- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎంఆర్ బకాయిలు రూ. 230 కోట్లు.. మూడేళ్లయినా డబ్బులు చెల్లించని వైనం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ. 230 కోట్ల సీఎంఆర్ బకాయిలు.. ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లకు ఆగస్టు 4 వరకు ప్రభుత్వం చివరి గడువు!

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్జిల్లా పరిధిలో 2022-23 సంవత్సరానికి సంబంధించి రబీ ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఆ ధాన్యాన్ని కెపాసిటీని బట్టి మిల్లర్లకు కేటాయించారు. నిర్ణీత సమయంలో కస్టం మిల్లింగ్ కింద బియ్యాన్ని ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ సంవత్సరం గడువు పూర్తయినా కొంత మంది మిల్లర్లు బియ్యం ఇవ్వలేదు. చెల్లింపులు చేయలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో రబీలో కేటాయించిన ధాన్యానికి కొంత మంది బియ్యాన్ని అందించగా మిగతా మిల్లర్లు అందించలేదు. బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉండటంతో అమ్మకాలు చేశారు. కోట్ల రూపాయల బియ్యాన్ని పక్కదారి పట్టించారు. అప్పటి అధికారులు ఒత్తిళ్లు చేసినా ఎన్నికల సమయం కావడంతో పట్టించుకోలేదు.
దృష్టిసారించిన కాంగ్రెస్ ప్రభుత్వం..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిల్లర్లకు కేటాయించిన ధాన్యంపై దృష్టి సారించారు. కస్టం మిల్లింగ్ కింద కేటాయించిన ధాన్యాన్ని అన్ని మిల్లుల్లో తనిఖీలు చేశారు. స్టాక్ ను పరిశీలించడంతో పెద్ద ఎత్తున ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ఆ ధాన్యం కేటాయింపు లిస్టులకు అనుగుణంగా ఆయా మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని రాష్ట్ర వ్యాప్త టెండరు పిలిచి అమ్మకాలు చేశారు. టెండరు పొందిన వ్యాపారులు ఆయా మిల్లులకు వెళ్లినా మిల్లర్లు ధాన్యాన్ని అందించలేదు. చివరకు ప్రభుత్వం మిల్లర్లకే అవకాశం ఇచ్చింది. కేటాయించిన ధాన్యానికి అనుగుణంగా డబ్బులు చెల్లించాలని కోరింది. మిల్లర్లకు సమయం ఇచ్చింది. అయినా వారిలో మార్పు రాలేదు. కొంత మంది మిల్లర్లు చెల్లింపులు చేసినా చాలా మంది మిల్లర్లు ముందుకు రాలేదు. చివరకు ప్రభుత్వం అవకాశాలు ఇస్తూ ధాన్యం లేని మిల్లులకు నోటీసులు జారీ చేసింది. నిర్ణీత సమయంలో డబ్బులు చెల్లించాలని కోరింది.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాల పరిధిలో పౌరసరఫరాల అధికారులు మిల్లర్లకు నోటీసులు జారీ చేశారు. ధాన్యం పక్కదారి పట్టించిన కొన్ని మిల్లర్లపై కేసులు కూడా నమోదు చేశారు. ప్రభుత్వం తరపున సివిల్ సప్లై అధికారులు ఇచ్చిన నోటీసులపై కొంతమంది కోర్టుకు వెళ్లగా మరికొంత మంది పట్టించుకోలేదు. ఉమ్మడి జిల్లాలో బకాయిలు రూ. 230 కోట్లకు పైగానే ఉన్నాయి. హన్మకొండ జిల్లా పరిధిలో 23 కోట్ల వరకు ఉండగా, వరంగల్ పరిధిలో రూ.68 కోట్లు, మహబూబాబాద్ పరిధిలో రూ.89 కోట్లు, జనగామ రూ.8 కోట్లు, భూపాలపల్లిలో రూ.27 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. ములుగు జిల్లాల్లోనూ 15 కోట్ల వరకు డ్యూస్ ఉన్నాయి. దీంతో చివరి అవకాశంగా ఆగస్టు 4 వరకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.40 కోట్ల వరకు వసూలైనట్లు తెలుస్తుంది.
చక్రం తిప్పుతున్న మిల్లర్లు..
మూడేళ్లుగా అధికారులు ఒత్తిడి పెంచినా మిల్లర్లు మాత్రం చక్రం తిప్పుతున్నారు. కొంతమంది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటుండగా మరికొంత మంది రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి పెంచుతున్నారు. మిల్లర్ల పైన అధికారులు ఒత్తిడి పెంచకుండా చూడడంతో పాటు వినని అధికారులను బదిలీ చేయిస్తున్నారు. కొంత మంది అధికారులను సరెండర్ చేపిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ బలంగా ఉండటం ప్రభుత్వం నుంచి ఎన్ని జీవోలు వచ్చినా అదే రీతిలో వసూళ్లకు ప్రయత్నాలు చేయకపోవడంతో ఇప్పటికీ వందల కోట్ల రూపాయల డ్యూస్ పెండింగ్ లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో బిల్లుల చెల్లింపులు ధాన్యంపై నోటీసులు రావడంతో అసోసియేషన్ లో కూడా చీలికలు వచ్చాయి. తెలంగాణ రైస్ మిల్లర్ అసోసియేషన్ వారు రాష్ట్ర యూనియన్ తో తెగదెంపులు చేసుకోవడంతో పాటు తమ సమస్యలపైన ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. అధికారులు మాత్రం ఇంకా 20 రోజులే సమయం ఉండటంతో వసూళ్లకు తిప్పలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ దఫా గడువు ముగిసే లోపు ఎన్ని వసూళ్లవుతాయో, ఎంత మంది ఉద్యోగులు బదిలీ అవుతారో చూడాలి మరి.






