- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుల కోసం కొత్త చట్టాలు.. ఇప్పుడైనా రైతుల ప్రయోజనాలు పెరిగేనా?
భారత వ్యవసాయ రంగం ప్రస్తుతం నిత్యం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. రైతుల ఆదాయం, పంట దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తుల

భారత వ్యవసాయ రంగం ప్రస్తుతం నిత్యం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. రైతుల ఆదాయం, పంట దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తుల కోసం ప్రభుత్వాలు అనేక విధానాలు అమలు చేస్తున్నా, కొంతకాలంగా నకిలీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు, నాణ్యతలేని ఎరువుల వాడకంతో వ్యవసాయ రంగానికి తీవ్రమైన హాని జరుగుతోంది. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఇటీవల విత్తనాల చట్టం (1966), పురుగు మందుల చట్టం (1968) లలో సవరణలు చేయాలని నిర్ణయించింది. ఇది రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు తీసుకున్న ఒక సంస్కరణాత్మక అడుగు.
దేశవ్యాప్తంగా ప్రతి సీజన్‌కు ముందుగా విత్తనాలు, పురుగుమందుల డిమాండ్ పెరిగే సందర్భాల్లో కొన్ని తక్కువ ధరకే వస్తాయి. కానీ నాణ్యత లేని ఉత్పత్తులు రైతులకు చేరడం పరిపాటి అయింది. ఇవి ముఖ్యంగా చిన్న, మధ్యస్థ రైతులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. తెలంగాణలో, ప్రత్యేకించి పత్తి సాగు సందర్భంగా నకిలీ BT విత్తనాల వినియోగం అధికమైంది. నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో దీనివల్ల పంటలు నష్టపోయిన ఘటనలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా నకిలీ లేదా తేదీ ముగిసిన పురుగు మందుల విక్రయం, అనధికారిక డీలర్ల రవాణా, రైతులకు సరైన సమాచార లోపం వంటి సమస్యలు ఉనికిలో ఉన్నాయి. ఈ పరిస్థితిలో రైతులు ఖర్చు పెట్టిన పెట్టుబడికి దిగుబడి రాకపోవడం, అప్పుల ఊబిలోకి వెళ్లడం వంటి దుస్థితులను ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ.. చర్యలో చురుకైన ప్రభుత్వం
రైతుల సంక్షేమానికి న్యాయంగా 1966లో రూపొందించిన విత్తనాల చట్టం అప్పటి అవసరాలకు సరిపడేలా ఉండగా, ప్రస్తుతం వచ్చిన కొత్త టెక్నాలజీలు, మార్కెట్ వ్యవస్థలు, వాణిజ్య సవాళ్లకు ఇది తగదు. ఇదే విషయాన్ని వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ సందర్భంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టంగా వివరించారు. 72,000 గ్రామాల్లో రైతులతో జరిగిన ప్రత్యక్ష చర్చల్లో 1.34 కోట్ల మంది రైతులు నకిలీ విత్తనాలు, మందుల వల్ల తాము నష్టపోతున్నామని చెప్పిన విషయం ఈ చట్ట సంస్కరణల వెనుక ఉన్న ప్రధాన ప్రేరణ. తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యను తక్షణమే గుర్తించి, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ద్వారా సోదాలు నిర్వహించింది. అనధికారికంగా విక్రయిస్తున్న విత్తనాలపై ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం, పర్యా వరణ పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేయడం ద్వారా చట్టం అమలులో గట్టి సందేశం పంపింది. అయినప్పటికీ, జిల్లాల్లో డీలర్ల లైసెన్సింగ్, సరఫరా గొలుసు పర్య వేక్షణ వంటి అంశాల్లో ఇంకా మెరుగుదల అవసరమని స్పష్టమవుతోంది.
ఆంధ్రప్రదేశ్.. సమర్థ పరిష్కారం అవసరం!
ఆంధ్రప్రదేశ్‌లో మండల వ్యవసాయాధికారులు, కృషి విజ్ఞాన్ కేంద్రం, రైతు సేవా కేంద్రాల మధ్య సమన్వయ లోపాలు వల్ల నకిలీ పురుగు మందులు కొన్ని మార్గాల్లో వ్యవసాయ భూములకు చేరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇండస్ట్రియల్ కెమికల్స్ లేదా హౌస్‌హోల్డ్ ఇన్సెక్టిసైడ్స్ వ్యవసాయ మద్దతుగా విక్రయించబడ్డ ఉదాహరణలు కూడా ఉన్నాయి.
మార్పులు ఎందుకు కీలకమంటే?
రైతు ఆదాయ రక్షణ నకిలీ ఉత్పత్తుల వల్ల పూర్తిగా పంటకు నష్టమవుతోంది. నాణ్యమైన విత్తనాల వల్ల ఇది తప్పించుకోవచ్చు. ఉత్పత్తి పెరుగుదల ట్రేసబిలిటీ, QR కోడ్ వ్యవస్థలు, NABL ల్యాబ్‌లు ద్వారా విత్తనాల నాణ్యతను నిశితంగా పరీక్షించవచ్చు. పర్యావరణ పరిరక్ష ణ కల్తీ పురుగు మందులు నేల, నీటిని కలుషితం చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ఇది అవరోధం. మార్కెట్ పారదర్శకత KVKs జాతీయ స్థాయిలో శిక్షణ కేంద్రాలు మాత్రమే కాక, ఇప్పుడు మార్కెట్ పర్యవేక్షణలోనూ కీలకంగా వ్యవహరించాలి.
ఉత్తమమైన రాష్ట్రీయ నమూనాలు..
ఇతర రాష్ట్రాల నుంచి నేర్చుకోవలసిన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలో QR కోడ్ ఆధారిత విత్తన ప్యాకెట్లను వ్యవసాయ శాఖ పంపిణీ చేస్తున్నది. రైతులు దాన్ని స్కాన్ చేసి విత్తన వివరాలను తెలుసుకునే వీలు ఉంది. పంజాబ్‌లో Agri-Mark పేరుతో ప్రతీ విత్తన బ్యాచ్‌ను త్రీ లెవల్ టెస్టింగ్ ద్వారా కచ్చితంగా ధృవీకరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సీడ్ విలేజ్ పోగ్రాం ద్వారా రైతులే గింజల ఉత్పత్తిలో పాల్గొని, నేరుగా తమ పరిసర రైతులకు విక్రయం చేస్తూ నాణ్యతను నిలుపుతున్నారు. కేరళలో అవగాహన కోసం WhatsApp చానెల్స్, రేడియో మాడ్యూల్స్, మొబైల్ అప్లికేషన్ల ద్వారా రైతుల కు నకిలీ ఉత్పత్తులపై ప్రతిరోజూ సూచనలు అందిస్తున్నారు. ఈ విధానం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలులోకి రావచ్చు.
ఒక భవిష్యత్ దిశగా..
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విత్తనాల నాణ్యతకు సంబంధించి తీసుకు రాబోతున్న ఈ చట్ట సంస్కరణలు చాలా కీలకమైనవి. రైతులకు ఇది భద్రతతో కూడిన వ్యవసాయ సాధనాల వినియోగానికి మార్గం చూపుతుంది. ఇది రైతు బంధు, అన్నదాత, పీఎం కిసాన్, భరోసా, వంటి పథకాల ద్వారా రైతులకు అందుతున్న ప్రయోజనాలను మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాక, ఈ సంస్కరణలు రాష్ట్రాల్లో ఎగుమతుల నాణ్యత, సర్టిఫికేషన్ వ్యవస్థల పెంపు, ఎగుమతికి సిద్ధంగా ఉన్న పంటల విస్తరణకు తోడ్పడతాయి. రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఇది కీలకంగా మారుతుంది.
ఇదో గొప్ప అడుగు..
విత్తనాల చట్టం, పురుగు మందుల చట్టంలో వచ్చే మార్పులు, రైతుల ప్రయోజనాలను కేంద్రంగా ఉంచిన ముఖ్యమైన చర్యలు.. ఈ నూతన విధానాల అమలులో KVKs, రాష్ట్ర వ్యవసాయ శాఖలు, ప్రైవేటు సంస్థలు, రైతు సంఘాలు భాగస్వామ్యంగా ముందుకు వచ్చాయి. భవిష్యత్తును నడిపించేవి నిబంధనలు మాత్రమే కాదు.. నైతిక బాధ్యతలు కూడా కావాలి. ఈ సంస్కరణలు రైతుల నమ్మకాన్ని తిరిగి పొందే దిశగా, వ్యవసాయ రంగాన్ని సురక్షితంగా స్థిరంగా తయారుచేసే మార్గంలో ఒక గొప్ప అడుగు.
-షేక్ మీరా అటారీ
డైరెక్టర్, ICAR-ATARI,
90006 80909






