- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నిరాహార దీక్ష... ఒక తరం ఆవేదన!
నీట్ పరీక్షపై వివాదాలు, విద్యావేత్త సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష, పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు, వైద్య ప్రవేశ విధానంలో అవసరమైన సంస్కరణలు, ప్రత్యామ్నాయాలపై విశ్లేషణ.

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పరీక్షపై సందేహాలు తలెత్తితే, వాటిని నిర్లక్ష్యం చేయలేం. నీట్ పరీక్ష చుట్టూ నెలకొన్న వివాదా లు, పరీక్షల విశ్వసనీయతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య విద్యావేత్త సోనం వాంగ్ చుక్ చేపట్టిన నిరాహార దీక్ష ఒక వ్యక్తి నిరసన మాత్రమే కాదు.. దేశ విద్యా వ్యవస్థలో సంస్కర ణల అవసరాన్ని గుర్తు చేస్తున్న హెచ్చరిక.
గతంలో సోనం వాంగ్‌చుక్ లడఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ రక్షణ వంటి అంశాలపై కూడా దీక్షలు చేశారు.. విద్యా వ్యవస్థ, నిరుద్యోగం, పరీక్షల విశ్వసనీయత వంటి అంశాలపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు, దళిత యువకుడు అభిషేక్ దీప్కే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రారంభమైన ఈ ఉద్యమం క్రమంగా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నిస్తోంది. ఇప్పుడు సోనం వాంగ్‌చుక్ దీక్షతో ఉద్యమం మరింత బలపడింది. 19 రోజుల్లో ఆయన సుమారు 9 కిలోల బరువు కోల్పోవడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, తన డిమాండ్లపై స్పష్టమైన స్పందన వచ్చే వరకు దీక్షను విరమించబోనని ఆయన ప్రకటించారు..
నీట్ పరీక్షపై ఆందోళన ..
గత కొంత కాలంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్ష విధానంపై చాలా కాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి.. ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ నీట్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు చేసింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. నీట్ వల్ల కోచింగ్ సెంటర్లపై ఆధారపడటం పెరిగిందని, గ్రామీణ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నష్టపోతున్నారని, పాఠశాల విద్య కంటే ఒకే ప్రవేశ పరీక్షకు ప్రాధాన్యం పెరిగిందని నీట్ పరీక్షను వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలు, పరీక్షల నిర్వహణలో లోపాలపై వచ్చిన విమర్శలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందో ళనను మరింత పెంచాయి. ప్రతి సంవత్సరం 22 లక్షల వరకు విద్యార్థులు నీట్ రాస్తున్నారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు సుమారు 1.37 లక్షలు మాత్రమే ఉన్నాయి. అంటే సగటున ప్రతి సీటుకు 16–17 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. అలాంటి పరీక్షలపై అనుమానాలు మొత్తం విద్యా వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుంది.
నీట్‌కు ప్రత్యామ్నాయం చూడాలి..
ఒక విద్యార్థి సంవత్సరాల శ్రమ, కుటుంబాల ఆశలు పరీక్షల విశ్వసనీయతపై ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలో "నీట్ ఉండాలా వద్దా?" అనే ప్రశ్న కంటే వైద్య విద్యలో సమాన అవకాశాలు, పారదర్శకత, నాణ్యతను ఎలా సాధించాలి?" అనేదే అసలు చర్చగా మారింది. ఈ క్రమంలో నీట్‌కు ప్రత్యామ్నాయంగా విద్యావేత్తలు రాష్ట్ర పరీక్షలు, బోర్డు మార్కుల వెయిటేజ్ లేదా మిశ్రమ విధానాలు ప్రతిపాదించబడుతున్నాయి. రాష్ట్రాల వారీగా ప్రతి రాష్ట్రం తన సొంత మెడికల్ ప్రవేశ పరీక్ష నిర్వహించడం మేలు.. లేదా ఇంటర్ మార్కులు, ప్రవేశ పరీక్ష (వెయిటేజ్ విధానం) ఉత్తమ మార్గం. నేడు అగ్రవర్ణ పాలక విద్యా వ్యవస్థలో కార్పొరేట్ దోపిడి విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆర్ధికంగా వెనబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఐఐటీ, మెడికల్ సీట్ రావడం ప్రధాన సమస్యగా మారింది. ఈ క్రమంలో సమాన విద్యావకాశలు కల్పించి పై విధానాలు అవలంబించడం కొంతవరకు మెలుచేస్తాయి.
దీనిని రాజకీయ కోణంలో చూడకండి!
సోనం వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమం ఒక తరం ఆవేదనను వ్యక్త పరుస్తున్నాయి. సోనం వాంగ్‌చుక్ 19 రోజుల నిరాహార దీక్ష కంటే, ఆ దీక్షకు కారణమైన సమస్య మరింత పెద్దది. ఆ సమస్యను పరిష్కరించడం ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసం బలప డుతుంది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై స్వతంత్ర దర్యాప్తు జరపాలి. పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలి. విద్యార్థుల భవిష్యత్తును రక్షించేలా పరీక్షా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టా లి. అధికారిక చర్చలు ప్రారంభించాలనే వాంగ్ చుక్ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నైతిక బాధ్యత. అప్పుడే ఉద్యమాలు ముగుస్తాయి, విశ్వాసం పునరుద్ధరించబడుతుంది. అలాగే ప్రభుత్వాలు కూడా ఈ ప్రజల ఆందోళనలను రాజకీయ కోణంలో కాకుండా, సమస్యల పరిష్కార దృక్పథంతో చూడాలి.
-సంపతి రమేష్
సామాజిక విశ్లేషకులు
79895 79428






