సాగు ఎంత పెరిగినా.. రైతు జీవితం బాగుపడదా?

by Ravi |   (  Updated:2025-09-02 01:15:56  IST  )

వ్యవసాయ రంగంలో వరుస సంస్కరణలు, రైతు కేంద్రిత చర్యలతో ఈ రంగం స్థిరంగా ఎదుగుదల సాధిస్తూ వరి, గోధుమ, మొక్కజొన్న

సాగు ఎంత పెరిగినా.. రైతు జీవితం బాగుపడదా?
X

వ్యవసాయ రంగంలో వరుస సంస్కరణలు, రైతు కేంద్రిత చర్యలతో ఈ రంగం స్థిరంగా ఎదుగుదల సాధిస్తూ వరి, గోధుమ, మొక్కజొన్న, వేరు సెనగ, సోయాబీన్ వంటి పంటల్లో రికార్డు ఉత్పత్తిని సాధించింది. వ్యవసాయ మాంద్యం, ఆహార కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న స్వాతంత్ర్యానంతర భారతావని హరిత విప్లవ ప్రభావంతో ఆహార భద్రత సాధించ గలిగింది. అలాగే ఉద్యాన పంటల ఉత్పత్తి, పశు సంవర్ధన, క్షీర విప్లవం, నీలి విప్లవం వలన భారతదేశం గణనీయ అభివృద్ధి సాధించింది.

ప్రపంచ పాల ఉత్పత్తిలో 25 శాతం భాగస్వామ్యంతో అగ్ర స్థానంలో, ఆక్వాకల్చర్‌లో మూడవ స్థానంలో భారత్ కొనసాగుతోంది. 2025లో ప్రపంచంలో రెండవ పెద్ద మత్స్య ఎగుమతి దారుగా మారింది. అయితే సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ నివేదిక ప్రకారం వ్యవసాయం గిట్టుబాటు కాక 76 శాతం మంది రైతులు సాగును వదలి ఇతర ప్రత్యామ్యాయ ఉపాధి మార్గాలలోకి మళ్లాలని భావిస్తున్నారు. ఇందుకు గల కారణాలు..

రైతులు ఆరుగాలం శ్రమిస్తున్నప్పటికీ..

ప్రస్తుతం వాతావరణంలో మార్పులు, చీడ పీడల వలన దిగుబడులు తగ్గడం, నానాటికీ ఎగబాకుతున్న సాగు ఖర్చులు, పండించిన పంటకు మద్దతు ధర దక్కని పరిస్థితి, భరోసా కల్పించని ప్రభుత్వ విధానాలు, వెంటాడుతున్న రుణ భారం లాంటి కారణాలు దశాబ్దాల తరబడి వేధిస్తుండటంతో రైతాంగం నష్టాల సాగు కొనసాగించలేక కాడి పడేస్తున్నారు. గడచిన మూడు దశాబ్దాలుగా దేశీయంగా సాగు భూముల నికర విస్తీర్ణం 14 కోట్ల హెక్టార్ల దగ్గరే నిలిచిపోయింది. ఇది మరింత తగ్గే అవకాశం ఉంది. ఎన్ఎస్ఎస్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా యాభై శాతం రైతులపై సగటున రూ.74 వేల రుణభారం ఉంది. ఆరుగాలం శ్రమిస్తున్నా ఫలితం లేక, అప్పులు తీర్చే దారి కానక గత పదేళ్లలో లక్ష మందికి పైగా అన్నదాతలు బలవన్మరణం పాలయ్యారు. క్షీణిస్తున్న రైతుల ఆదాయాలు, పెరుగుతున్న గ్రామీణ రుణభారం భారతీయ వ్యవసాయాన్ని వెనక్కి లాగుతున్నాయి.

కంటి తుడుపు మద్దతు ధర

భారత్ సంపన్న రాజ్యంగా ఆవిర్భవించాలన్న భారతావని స్వప్నం నిజం కావాలంటే ముందుగా సుమారు 46 శాతం దేశ జనాభాకు ఉపాధి కల్పిస్తున్న సాగు రంగం లాభసాటి కావాలి. సేద్యం లాభదాయకం అవుతున్న కొద్దీ యావద్దేశం ఆర్ధికంగా పురోగమిస్తుంది. ఆర్థిక సర్వే ప్రకారం భారత జీఏవీ (స్థూల విలువ జోడింపు)లో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 2011-12 నుంచి 2023-24 మధ్య 225 శాతానికి పెరిగింది. గత ఐదేళ్లుగా దేశ వ్యవసాయాభివృద్ధి సగటు రేటు 3.5 శాతం. ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. కానీ రైతుకు ఒరిగింది మాత్రం శూన్యం. భూమి విలువతో పాటు అన్ని రకాల ఖర్చులు లెక్కించి, ఆ మొత్తానికి 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధర ఇవ్వాలన్న స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయకుండా కేవలం కొన్ని పంటలకు మాత్రమే హేతుబద్ధత లేని ఎంఎస్‌పి ప్రకటించి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయి. ద్రవ్యోల్బణానికి తగినట్లు రైతుల ఆదాయాలు పెరగలేదని వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ తెలిపింది.

ఆధునీకరణ కీలకం!

ఉపాధి కల్పన, గ్రామీణ జీవనోపాధిలో సాగురంగం కీలకంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం అత్యంత ఆవశ్యకం. వివిధ వ్యవసాయ ఉత్పత్తుల్లో భారత‌దేశం అగ్రస్థానంలో ఉన్నప్పటికీ హెక్టారుకు వచ్చే సగటు ఉత్పత్తి, ఉత్పాదకతలో మాత్రం అట్టడుగున ఉంది. జన్యు మార్పిడి పంటలు, ఏఐ సాయంతో ఈ పరిస్థితి అధిగమించి అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా సగటు ఉత్పాదకతను సాధించవచ్చు. వ్యవ సాయంలో తాజా ఆవిష్కరణలు, నూతన వ్యవసాయ విధానాలు, ఫలప్రదమైన నూతన వంగడాల అభివృద్ధి వలన ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యం పెరుగుతోంది. అలాగే సాగులో ఖర్చులను, ప్రతికూలతలను తగ్గించడంలో, వనరుల సమర్ధ నిర్వహణలో అవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. కృత్రిమ మేధ (ఎఐ), డేటా విశ్లేషణ ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని కూడా విప్లవాత్మకంగా మార్చుతున్నాయి. మహారాష్ట్రలోని బారామతి రైతులు మైక్రోసాఫ్ట్ కంపెనీతో జతకట్టి ఏఐ సాయంతో ప్రయోగాత్మకంగా చేపట్టిన చెరకు సాగు రైతు లోకానికి మార్గదర్శకంగా మారింది. దీని వలన పెట్టుబడి ఖర్చు సగానికి సగం తగ్గిపోగా దిగుబడి 30 శాతం పెరిగింది. అందుకే సాగు రంగంలో సుమారు 90 శాతం ఉన్న చిన్న కమతాలను డిజిటల్ సేద్యంలోకి తీసుకురావాలి.

ప్రభుత్వ మద్దతు అవసరం!

ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగాన్ని ప్రధాన వృద్ధి చోదకాలలో మొదటిదిగా పేర్కొని ప్రత్యేక కేటాయింపులు చేశారు. ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం ద్వారా దేశంలో వ్యవసాయంలో వెనుకబడిన వంద జిల్లాలలో సేద్యాన్ని అభివృద్ధి చేయడం ద్వారా 1.7 కోట్ల రైతులకు సహాయపడాలని, వీటి పరిధిలోకి రాని వర్షధార సేద్య ప్రాంతాలకు సాగునీటి సరఫరా, ఆధునిక సాంకేతికతలను అందించడం ద్వారా పంట దిగుమతులను పెంచాలని ప్రభుత్వం లక్ష్యిస్తోంది. దేశీయంగా డెబ్బై రకాలకు పైగా పంటల సాగుకు వీలున్నప్పటికీ 85శాతం భూముల్లో ఇరవై రకాలనే పండిస్తున్నారు. ప్రభుత్వం సాగు పరిశోధనలపై వెచ్చించే ప్రతి రూపాయికి రూ.13.85 ప్రతిఫలం వస్తుందని అనేక అధ్యయనాలు చాటాయి. అయినప్పటికీ ఈ రంగంపై ప్రభుత్వ ఖర్చు తక్కువే. ఏటా రూ.5 లక్షల కోట్ల చొప్పున రానున్న ఐదేళ్లు నిధులు కేటాయిస్తే గాని నిజమైన అభివృద్ధి సాకారమై గ్రామీణుల జీవితాలు మెరుగుప డవన్న ఆర్ధిక వేత్తల సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు, నాణ్యమైన పరిశోధనలు, రైతు మద్దతు, పర్యావరణానికి అనుకూలమైన విధానాలతోనే భారతదేశం సమ్మిళిత అభివృద్ధి సాధించి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోగలదు.

- లింగమనేని శివరామ ప్రసాద్

రాజకీయ, సామాజిక విశ్లేషకులు

79813 20543

Next Story