్ ఉండవు. ప్రభుత్వ పథకాలు ఏవి కూడా ఈ ప్రాంతం దరి చేరలేదు అంటే ఈ పాపం ఎవరిది?

వాళ్లు లేనప్పుడు మీరేం చేశారు?

ఇది ఎవరి తప్పు అనుకుందాం? ఇక్కడ మావోయిస్టులు ఉండడం వల్లనే ఇక్కడికి మేము చేరుకోలేం అనేది కేంద్ర ప్రభుత్వాల వాదన. కానీ మావోయిస్టు ఉద్యమం 1980, 1990 దశకంలో మాత్రమే దండకారణ్యానికి చేరింది. 1950 నుంచి 1980వ దశకం వరకు 30 సంవత్సరాల కాలం. ఈ కాలంలో భారత ప్రభుత్వం ఎందుకు ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి చేయలేకపోయింది? ఆదివాసులకు ఎందుకు దగ్గరగా పోలేకపోయింది? అనే ప్రశ్నలకు నేడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాంతాల అభివృద్ధి వైపు ప్రయాణం చేయలేదు గాని ఆ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ వనరుల దోపిడీ మాత్రం 1953లోనే మొదలు పెట్టింది భారత ప్రభుత్వం. ఆదివాసీలను అభివృద్ధి చెందించే ప్రయత్నం భారత ప్రభుత్వ చేయలేదు కాబట్టి అక్కడి అడవులను, భూమిని, నీటిని రక్షించుకుందామని మావోయిస్టులు పిలుపునిచ్చారు

అపారమైన ఖనిజ వనరులపై కన్ను

మధ్య భారత దేశంలో ఐదవ షెడ్యూల్ అనేది ఉంది. దాని ప్రకారం ఆ ప్రాంతాలు పాలించుకునే హక్కు ఆదివాసులకు ఉందని నాడే పరిచయం చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. అక్కడ ఉన్న ఆదివాసీలను అంతం చేసి కర్రె గుట్టల మీద హెలికాప్టర్లతోని సైన్యం మోహరించి వాళ్ళపై యుద్ధం చేస్తూ దండకారణ్యంలో లక్ష మంది బలగాలను మోహరించటం చూస్తే కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య కోణంలో ఆలోచించడం లేదు అని అర్థం అవుతుంది. ఈ యుద్ధం కూడా ప్రజా స్వామ్య రక్షణ కోసం కాదు, ఈ ప్రాంతంలో ఉన్న ఖనిజ వనరుల దోపిడీకే అనేది కూడా స్పష్టమవుతుంది.

మావోయిస్టుల అడ్డు తొలగిస్తేనే..

ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత పేరిట అక్కడున్న ఆదివాసులను హింసించి, వారి జీవితాలను ధ్వంసం చేస్తే ఆ భయానక వాతావరణంలో, ఆ ప్రాంతం నుంచి ఆదివాసీలు వలసపోతే అక్కడి వనరులను దోపిడీ చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ప్రధాన కుట్రగా మనం చూడవలసి ఉంటుంది. బైలాడిల్లా మల్కాజ్‌గిరి పరిధిలో ఖనిజ వనరులను ఖాళీ చేసి ఇంకా దట్టమైన అడవి ప్రాంతంలో గనులు తవ్వాలనేది లక్ష్యం.. దానికి అడ్డుగా ఉన్న మావోయిస్టు పార్టీని లేకుండా చేసే కార్య క్రమంలో భాగంగా ఇవాళ కగార్ ఆపరేషన్ తెర మీదకు వచ్చిందని అర్థం చేసుకోవాలి.

అడవిలో ఆదివాసి స్వేచ్ఛగా బతకకుంటే?

1995 సల్వా జుడుం, ఆపరేషన్ గ్రీన్ హంట్ 2009 మొదలు కొని ఆపరేషన్ కగార్ వరకు ఆదివాసీలను అభివృద్ధి చేయడానికి ఏ కేంద్ర ప్రభుత్వం కూడా కృషి చేయలేదు. అడవిలో ఆదివాసీ స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు. తుపాకుల మోతలతో, గ్రైనేడ్లతో, యుద్ధ విమానాలతో పచ్చని అడవి తల్లి ఎరుపెక్కుతోంది. ఆదివాసులకు మద్దతుగా నిలుద్దాం. ఆది వాసులు అంటే ఈ దేశ మూల వాసులు. ఈ దేశ దళిత బహుజన ద్రవిడ సమాజాలకు సంబంధించిన ఆది పురుషులు కాబట్టి ఈ దేశ మూలవాసులను బతికించుకునే విధంగా ఆలోచనలు చేద్దాం. చేయి చేయి కలుపుదాం. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, అందులో ఆదివాసీలను కాపాడుకుందాం.

డా. మైపతి అరుణ్ కుమార్

తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు

94419 66756

Next Story