సెక్రటేరియట్ రూల్స్‌కు విరుద్ధంగా మెమో జారీ

by Malleboina Mahesh |

కార్మిక శాఖలో జారీ చేసిన ఓ మెమో వివాదాస్పదంగా మారింది. అందులోని అంశాలు సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నాయంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

సెక్రటేరియట్ రూల్స్‌కు విరుద్ధంగా మెమో జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : తాజాగా కార్మిక శాఖలో జారీ చేసిన ఓ మెమో వివాదాస్పదంగా మారింది. అందులోని అంశాలు సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నాయంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కార్మిక శాఖ పరిధిలోని ఓ హెచ్ఓడీకి (హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్) చెందిన ఫైల్స్‌ను సంబంధిత డైరెక్టర్‌కు నేరుగా పంపకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ముందుగా కార్మిక శాఖలో పనిచేస్తున్న ఓ అధికారికి పంపి, ఆయన సంతకం చేసిన తరువాతే డైరెక్టర్‌కు పంపాలంటూ మెమోలో పేర్కొన్నారు. ఈ విధంగా జారీ చేసిన ఆదేశాల వెనుక ఎదో మతలబు దాగి ఉందనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతోంది.

బిజినెస్ రూల్స్‌కు విరుద్ధం..

కార్మిక శాఖ ఈనెల 14న మెమో నం. SHAKTI/OPIMA2/91/2026 పేరుతో ఓ మెమోను జారీ చేసింది. అందులో ప్రధానంగా ఐఎమ్ఎఫ్ విభాగం( డైరెక్టరేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్)లో ఫైల్స్ రూటింగ్ ఎలా జరగాలో వివరించారు. కీలకమైన బడ్జెట్, పాలసీ, సర్వీస్‌తోపాటు ఇతర అంశాలకు చెందిన ఫైల్స్ నేరుగా డైరెక్టర్ పంపవద్దని పేర్కొన్నారు. అయితే సెక్రటేరియట్‌లోని కార్మిక శాఖలో పనిచేస్తోన్న అసిస్టెంట్ సెక్రటరీకు పంపి, అక్కడ క్లియర్ అయిన తరువాతనే డైరెక్టర్‌కు సమర్పించాలంటూ కండీషన్ పెట్టారు. ఈ కొత్త నిబంధన బిజినెస్ రూల్స్‌కు విరుద్ధమనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతున్నది.

ఎందుకంటే డైరెక్టరేట్‌లోని ఫైల్స్ రూటింగ్ సమయంలో సెక్రటేరియట్‌లో పనిచేసే అధికారుల జోక్యం ఉండకూడదని చెప్తున్నారు. ఒకవేళ సంబంధిత ఫైల్స్‌ను డిపార్ట్‌మెంట్‌లోని సెక్షన్ ద్వారా తెప్పించుకునే అధికారం ఉందని గుర్తు చేస్తున్నారు. అలా కాకుండా మెమోలో పేర్కొన్న అసిస్టింట్ సెక్రటరీకే ఐఎమ్ఎఫ్ విభాగానికి జాయింట్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించి, ఫైల్స్‌ను సర్క్యూలేట్ చేసే అధికారం ఇవ్వొచ్చని పేర్కొంటున్నారు.

ప్రతి ఏటా రూ. వందల కోట్ల కోనుగోళ్లు..

కార్మిక శాఖలోని ఐఎమ్ఎఫ్ విభాగం( డైరెక్టరేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్) హాట్ కేక్ లాంటిదనే ప్రచారం ఉంది. ఎందుకంటే కార్మికులకు సంబంధించిన ఈఎస్ఐ ఆస్పత్రులు, బోధన ఆస్పత్రి, డిస్పెన్సరీలు ఆ విభాగం పరిధిలో పని చేయాలి. ఆ విభాగమే కార్మికులకు, ఆస్పత్రులకు కావాల్సిన మెడిసిన్, ఎక్విప్‌మెంట్ అన్నింటినీ కొనుగోలు చేస్తుంది. ప్రతి ఏటా వందల కోట్ల విలువైన కొనుగోళ్లు జరుగుతుంటాయి. దీంతో అక్కడ పని చేసేందుకు అధికారులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతుంటారని టాక్ ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ‘ప్రయోజనాలు’ దక్కుతాయనే ప్రచారం ఉంది. దీంతో ఉన్నపళంగా సెక్రటేరియట్‌లోని అసిస్టెంట్ సెక్రటరీకి డైరెక్టరేట్‌లోని ఫైల్స్ విషయంలో జోక్యం చేసుకునే అధికారం ఇచ్చి, తమకు కావాల్సిననట్టు ఫైల్స్ తయారు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఎవరి ప్రయోజనాల కోసం?..

కొత్త రూల్స్ జారీ చేయడం వెనుక ఎవరికి ప్రయోజనం ఉందనే టాక్ నడుస్తున్నది. డైరెక్టరేట్‌లోని జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న అధికారి తాము ఆశించినట్లుగా పని చేయట్లేదనే కారణంతోనే సెక్రటేరియట్‌లోని అసిస్టెంట్ సెక్రటరీకి అధికారాలను కట్టబెట్టారా?.. లేక మరేదైనా కారణం ఉందా? అనే చర్చ జరుగుతున్నది. అయితే ఈ కొత్త రూల్స్ జారీ చేసే ముందు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అనుమతి తీసుకున్నారా? లేక కార్మిక శాఖ సెక్రటరీతోపాటు ఐఎమ్ఎఫ్ డైరెక్టర్‌గా ఉన్న దాసరి హరిచందనే సొంతంగా నిర్ణయం తీసుకున్నారా? అనే కోణంలో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

Next Story