- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికార పార్టీకి ‘నై’... ప్రతిపక్షాలకు ‘జై’..! వేములవాడ మున్సిపాలిటీలో అధికారుల వింత తీరు!
వేములవాడ మున్సిపల్ అధికారుల తీరు పట్ల అధికార ‘హస్తం’ పార్టీ కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

వేములవాడ మున్సిపాలిటీలో అధికారుల తీరుపై అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు చెప్పిన పనులను పక్కనపెట్టి, బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్ల పనులను అధికారులు వెంటేనే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చెత్త తరలింపు, గుంతల పూడ్చివేత, ప్లానింగ్ అనుమతుల విషయంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారుల తీరుపై విసుగెత్తిన కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో పంచాయతీ ఛాంబర్‌కు చేరింది. తనకు తెలియకుండా పనులు చేస్తూ ప్రతిపక్షాలకు సహకరిస్తున్న అధికారుల తీరుపై చైర్మన్ సైతం గుర్రుగా ఉన్నారు. అవినీతి, అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చైర్మన్ సన్నాహాలు చేస్తున్నారు.
దిశ, వేములవాడ : వేములవాడ మున్సిపల్ అధికారుల తీరు పట్ల అధికార ‘హస్తం’ పార్టీ కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో తాము ఉన్నప్పటికీ.. తమ వార్డుల్లో పనుల గురించి చెబితే వారాలు, నెలలు గడిచినా కావడం లేదని కౌన్సిలర్లు వాపోతున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు చెప్పిన పనులను అధికారులు ఆఘమేఘాల మీద క్షణాల్లో పూర్తి చేస్తున్నారని అధికార పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 28 వార్డుల పరిధిలోని ప్రజల ప్రధాన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు తమకు ‘నై’ అంటూ, ప్రతిపక్షాలకు ‘జై’ కొడుతున్నారని తమ అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు తాము అధికార పార్టీలో ఉండడమే పెద్ద తప్పా అన్నట్లుగా మెజార్టీ కౌన్సిలర్లు మదనపడుతున్నారు.
ప్రధాన విభాగాల్లో అధికారుల నిర్లక్ష్యం..
మున్సిపల్ కార్యాలయంలోని శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల్లో అధికారులు ఎవరికి నచ్చిన రీతిలో వారు వ్యవహరిస్తున్నారని, కౌన్సిలర్ల మాటలను పెడచెవిన పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాకాలంలో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయిందని, రోడ్లపై గుంతలు ప్రమాదకరంగా మారాయని జేసీబీ, ట్రాక్టర్లను పంపాలని మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఓ కౌన్సిలర్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని, అనుమతులు ఇవ్వాలని కోరితే టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి కనీస స్పందన కరువైందని శివారు వార్డు కౌన్సిలర్ ఆరోపిస్తున్నారు.
చైర్మన్ ఛాంబర్‌కు చేరిన పంచాయితీ..
అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసహనంతో ఉన్న కౌన్సిలర్లు ఈ విషయాన్ని మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడంతో పంచాయితీ కాస్తా చైర్మన్ ఛాంబర్‌కు చేరింది. దీంతో రంగంలోకి దిగిన చైర్మన్ కౌన్సిలర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, సమస్యల తీవ్రతను బట్టి తక్షణమే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తూ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.
కౌన్సిలర్ల బాటలోనే చైర్మన్..
మరోవైపు అధికారుల వింత ధోరణితో కేవలం కౌన్సిలర్లే కాకుండా చైర్మన్ సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. తనకు తెలియకుండానే అధికారులు ఆయా వార్డుల్లో పనులు చక్కబెడుతున్నారని, ప్రతిపక్షాల మాటలకే ప్రాధాన్యం ఇస్తున్నారని చైర్మన్ కూడా తన వద్దకు వచ్చిన కౌన్సిలర్ల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అధికారుల అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్న నాయకులపై, వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు చైర్మన్ సిద్ధమవుతున్నట్లు పురపాలక వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.






