- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్లాట్ బుకింగ్‌పై గందరగోళం.. ఇబ్బంది పడుతున్న రైతులు
నడిగూడెం తహశీల్దార్ కార్యాలయంలో భూ రిజిస్ట్రేషన్, వారసత్వ భూబదలాయింపు వంటి సేవల నిర్వహణపై కొందరు సిబ్బంది వ్యవహార శైలిపై రైతుల నుంచి తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, నడిగూడెం: నడిగూడెం తహశీల్దార్ కార్యాలయంలో భూ రిజిస్ట్రేషన్, వారసత్వ భూబదలాయింపు వంటి సేవల నిర్వహణపై కొందరు సిబ్బంది వ్యవహార శైలిపై రైతుల నుంచి తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగమైన స్లాట్ బుకింగ్‌ను కూడా సిబ్బంది సూచించిన తర్వాతే చేసుకోవాలని చెబుతున్నారని, డివిజన్ లో ఎక్కడా లేని నిబంధనలు ఇక్కడ ఏంటని.. కొత్త నిబంధనలతో అనవసర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాస్ పుస్తకం ఇప్పటికే పొందిన రైతులు భూ భారతి పోర్టల్‌లో స్లాట్ బుకింగ్ చేసుకుని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లినప్పుడు మళ్లీ "లింక్ డాక్యుమెంట్లు" సమర్పించాలని అధికారులు కోరుతున్నారని రైతులు వాపోతున్నారు.ఆర్ఎస్‌ఆర్ (RSR), లింక్ డాక్యుమెంట్లు వంటి కారణాలు చూపుతూ కొందరు రైతుల దరఖాస్తులను ఆమోదిస్తుండటం, మరికొందరి దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. భూ మార్పిడి, రిజిస్ట్రేషన్, వారసత్వ భూబదలాయింపు వంటి పనుల్లో కొందరు సిబ్బంది అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చిన్నచిన్న అభ్యంతరాలు, సాంకేతిక కారణాలు చూపుతూ ఫైళ్లను పెండింగ్‌లో ఉంచి, అనంతరం భారీ మొత్తాలకు బేరం కుదుర్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం ఓ వైపు భూ వివరాలను పూర్తిగా డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చి, ఆన్‌లైన్ సేవలను విస్తృతంగా అమలు చేస్తోంది. అయితే నడిగూడెం తహశీల్దార్ కార్యాలయంలో మాత్రం పాత మాన్యువల్ రికార్డులతో సరిపోలిన తర్వాతే స్లాట్ బుక్ చేసుకోవాలని కొందరు సిబ్బంది సూచిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ముందుగా కార్యాలయ సిబ్బందిని సంప్రదించి, వారు చెప్పిన తర్వాతే స్లాట్ బుక్ చేసుకోవాలని సూచిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. సాధారణంగా ఆన్‌లైన్‌లో భూ వివరాలు సరిపోలితే స్లాట్ బుకింగ్ చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. కానీ ప్రభుత్వ ఆన్‌లైన్ విధానానికి భిన్నంగా ఇక్కడ మరో విధానం అమలవుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా కార్యాలయంలో సంప్రదించకుండా ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకొని కార్యాలయానికి రిజిస్ట్రేషన్ కొరకు వెళ్తే ఆర్ఎస్ఆర్ రికార్డులో ఉండవలసిన భూమికంటే అధికంగా నమోదయి ఉందని సర్వే కోరాలని సర్వే రిపోర్ట్ అనంతరమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందని ఖరాకాండీగా తెలుపుతున్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో అసలైన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా స్లాట్ బుకింగ్ చేసే నిర్వాహకులకు సైతం కార్యాలయం నుంచి ఆదేశాలు రానిదే స్లాట్ బుక్ చేయొద్దని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఒక్క సారి స్లాట్ బుకింగ్ చేసుకున్న తరువాత ఏవెనీ కారణాలతో రిజిస్ట్రేషన్ రద్దు అయితే చెల్లించిన రుసుము ప్రభుత్వం నుంచి తిరిగి రావడం లేదని.. దీంతో రైతులు నష్టపోతున్నారని అందుకే స్లాట్ బుకింగ్ కంటే ముందే భూ వివరాలను సరిచూసుకోవాలని కొందరు సూచిస్తున్నారు.
పాస్ పుస్తకం ఉన్నా.. మళ్లీ లింక్ డాక్యుమెంట్లు ఎందుకు?
LRUP (భూ రికార్డుల నవీకరణ) ప్రక్రియలో భూమి రికార్డులను పరిశీలించి అర్హత నిర్ధారించిన అనంతరం గత ప్రభుత్వం కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేసింది. అలాంటి పాస్ పుస్తకం ఇప్పటికే పొందిన రైతులు భూ భారతి పోర్టల్‌లో స్లాట్ బుకింగ్ చేసుకుని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లినప్పుడు మళ్లీ "లింక్ డాక్యుమెంట్లు" సమర్పించాలని అధికారులు కోరుతున్నారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తమ హక్కును గుర్తించి పాస్ పుస్తకం జారీ చేసిన తర్వాత అదే భూమికి మరోసారి లింక్ డాక్యుమెంట్లు అడగడం వల్ల తీవ్ర సందిగ్ధ పరిస్థితి నెలకొంటోంది. అదే సమయంలో ఆర్‌ఎస్‌ఆర్ (RSR), లింక్ డాక్యుమెంట్లు వంటి కారణాలు చూపుతూ కొందరు రైతుల దరఖాస్తులను ఆమోదిస్తుండటం, మరికొందరి దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విధానం సమానంగా అమలు కావడం లేదని పేర్కొంటూ, LRUP ద్వారా ఇప్పటికే పట్టాదార్ పాస్ పుస్తకం పొందిన రైతుల నుంచి మళ్లీ లింక్ డాక్యుమెంట్లు కోరకుండా, భూ భారతి ద్వారా తమ దరఖాస్తులను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
సాంకేతిక కారణాలు చూపుతూ వసూళ్లా.?
భూ మార్పిడి, రిజిస్ట్రేషన్, వారసత్వ భూబదలాయింపు వంటి పనుల్లో కొందరు సిబ్బంది అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చిన్నచిన్న అభ్యంతరాలు, సాంకేతిక కారణాలు చూపుతూ ఫైళ్లను పెండింగ్‌లో ఉంచి, అనంతరం భారీ మొత్తాలకు బేరం కుదుర్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు ఎలాగైనా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో కొందరు రైతులు అడిగిన మొత్తాలు చెల్లించి తమ పనులు పూర్తి చేయించుకుంటున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీంతో నిజాయితీగా పనులు చేయించుకోవాలనుకునే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్‌లైన్ సేవలకు విరుద్ధంగా ఎలాంటి అనధికారిక నిబంధనలు అమలు కాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు..
ముందస్తు అనుమతి అవసరం లేదు..
కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ
భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు ముందస్తుగా తహసీల్దార్ కార్యాలయంలో ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. రైతులు, కొనుగోలుదారులు తమ భూ వివరాలను భూభారతి పోర్టల్ లో సరిచూసుకుని నేరుగా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. అనంతరం సంబంధిత తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి రికార్డుల పరిశీలన తర్వాత నిబంధనల ప్రకారం భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.






