పోలీసుల కర్కశత్వానికి తగిన శిక్ష!

by Ravi |   (  Updated:2026-04-08 00:31:15  IST  )

తమిళనాడులో జరిగిన లాకప్ డెత్ కేసులో పోలీసులకు విధించిన మరణ శిక్ష సంచలనం రేపింది. ఈ ఘటనతో పోలీసు సంస్కరణలు, జవాబుదారీతనం, ప్రజా నమ్మకం పునరుద్ధరణ అవసరం మరింత స్పష్టమైంది.

పోలీసుల కర్కశత్వానికి తగిన శిక్ష!
X

తమిళనాడులో ఆరేళ్ల క్రితం జరిగిన పాశవిక ఘటన ‘లాకప్ డెత్’ కేసులో తొమ్మిది మంది పోలీసులను ముద్దాయిలుగా ఖరారు చేస్తూ వారందరికీ మరణ శిక్ష విధించడం సంచలనం కలిగించిన తీర్పు. కరోనా సమయంలో లాక్‌డౌన్ నిబంధనల్ని అతిక్రమించారన్న కారణంతో చిరు వ్యాపారులైన తండ్రీ కొడుకులను అరెస్ట్ చేశారు.. వారిని ఆ రాత్రంతా చిత్రహింసలకు గురిచేయగా వారు ఇరువురూ ప్రాణాలు కోల్పో యారు.. ఆ దుర్మార్గపు చర్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, ఆందోళన నింపగా మద్రాస్ హైకోర్టు సూమోటోగా కేసుని స్వీకరించి సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఫలితంగా పోలీసుల నేరం నిరూపణ అయ్యింది. ఇంకా బాధాకరమైన విషయమేమిటంటే ఆ మృతు లిద్దరూ లాక్‌డౌన్ నిబంధనల్ని కూడా అతిక్రమించలేదని వెల్లడైంది. ఆ సంఘటనకి బాధ్యులైన 9 మంది పోలీసు అధికారులకూ ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించడం సరైన తీర్పు.. ఇంకా పైకోర్టులో అప్పీళ్లు, న్యాయ ప్రక్రియలు పూర్తయ్యి అంతిమ తీర్పు రావడం ఎలా ఉన్నా ప్రస్తుతానికి బాధిత కుటుంబాలకు ఊరట. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, చేయగూడని పనులు చేసే అధికారులకు ఇది ఒక హెచ్చరిక. ఇదే సమయంలో పోలీసులు సంస్కరణల దిశగా ఆలోచించాలి. రక్షక వ్యవస్థ పౌరుల పట్ల స్నేహపూరితంగా వ్యవహరిస్తూ, చట్టాల్నీ, రూల్స్‌ను గౌరవిస్తూ, తిరిగి గౌరవం, నమ్మకం పొందే వ్యవస్థగా రూపుదిద్దాలి. పోలీసు వ్యవస్థ ఎలా సంస్కరింపబడాలో సిఫార్సులు ఇచ్చినా దశాబ్ద కాలంగా ఆచరణ కోసం ఎదురు చూస్తున్నాయి. వాటిని అమలుచేసే మార్గం చూడాలి. పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య రాజకీయ వత్తిడులు. వాటిని తగ్గించగలిగితే ఒక గాడిన పడుతుంది. రెండో పెద్ద సమస్య జవాబుదారీతనం స్పష్టంగా లేకపోవడం. అందుకోసం జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో కమిటీలు ఏర్పాటు కావాలని నిపుణుల సిఫార్సు ఉంది. వారు ఎదుర్కొంటున్న విపరీత పని వత్తిడి సమస్య, సిబ్బంది లేమి, దర్యాప్తు, శాంతి భద్రతలని వేర్వేరుగా నిర్వహించే యంత్రాంగం లాంటివి తీర్చుతూనే, తప్పుడు పనులు చేసే అధికారుల్ని వెంట నే కఠినంగా శిక్షించే ఏర్పాట్లు ఉండాలి. అప్పుడే సమాజానికి శాంతి, భద్రతలకు భరోసా దొరుకుతుంది.

-డా.డి.వి.జి.శంకరరావు,

9440836931

Next Story