ఆగని అక్రమ దందా.. పాన్ షాపుల్లో స్లో పాయిజన్

by Malleboina Mahesh |

మాదకద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, డ్రగ్స్ నెట్‌వర్క్‌ల వెన్ను విరుస్తోంది.

ఆగని అక్రమ దందా.. పాన్ షాపుల్లో స్లో పాయిజన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అడుగులు వేస్తోంది. ఆహార సంస్థల్లో నాణ్యతను పర్యవేక్షించేందుకు హెచ్‌ఫాస్ట్ పేరుతో టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపింది. అలాగే, మాదకద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, డ్రగ్స్ నెట్‌వర్క్‌ల వెన్ను విరుస్తోంది. అయితే, ఏళ్ల క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిషేధించిన గుట్కా, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తుల విషయంలో మాత్రం అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కాగితాల్లో నిషేధం అమలవుతున్నా.. వాస్తవానికి ప్రతి గల్లీలోనూ ఈ స్లో పాయిజన్ ప్యాకెట్లు యథేచ్ఛగా దొరుకుతుండటం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తి చూపుతుంది.

బహిరంగంగా విక్రయాలు..

తెలంగాణలో గుట్కా, పాన్ మసాలా పొగాకు, నికోటిన్ కలిగిన ఉత్పత్తుల తయారీ, నిల్వ, పంపిణీ, విక్రయాలపై ప్రభుత్వం ఏటా నిషేధాన్ని పొడిగిస్తూనే ఉంది. ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం ఈ ఉత్పత్తులు ఆరోగ్యానికి అత్యంత హానికరమని తేల్చడంతో రాష్ట్రంలో వీటికి చోటు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. హోటళ్లలో వంట గదులు, ఫ్రిజ్ లోపల నిల్వలను తనిఖీ చేస్తూ భారీగా జరిమానాలు విధిస్తున్న ఆహార భద్రతా అధికారులు, అదే హోటల్ బయట, పక్కనే ఉన్న పాన్ డబ్బాల్లో గుట్టలుగా పేరుకుపోయిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నగరంలోని కిరాణా షాపుల నుంచి మొదలుకుని మారుమూల గ్రామాల వరకు ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.

సరిహద్దులు దాటి..

ఈ అక్రమ వ్యాపారానికి పొరుగు రాష్ట్రాలే ప్రధాన వనరులుగా మారాయి. కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర నుంచి నిత్యం టన్నుల కొద్దీ గుట్కా ప్యాకెట్లు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. సరిహద్దుల వద్ద తనిఖీలు నామమాత్రంగానే ఉండటం, కొన్ని చోట్ల నిఘా వర్గాల కళ్లుగప్పి ప్రైవేటు వాహనాలు, బస్సుల్లో ఈ సరుకును తరలిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్, శంషాబాద్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గోడౌన్లను ఏర్పాటు చేసుకుని, అక్కడి నుంచి చిన్న చిన్న ఏజెంట్ల ద్వారా రిటైల్ షాపులకు సరఫరా చేస్తున్నారు. కొన్ని చోట్ల పాన్ మసాలా ఒక ప్యాకెట్, పొగాకు మరో ప్యాకెట్‌గా వేర్వేరుగా విక్రయిస్తూ చట్టంలోని లొసుగులను వాడుకుంటున్నారు. కానీ, వాస్తవానికి ఇవన్నీ నిషేధిత కేటగిరీ కిందకే వస్తాయి.

గుట్కా మాఫియా పై ఫోకస్ ఏది?

గుట్కా, ఖైనీ వినియోగం వల్ల నోటి క్యాన్సర్, గొంతు వ్యాధులు వంటి ప్రాణాంతక సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కూలీలు, యువత ఈ వ్యసనాలకు బానిసలై తమ సంపాదనను తగలేయడమే కాకుండా ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. పదేపదే దాడులు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నా, పట్టుబడిన కొద్ది రోజుల్లోనే నిందితులు మళ్లీ అదే వ్యాపారంలోకి రావడం నిఘా వ్యవస్థలోని లోపాన్ని సూచిస్తోంది. అల్ప్రాజోలమ్, గంజాయి వంటి డ్రగ్స్‌ను పట్టుకోవడానికి ఈగల్ ఫోర్స్ చూపుతున్న శ్రద్ధను, గుట్కా మాఫియాను అణచి వేయడానికి చూపించాల్సిన అవసరం ఉంది. కేవలం విక్రేతల పైనే కాకుండా, వీటిని సరఫరా చేసే బడా వ్యాపారుల పై దృష్టి సారిస్తే ఈ గొలుసుకట్టు దందాను తెంచడం సాధ్యమవుతుంది. పోలీసు, ఆహార భద్రత, మున్సిపల్ శాఖలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో దాడులు నిర్వహిస్తేనే గుట్కా ముక్త్ తెలంగాణ సాధ్యమవుతుందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

Next Story