పాఠ్యప్రణాళికలు జాతిని నిర్దేశించాలి

by Disha edit |
పాఠ్యప్రణాళికలు జాతిని నిర్దేశించాలి
X

దేశంలో ఇప్పటివరకు అమలు పరిచిన విద్యా ప్రణాళికలు విద్యార్థులను మార్కులు, ర్యాంకుల వైపు పరిగెత్తించేవే. మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఒత్తిడి పెంచుతూ సహజ సృజనాత్మకను అణిచివేస్తున్నారు. సైన్స్, లెక్కలకే ప్రాధాన్యం ఇస్తూ మానవీయ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఎందుకు చదువుతున్నామో తెలియకుండానే విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేస్తున్నారు. విద్యార్థి దశలో ఉపాధ్యాయులతో ఎలా మెలగాలో తెలియనివారు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందుతున్నారు. విద్య వ్యాపారంగా మారింది. సంస్కారం కన్నా మార్కులే ప్రధానమనే విధంగా తయారైంది పరిస్థితి. పరీక్షలకు సిద్ధమవుతున్న పిల్లలలో 75 శాతం ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

దేశ విద్యా ప్రణాళిక అయినా ఆ దేశ అవసరాల దార్శనికతను ప్రతిబింబించాలి. విద్యాప్రణాళికలో భారీ మార్పులు చేయడంలో, సంస్కరణలు తేవడంలో, పుస్తకాల తయారీలో, సమన్వయంతో విద్యా లక్ష్యాల సాధనను నిర్ణయించడంలో, రూపొందించడంలో మేధావులు భాగస్వాములు కావాలి. కానీ, దురదృష్టవశాత్తు మన దేశం విద్యా పాఠ్య ప్రణాళికలో ఆశించిన మార్పులు రావడం లేదు. మన పిల్లలు ఇంకా అభ్యసనలకు, కంఠస్థం పట్టడానికే మొగ్గుచూపుతున్నారు. పాఠశాల నుంచి ట్యూషన్ తరగతులకు వెళ్తూ బాల్యాన్ని కోల్పోతున్నారు. మార్కుల కోసం చదువుతూ వాస్తవ ప్రపంచానికి దూరంగా, పుస్తక ప్రపంచంలో తమను తాము బంధించేసుకుంటున్నారు. అయితే, ఈ దుస్థితిని పారదోలేలా నూతన విద్యా ప్రణాళిక నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

వాటిని రూపుమాపడానికి

మన దేశంలో ఉన్న 15 లక్షల పాఠశాలలలో సుమారు 26.44 కోట్ల మంది పిల్లలు చదువుతున్నారు. దేశంలో ఇప్పటివరకు నాలుగుసార్లు జాతీయ విద్యా విధానాలను రూపొందించారు. 1968లో తొలిసారిగా జాతీయ విద్యా విధానం అమలులోకి వచ్చింది. దానికి అనుగుణంగా 1975లో మొదటి జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్ వర్క్ తయారైంది. 1986లో రెండవ విద్యా విధానానికి అనుగుణంగా 1988లో రెండవ పాఠ్య ప్రణాళిక, 2000 సంవత్సరంలో మూడవ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్ వర్క్, 2005 లో నాలుగో పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్ వర్క్ రూపొందాయి.

ఇటీవల కేంద్రం జాతీయ విద్యా విధానం-2020 ను ప్రకటించింది. దాని కోసం పాఠ్య ప్రణాళిక తయారు చేయాలని ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ నేతృత్వంలో ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానల్ నాలుగు రకాలుగా జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్ వర్కును అభివృద్ధి చేయనుంది. అవి శిశువిద్య, పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్య, వయోజన విద్య. ఇందుకోసం దేశం నలుమూలల నుంచి విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను స్వీకరించనుంది. భిన్న సంస్కృతులున్న దేశంలో మానవత, సహనశీలత, ఉత్తమ విలువలు పెంపొందించడానికి, సమాజంలో చిరకాలం నుండి పాతుకుపోయిన అన్యాయాలు, హింస, అసమానతలను రూపుమాపడానికి ఈ విద్యా ప్రణాళికలు ఉపయోగపడనున్నాయి.

సంపూర్ణ జీవితానికి పునాదిలా

దేశంలో ఇప్పటివరకు అమలు పరిచిన విద్యా ప్రణాళికలు విద్యార్థులను మార్కులు, ర్యాంకుల వైపు పరిగెత్తించేవే. మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఒత్తిడి పెంచుతూ సహజ సృజనాత్మకను అణిచివేస్తున్నారు. సైన్స్, లెక్కలకే ప్రాధాన్యం ఇస్తూ మానవీయ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఎందుకు చదువుతున్నామో తెలియకుండానే విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేస్తున్నారు. విద్యార్థి దశలో ఉపాధ్యాయులతో ఎలా మెలగాలో తెలియనివారు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందుతున్నారు. విద్య వ్యాపారంగా మారింది. సంస్కారం కన్నా మార్కులే ప్రధానమనే విధంగా తయారైంది పరిస్థితి.పరీక్షలకు సిద్ధమవుతున్న పిల్లలలో 75 శాతం ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

నాలుగో విద్యా ప్రణాళికలో కంఠస్థ పద్ధతులు, బయటి జీవితానికి జ్ఞానం అన్వయించడం, పాఠ్యపుస్తక కేంద్రంగా, శిశు కేంద్రంగా, సమగ్ర శిశు విద్యా ప్రణాళికలను అభివృద్ధి చేయడం, సరళ పరీక్ష విధానం అనుసరించడం, బరువుకాని చదువును అందించడం మొదలైన మార్పులు తీసుకువచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఇది పిల్లల ఎదుగుదలకు ప్రతికూలంగా మారుతున్నది. అందుకే నూతన విద్యా ప్రణాళిక విద్యార్థి అభిరుచులకు, వైవిధ్యాలకు అనుగుణంగా, ప్రతిభను ప్రోత్సహించే విధంగా ఉండాలి. క్రీడలు, కళలలో ప్రతిభ చూపిన పిల్లలను విద్యాసమానులుగా పరిగణించాలి. విద్యా విధానం సంపూర్ణ జీవితానికి పునాదిలా ఉండాలి. దేశంలో హెచ్చు మీరుతున్న లైంగిక హింస, అత్యాచారాలు, కులమత ఘర్షణలను అరికట్టేలా, చిన్నారులలో నైతిక విలువలు పెంపొందించేలా ఉండాలి. ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు వృత్యంతర శిక్షణ ఇచ్చి , తగిన పరీక్షలు నిర్వహించి కాలానుగుణంగా మార్పులకు తగినట్లుగా తయారుచేయాలి.

అంకం నరేశ్

UFRTI రాష్ట్ర కో-కన్వీనర్

6301650324



Next Story