ఈశాన్య భారతం సినిమాది ఓ ప్రత్యేక స్వరం!

by Ravi |   (  Updated:2025-11-22 01:15:50  IST  )

సమస్త భారతీయ సినిమా చరిత్రలో ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎదిగిన సినిమా కేవలం ప్రాంతీయ, అనుబంధ ధార కాదు.. అది ఒక ప్రత్యేక స్వరం. ఒక్క సినిమానే కాదు కవిత్వం కథ సంగీతం లాంటి అన్ని కళారూపాల్లో ఈశాన్య భారత సృజనకారుల వ్యక్తీకరణ విలక్షణమైంది.

ఈశాన్య భారతం సినిమాది ఓ ప్రత్యేక స్వరం!
X

సమస్త భారతీయ సినిమా చరిత్రలో ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎదిగిన సినిమా కేవలం ప్రాంతీయ, అనుబంధ ధార కాదు.. అది ఒక ప్రత్యేక స్వరం. ఒక్క సినిమానే కాదు కవిత్వం కథ సంగీతం లాంటి అన్ని కళారూపాల్లో ఈశాన్య భారత సృజనకారుల వ్యక్తీకరణ విలక్షణమైంది. ఎందుకంటే ఆ ప్రాంతం ప్రకృతితో మమైకమై ఉంది. బ్రహ్మపుత్ర లాంటి నది అక్కడి సృజనకారులకు పెద్ద స్ఫూర్తి. అక్కడి సినిమా కేవలం వినోదం కాదు. అది ఒక సాంస్కృతిక అస్తిత్వ ప్రకటన. దాదాపు అన్ని కళాత్మక వ్యక్తీ కరణల్లో తమని తాము నిలదొక్కుకుంటూ ప్రధాన భారతీయ ప్రధాన స్రవంతిలో మేమూ ఉన్నాం అంటున్నారు.

మేం చెప్పదలుచుకున్న కథల్ని, కవితల్ని చదవండి, సినిమాల్ని చూడండి అంటున్నారు. ఆ రాష్ట్రాల సినిమాలు విభిన్న భాషల్లో మాట్లాడినా అన్నీ ఒకే సత్యాన్ని చెబుతాయి. అసోం, మణిపూర్‌, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్‌, అరుణాచల ప్రదేశ్‌, త్రిపుర, సిక్కింలు ఈశాన్య రాష్ట్రాలు. ఈ ప్రాంతమంతా మనదేశంలోని గొప్ప సాంస్కృతిక వైవి ధ్యంతో నిండిన భూభాగం. ఈ వైవిధ్యం అన్ని కళలతో పాటు వారి సినిమాల్లో కూడా ప్రతిఫలించింది. ఈ ప్రాంత పు సినిమాలు వ్యాపార ప్రధాన స్రవంతి బాలీవుడ్‌ సినిమాల ప్రభావంతో కొంత మసకబారినప్పటికీ, స్వతంత్ర స్వరాలుగానే నిలిచాయి.

ఈశాన్యంలో సినిమా 1935లోనే ప్రారంభం..

ఈశాన్యంలో సినిమా అసోంలో మొదలైంది. ఈశాన్య భారత సినిమా చరిత్ర ‘జోయ్‌మోతి (1935)’తో ప్రారంభమైంది. ఆ చిత్ర దర్శకుడు జ్యోతి ప్రసాద్ అగర్వాలా తీసిన ఆ సినిమా ప్రధానంగా మహిళా వీరత్వానికి ప్రతీకగా నిలిచింది. ఆయన అసోం సాంస్కృతిక పునరుజ్జీవనానికి మార్గదర్శకుడు అనే చెప్పొచ్చు. అనంతరం భభేంద్రనాథ్ సైకియా అగ్నిసన, సంద్యరాగ్, కలసంధ్యా వంటి వాస్తవిక చిత్రాలతో జాతీయ ఖ్యాతిని పొందాడు. మానవ సంబం ధాలు, సామాజిక వాస్తవాలు సైకియా సినిమాలకు ప్రాణంగా నిలిచాయనే చెప్పాలి. ఇక జానూ బరువా భారతీయ సమాంతర సినిమాకు ప్రముఖ ప్రతినిధిగా నిలబడ్డాడు. ‘హలోధియా చోరాయే’ ‘బౌధాన్ ఖాయ్’ లాంటి సినిమాలతో జాతీయ అవార్డులు అందుకున్నారు. ఆయన గ్రామీణ అసోం జీవనశైలిని తన సినిమాల్లో కవితాత్మకంగా చిత్రించాడు. ఇక యువ దర్శకురాలు రీమా దాస్ వంటి వాళ్లు అసోం సినిమాను దేశవిదేశాలకు పరిచయం చేశారు.

విలేజ్ రాక్‌స్టార్స్‌కి ఆస్కార్ నామినేషన్

రిమాదాస్ తీసిన ‘విల్లేజ్ రాక్‌స్టార్స్’ గ్రామీణ బాలిక కలలను అంతర్జాతీయ వేదికపై చూపించి భారతదేశం తరపున ఆస్కార్‌ నామినేషన్‌ పొందింది. ఆమె స్వతంత్ర యువ దర్శకురాలు, దాస్‌ను సింగిల్ పర్సన్‌ ఫిలిం మేకిం‌గ్‌ కి ఆదర్శంగా తీసుకోవచ్చు. తన సినిమాలకు తానే కథ రాసి, దర్శకత్వం వహించి, చిత్రీకరించి, ఎడిట్‌ చేసింది స్వయంగా, మణిపూర్ సినిమా ప్రతిఘటనకు మాధ్యమంగా నిలబడింది. 1972లో అరిబం స్యామ్‌ శర్మ తీసిన ‘మతంగి’ సినిమాతో మణిపూర్ సినిమా మొదలైంది. ఈ రాష్ట్రంలో సినిమా సామాజిక ప్రతిఘటనకు వేదికగా నిలబడింది. 1980లలో వచ్చిన ‘ఇమాగి నింగ్‌థెం’ ‘ఇషనౌ లాంటి సిని మాలు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చాయి. మణిపూర్‌లో 2000లో బాలీవుడ్‌ సినిమాలపై నిషేధం విధించడంతో, స్థానిక దర్శకులు తమ భాషలో, తమ కథలతో తామే సినిమాల్ని రూపొందించి ముందుకొచ్చారు. చిన్న బడ్జెట్‌తో, స్థానిక నటులతో నిర్మించిన ఆ సినిమాలు మణిపూర్‌ ప్రజల నిత్యజీవితపు దృశ్యాల్ని ప్రతిబింబించాయి.

ఆ సినిమాలకు అంతర్జాతీయ ప్రశంసలు..

మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్‌ వంటి రాష్ట్రాల్లో డిజిటల్‌ యుగం కొత్త మార్గాలు తెరిచింది. అక్కడ యువ గొంతుకలు కొండల మధ్య కొత్త స్వరాలుగా నిలబడుతున్నా యి. మిజోరాంలో మాపుయా చావంగ్‌తు, లాల్బియాక్థంగా వంటి యువ దర్శకులు కుటుంబ, మత, ఆధునికత అం‌శా లపై సినిమాలు తీస్తున్నారు. మేఘాలయలో ప్రదీప్ కుర్బా రూపొందించిన సినిమాలు ఓనటాహ్, ఇయుడుహ్ మాతృ స్వామ్య సమాజపు మానవీయతను సున్నితంగా చూపించి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్నాయి.

‘క్రాసింగ్ బ్రిడ్జెస్’కు జాతీయ అవార్డు..

నాగాలాండ్‌లో తేజ రియో, తియాకుమ్జుక్ ఐర్‌ వంటి దర్శకులు గిరిజన జీవితం, సంగీత సంస్కృతి, పట్టణ మార్పులు వంటి విషయాలను సినిమాగా మలుస్తున్నారు. ఇక త్రిపుర రాష్ట్రంలో జోసెఫ్ పులింతనాత్ తీసిన ‘మాథియా’ చిత్రం ‘కోక్బోరోక్‌’ భాషలో నిర్మాణమై ఆ భాషకు, సినిమాకు ఎంతో గౌరవం తెచ్చింది. అరుణాచల ప్రదేశ్‌లో సాంగే దోర్జీ థాంగ్‌డాక్ దర్శకత్వం వహించిన ‘క్రాసింగ్ బ్రిడ్జెస్ జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇక సిక్కిం విషయానికి వస్తే అక్కడ పర్యావరణం, జీవనశైలి, ఆత్మశోధన వంటి అంశాలను సినిమాల్లో చూపించే ప్రయత్నాలు విజయవంతంగా జరుగుతున్నాయి.

భారత సినిమాకు కొత్త దృశ్య భాష..

ఈశాన్య రాష్ట్రాల సినిమాల్లో ప్రధానంగా స్థానిక పురాణాలు, కథల పునర్నిర్మాణం. ఉగ్రవాదం, సైనిక హింస, వలసలు. సంప్రదాయం ఆధునికతల మధ్య సాగుతున్న పోరాటం ముఖ్య అంశాలుగా ఉంటున్నాయి. ఇక నదులు, అడవులు, వర్షం లాంటివి అక్కడి సినిమాల్లో కేవలం అంద మైన దృశ్యాలు గానే కాదు, కథలో అంతర్భాగమైన అంశా లుగా ఆ సినిమాలకు జీవం పోస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల దర్శకులు భారత సినిమాకు కొత్త దృశ్య భాషను అందించారనే చెప్పాలి. మన హైదరాబాద్‌లో నార్త్ ఈస్ట్ కనెక్ట్ పేర ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నందుకు అభినందించాల్సిందే.

(ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లో నార్త్ ఈస్ట్ కనెక్ట్ పేర ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్న సందర్భంగా)

-వారాల ఆనంద్

94405 01281

Next Story