ప్రతిష్టాత్మక ‘తుమ్మిడిహెట్టి’ డీపీఆర్ సిద్ధం!

by Malleboina Mahesh |

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం కాగా.. నాలుగైదు రోజుల్లోనే ప్రభుత్వానికి చేరుకునే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.

ప్రతిష్టాత్మక ‘తుమ్మిడిహెట్టి’ డీపీఆర్ సిద్ధం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు (Tummidihetti Project) డీపీఆర్ సిద్ధం కాగా.. నాలుగైదు రోజుల్లోనే ప్రభుత్వానికి చేరుకునే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే హైడ్రాలజీ స్టడీస్, ఫీజిబిలిటీ స్టడీస్ సహా అన్ని అధ్యయనాలు పూర్తయ్యాయి. నేల పరిస్థితులు తెలుసుకునేందుకు చేస్తున్న జియో టెక్నికల్ టెస్టులు సైతం పూర్తి కాగా.. నివేదికలు త్వరలోనే అందనున్నట్లు తెలిసింది. అనంతరం ప్రభుత్వం పరిశీలించి మహారాష్ట్ర సీఎంతో చర్చలు జరిపేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

గతంలోలాగా కేవలం ప్రతిపాదనల దశలో కాకుండా పూర్తిస్థాయి సాంకేతిక అధ్యయనాల ఆధారంగా డీపీఆర్ రూపొందించినట్లుగా తెలిసింది. టోపోగ్రాఫికల్ సర్వేలు, జియోటెక్నికల్ పరిశోధనలు, హైడ్రాలజీ విశ్లేషణలు, నదీ ప్రవాహ అధ్యయనాలు, భూభాగ పరిస్థితులు, ముంపు అంచనాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. తుమ్మిడిహెట్టి బరాజ్‌ను 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద నిర్మించాలని డీపీఆర్‌లో ప్రతిపాదించడం ప్రాజెక్టులో అత్యంత కీలక అంశంగా మారింది.

త్వరలో మహారాష్ట్ర సీఎంతో రేవంత్ భేటీ..

బరాజ్ ఎత్తు 152 మీటర్లకు పెంచడం వల్ల మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా.. లేదా? అన్న సందిగ్ధం నెలకొంది. ఒకవేళ మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే సీడబ్ల్యూసీ, పర్యావరణ, అటవీ శాఖల అనుమతుల ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉన్నది. ఆ తర్వాత డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ పరిశీలనకు పంపి ఆమోదం అనంతరం పర్యావరణ, అటవీ, వన్యప్రాణి అనుమతులు, అవసరమైతే ఇతర కేంద్ర సంస్థల క్లియరెన్స్‌లు పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ప్రాజెక్టు వ్యయ అంచనాలకు తుది ఆమోదం, నిధుల సమీకరణ, టెండర్ల పిలుపు, నిర్మాణ సంస్థల ఎంపిక వంటి తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉన్నది.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం త్వరలో మహారాష్ట్ర సీఎంతో సమావేశమై చర్చించనున్నట్టు సమాచారం. అయితే.. బరాజ్‌ను 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే దాదాపు 129 టీఎంసీల జలాలను తరలించుకునే ఆస్కారం ఉన్నదని అధికారులు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. 149.5 మీటర్ల ఎత్తులో కడితే 108 టీఎంసీల వరకు నీటి లభ్యత ఉంటుందని పేర్కొన్నట్టు సమాచారం.

అలైన్‌మెంట్ సర్వే పూర్తి..

మరోవైపు.. ప్రాణహిత నది జలాలను తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల బ్యారేజీకి తరలించేందుకు ఈ ప్రాజెక్టును కొత్తగా డిజైన్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన అలైన్‌మెంట్ సర్వే పూర్తయి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందినట్లు సమాచారం. ఆర్వీ కన్సల్టెన్సీ సంస్థ అలైన్‌మెంట్ రిపోర్టును సిద్ధం చేసి అందజేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే.. తుమ్మిడిహెట్టి విషయంలో గతంలో ఒక బ్యారేజీగా నిర్మిస్తే 45 డిగ్రీల వంపు వచ్చి వరదలతో బ్యారేజీ నిర్మాణానికి డ్యామేజ్ జరిగే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే పెన్ గంగ, వార్థాలపై బరాజ్‌లు నిర్మించి.. ఆ రెండింటిని కలిపేలా కాంక్రీట్ బండ్‌ను నిర్మించాలని సూచించినట్లు తెలిసింది.

Next Story