ఎంత చదివినా.. కొలువు కరువైతే..?

by Ravi |   (  Updated:2025-07-31 01:00:13  IST  )

చదువుకుని ఉద్యోగం పొందలేని పరిస్థితి, అభ్యాసం చేసినా ఆర్థిక స్వావలంబనకు దారితీయని వాస్తవం.. ఈ దేశ యువతలో విపరీతమైన

ఎంత చదివినా.. కొలువు కరువైతే..?
X

చదువుకుని ఉద్యోగం పొందలేని పరిస్థితి, అభ్యాసం చేసినా ఆర్థిక స్వావలంబనకు దారితీయని వాస్తవం.. ఈ దేశ యువతలో విపరీతమైన ఆందోళన, నిరాశను పెంచుతోంది. పూర్వం విద్య అంటే వ్యక్తిత్వ వికాసం, జ్ఞానం పెంపు, నైపుణ్యాల సాధన. కానీ ఆధునిక భారతదేశంలో, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం, విద్య అంటే ఒకే మాట ఉపాధి.

భారతదేశం భవిష్యత్తు, దేశ యువత చేతుల్లోనే ఉందని మనం తరచూ చెబుతుంటాం. కానీ ఆ యువతకు దారిచూపే విద్యావిధానం సక్రమ దిశలో నడుస్తోందా? అన్న ప్రశ్న ఇప్పుడు అత్యంత కీలకమైంది.

జీవనోపాధి పొందాలనే..

నేటి పేద, మధ్యతరగతి విద్యార్థులు తీసుకునే విద్యా ఉపాధికి లంకెలు లేకుండా కొనసాగుతోందని చెప్పడం అతిశయోక్తి కాదు. తల్లిదండ్రులు ఎంతటి కష్టాలు పడి తమ పిల్లలను చదివించడానికి ప్రయత్నిస్తారో, అది వారు పెద్ద పదవులు దక్కించుకోవాలని కాదు, కనీసం గౌరవ ప్రదమైన జీవనోపాధి పొందాలని. కానీ నేటి విద్యా విధానం ఆ ఆశను నెరవేర్చడంలో విఫలమవుతోంది.

పేద విద్యార్థి పరిస్థితి..

పేద విద్యార్థి చిన్ననాటి నుండే అనేక అడ్డంకులతో పెరుగుతాడు. ప్రైవేట్ స్కూళ్ల అధిక ఫీజులు, ప్రాథమిక సదుపాయాలు లేని ప్రభుత్వ పాఠశాలలు, సరైన ఉపాధ్యాయుల లేమి ఇవి అన్నీ కలిసి అతని ప్రాథమిక విద్యనే అస్థిరం చేస్తాయి. మధ్యస్థాయి విద్యకు చేరే సరికి కోచింగ్ సెంటర్లు, కాంపిటీటివ్ పరీక్షల ఖర్చులు కుటుంబానికి భారం అవుతాయి. ఎలాగోలా డిగ్రీ, పీజీ చదివినా, మార్కెట్‌లో ఉన్న ఉద్యోగ అవకాశాలు మాత్రం తగ్గిపోతున్నాయి. చదువుకు వెచ్చించిన కాలం, డబ్బు, కష్టానికి తగిన ఫలితం రాకపోవడం వలన పేద విద్యార్థి నిరాశలో కూరుకుపోతున్నాడు.

సామాజిక, మానసిక ప్రభావాలు..

పేద విద్యార్థి, చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగం దొరకకపోతే, అతని ఆత్మవిశ్వాసం చిద్రం అవుతుంది. అప్పులు చేసి చదివినవారు బకాయిలతో బాధపడతారు. గ్రామీణ యువత నగరాలకు వలస వెళ్లి చిన్న పనుల్లో గడుపుతున్నారు. చదువు ఉన్నా, తగిన ఉపాధి లేని ఈ పరిస్థితి దేశానికి మానవ వనరుల వృధా. మన విద్యా విధానం ఇప్పటికీ పుస్తక జ్ఞానంపైనే ఆధారపడి ఉంది. ల్యాబ్‌లలో అనుభవం, ప్రాజెక్టుల ద్వారా నేర్చుకోవడం, పరిశోధన ద్వారా అర్థం చేసుకోవడం అన్నవి చాలా వరకు లేకుండా పోయాయి. నేటి మార్కెట్‌లో టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీకి ఎక్కువ డిమాండ్ ఉంది. కానీ విద్యార్థులు వీటిని అభివృద్ధి చేసుకునే అవకాశం చాలా తక్కువ. ఉద్యోగావకాశాలకు అనుసంధానం లేకపోవడం యూనివర్సిటీలు, కళాశాలలు ఇస్తున్న డిగ్రీలు పరిశ్రమల అవసరాలకు సరిపడడం లేదు. దాంతో ‘ఎడ్యుకేటెడ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్’ అనే దురదృష్టకర పరిస్థితి పెరుగుతోంది. ప్రైవేట్ ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్‌మెంట్ కోర్సులు కేవలం ధనికులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

పరిష్కార మార్గాలు..

అందుకే విద్యను ఉపాధితో అనుసంధానం చేయాలి. ప్రతి కోర్సులో నైపుణ్య ఆధారిత శిక్షణ తప్పనిసరి చేయాలి. ఉదాహరణకు, డిగ్రీ కోర్సు లోపలే టెక్నికల్ స్కిల్స్, ఇంటర్న్‌షిప్‌లు కలపాలి. పేద విద్యార్థుల కోసం ఉచితంగా మాత్రమే కాదు, నాణ్యతతో కూడిన విద్య అందించాలి. ఉపాధ్యాయుల లోపాన్ని తీర్చాలి. ఐటీ, అగ్రికల్చర్, హెల్త్ కేర్, హస్తకళలు వంటి రంగాల్లో నైపుణ్య శిక్షణను గ్రామీణ ప్రాంతాలకే తీసుకెళ్లాలి. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం కలిసి కొత్త పరిశ్రమలు, స్టార్టప్‌లు ప్రోత్సహించాలి. స్థానిక వనరుల ఆధారంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెంచాలి. పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు కెరీర్ మార్గదర్శకత్వం ఇవ్వాలి.

ఉపాధికి లంకెలేని విద్య ఎందుకు?

పేద విద్యార్థి భవిష్యత్ ఎటు? అతను చదువుకుని ఉద్యోగం పొందలేని స్థితిలో, కూలీ పనులు చేస్తూ గడ పాలా లేక సరైన మార్పులు చేసి, విద్యను ఉపాధి లంకెతో అనుసంధానం చేసి, కొత్త ఆర్థిక యుగంలో నిలబడాలా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం మన సమాజం, ప్రభు త్వాల బాధ్యత. ఇండియా ఒక యువ దేశం. యువతలో ఎక్కువ మంది పేద, మధ్య తరగతికి చెందిన వారు. వారి విద్య, ఉపాధి భవిష్యత్తు సక్రమంగా ఉండకపోతే, దేశ అభివృద్ధి అసాధ్యం. నేటి విద్యా విధానం ఉపాధికి లంకె కట్టని పక్షంలో, పేద విద్యార్థి భవిష్యత్తు చీకట్లో మిగిలిపోతుంది. ఇది దేశ భవిష్యత్తుకు ముప్పు. కాబట్టి, విద్యను ఉపాధి, నైపుణ్యం, ఆత్మవిశ్వాసం కలిగించే దిశగా మార్చడం ఇప్పుడు అత్యవసరం.

మహేశ్వరం భాగ్యలక్ష్మి

95056 18252

Next Story