- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాస్వామ్యంలో ప్రశ్న నేరం కాదు..
నీట్ ప్రశ్నాపత్రం లీక్ నేపథ్యంలో విద్యార్థుల నిరసనలు, ప్రభుత్వ జవాబుదారీతనం, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు, నైతిక బాధ్యత, విద్యా వ్యవస్థపై నమ్మకం, రాజకీయ స్పందన, సమాజంలో ప్రముఖుల పాత్ర వంటి అంశాలపై విశ్లేషణ..

ఒక దేశ భవిష్యత్తు ఆ దేశ యువత చేతుల్లో ఉంటుంది. కానీ అదే యువత తమ విద్య, ఉపాధి, భవిష్యత్తు కోసం వీధుల్లోకి వచ్చి ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడితే, అది కేవలం ఒక పరీక్షా వ్యవస్థ వైఫల్యం కాదు.. పాలన, ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం ఎదుర్కొంటున్న సంక్షోభం. నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై ఆందోళనలు, విద్యార్థుల నిరసనలు, వాటిపై అధికార యంత్రాంగం స్పందించిన తీరు ప్రజాస్వామ్య విలువలు, రాజకీయ నైతికత, ప్రభుత్వ బాధ్యతలపై మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి..
ఒక దేశ అభివృద్ధిని ఆ దేశ యువత జీవన పరిస్థితులే తెలియజేస్తాయి. వారికి నాణ్యమైన విద్య, చదువు పూర్తయ్యాక ఉపాధి, తమ కష్టానికి తగిన అవకాశాలు, భవిష్యత్తుపై భరోసా ఉన్నాయా? తమ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా? ప్రజాస్వామ్యం అంటే ఐదేళ్లకోసారి ఓటు వేయడం మాత్రమే కాదు.. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పడం, పాలకులను ప్రశ్నించడం, అన్యాయంపై శాంతియుతంగా నిరసన తెలపడం, అధికారాన్ని జవాబుదారీగా నిలబెట్టడం కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తిలో భాగమే.
నిరసనను అణచొచ్చు.. ప్రశ్నలను కాదు..
జంతర్ మంతర్‌లో నిరసన చేస్తున్న వారు ఉగ్రవాదులు కాదు.. రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగిస్తున్న పౌరులు. తమ హక్కులు, భవిష్యత్తుకు హామీ కోరుతున్న యువత. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం లాఠీలతో స్పందిస్తే అది పాలన కాదు, ప్రజాస్వామ్య వైఫల్యం. తీవ్రమైన నేరాలపై కనిపించని ఆగ్రహం, ప్రశ్నించిన విద్యార్థులపై చూపితే ప్రజలు గమనిస్తారు. ప్రజల గొంతును అణచివేయవచ్చు కానీ ప్రశ్నలను కాదు.. లాఠీలు శరీరాలను గాయపరచగలవు కానీ హక్కుల కోసం పోరాడే సంకల్పాన్ని కాదు. చరిత్ర చెబుతున్న సత్యం ఒక్కటే.. జవాబుదారీతనం లేని ప్రభుత్వాలు ప్రజల తీర్పు ముందు నిలవలేవు.
ఈ ప్రశ్నలు అడిగే ధైర్యం ఉండాలి!
నీట్ పేపర్ లీక్ నిరసనలో హిందూ దేవుళ్ల ప్రస్తావన ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్న వారికి కొన్ని ప్రశ్నలు.. ఎన్నికల ప్రచారంలో రాముడు, హనుమంతుడి పేర్లు, రూపాలు ఉపయోగించినప్పుడు ప్రశ్నించారా? తీవ్ర నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పార్టీలో చేర్చుకున్నప్పుడు, నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు, ప్రశ్నించారా? రామమందిరం చుట్టూ అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రశ్నించారా? అప్పుడు మౌనంగా ఉన్నవారు, ఇప్పుడు మాత్రం ఒక నిరసనలో దేవుడి పేరు ప్రస్తావనకు నీతులు చెప్పడం ఎందుకు? అయినా ఒక రాజకీయ పార్టీని ప్రశ్నిస్తే హిందూ వ్యతిరేకి అనడం సరైంది కాదు. హిందూ మతం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన సంప్రదాయం. ఎన్నో సామ్రాజ్యాలు, యుద్ధాలు, సామాజిక మార్పులను తట్టుకుని నిలిచిన ఈ మతం ఒకరి అభిప్రాయాలతో ప్రమాదంలో పడదు. హిందూమతం ఒక పార్టీ ఉన్నా లేకపోయినా అది కొనసాగుతుంది. ఒక నిరసనలో దేవుడి పేరు ఎందుకు వచ్చిందని అడిగే ముందు, ఎన్నికల్లో దేవుళ్ల పేర్లతో ఓట్లు అడగడం, మతాన్ని రాజకీయ ప్రచారానికి ఉపయోగించడం, మత భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం, ప్రజలను మతాల పేరుతో విభజించడం వంటి విషయాలనూ ప్రశ్నించాలి. దేవుడి పేరును రాజకీయాల్లోకి ఎవరు? ఎప్పుడు, ఎందుకు తీసుకొచ్చారో కూడా ప్రశ్నించే ధైర్యం ఉండాలి.
నైతిక బాధ్యత ఎక్కడ?
ఒక శాఖలో భారీ వైఫల్యం జరిగితే సంబంధిత మంత్రి ప్రజల ముందు జవాబుదారీగా నిలబడి, అవసరమైతే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి.. ఇది కొత్త డిమాండ్ కాదు.. ప్రజాస్వామ్య విలువ. గతంలో బి.ఆర్. అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు విషయంలో, లాల్ బహదూర్ శాస్త్రి రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.. పదవి అనేది అధికారాన్ని అనుభవించడానికే కాదు, బాధ్యతను స్వీకరించడానికీ. నేడు కీలక పరీక్షా వ్యవస్థపై తీవ్రమైన ఆరోపణలు, విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళనలు, వ్యవస్థపై విశ్వాసం దెబ్బతింటున్నప్పుడు సంబంధిత మంత్రి కూడా నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి, వ్యవస్థ విఫలమైతే బాధ్యత తీసుకోవాలి.
తెలుగు సినీ పెద్దలు ఎక్కడ ఉన్నారు?
దేశ రాజధానిలో విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం రోడ్డెక్కి ప్రశ్నలు అడుగుతుంటే, తెలుగు సినీ ప్రపంచం మాత్రం ఎందుకు మౌనంగా ఉంది? హీరోల కోసం రోడ్లపైకి వచ్చే, సినిమాలకు వందల కోట్లు కలెక్షన్లు తెచ్చే, సోషల్ మీడియాలో ట్రెండ్లు నడిపే అదే యువత ఈరోజు లాఠీ దెబ్బలు తింటుంటే వారి కోసం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదు? సమాజంపై ప్రభావం ఉన్న సెలబ్రిటీలు అవసరమైన సమయంలో ఒక మాట మాట్లాడినా అది లక్షల మందికి చేరుతుంది. సినిమా ప్రమోషన్లు, బ్రాండ్‌ల కోసం స్పందించే వారు, దేశ యువత భవిష్యత్తు విషయంలో ఒక్క మాట మాట్లాడటానికి ఎందుకు ఇంత భయం?
-బసడ సంపత్ యాదవ్
70321 32593






