అవినీతి పై కలెక్టర్ ఫోకస్!

by Jakkula.Mamatha |

మండలంలో అసైన్డ్ భూముల బదలాయింపు, నాలా కన్వర్షన్, పెండింగ్ మ్యుటేషన్లలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది.

అవినీతి పై కలెక్టర్ ఫోకస్!
X

దిశ, నందిపేట్: మండలంలో అసైన్డ్ భూముల బదలాయింపు, నాలా కన్వర్షన్, పెండింగ్ మ్యుటేషన్లలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. సీహెచ్ కొండూరు, లక్కంపల్లి, నందిపేట, ఉమ్మెడ గ్రామాలతో పాటు గతంలో సంతోష్ రెడ్డి పనిచేసిన మెండోర మండలంలో మొత్తం 25 మ్యుటేషన్ మార్పుల్లో అక్రమాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీటిపై కలెక్టర్ ఈనెల 9న షోకాజ్ నోటీసులు జారీ చేసి విచారణకు కూడా ఆదేశించారు. ఉమ్మెడ గ్రామంలో పట్టా పాస్ పుస్తకం లేకుండానే ఇంటి నిర్మాణానికి నాలా కన్వర్షన్ చేసినట్లు విచారణలో బయట పడింది. ఆర్మూర్ ఆర్డీవో అనుమతి లేకుండా ఉద్దేశపూర్వకంగా వ్యవహారాలు జరిపినట్లు గుర్తించి, సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.

నందిపేట్ తహసీల్దార్ కార్యాలయం సందర్శన..

కలెక్టర్ నందిపేట తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. భూభారతి నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ రికార్డులు మార్చడం తీవ్ర తప్పిదమని పేర్కొంటూ తక్షణ చర్యలకు ఆదేశించారు. సంతోష్ రెడ్డి గతంలో పనిచేసిన మెండోర మండలంలోనూ అక్రమాలపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో సహకరించిన సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నందిపేట తహసీల్దార్ కార్యాలయంలో చాలా కాలంగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధృవీకరణ పత్రాలు, నాలా కన్వర్షన్ వంటి పనులకు ముడుపులు చెల్లించాల్సి వస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. మరికొందరు సిబ్బంది ప్రమేయంపై కూడా అనుమానాలున్నాయని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.

లక్షల్లో లంచాల ఆరోపణలు..

అసైన్డ్ భూముల మార్పులు, నాలా కన్వర్షన్ వంటి వ్యవహారాల్లో లక్షల్లో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా జారీ చేసిన పట్టాలను రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. భీమ్‌గల్, మోర్తాడ్, వేల్పూర్ మండలాల్లోనూ రెవెన్యూ వ్యవహారాలపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో లోతైన విచారణ జరిగితే మరికొందరు అధికారులపై చర్యలు తప్పవని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Next Story