- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సర్’లో మేడ్చల్ అట్టడుగు స్థానం..!
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో సర్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.

దిశ, మేడ్చల్ బ్యూరో: మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో సర్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో(సర్) భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీతో పాటు డిజిటలైజేషన్ ప్రక్రియ రాష్ట్రంలోనే మిగతా జిల్లాలతో పోల్చితే అట్టడుగు స్థానంలో వెనుకబడి ఉంది. ప్రజల నుంచి సేకరించిన, పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్దేశించిన గడువు లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్ర స్థాయిలో మాత్రం సర్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
కేవలం 28.41 శాతం మాత్రమే..
జిల్లాలో మొత్తం 29 లక్షల 79 వేల 130 మంది ఓటర్లు ఉండగా, కేవలం ఇప్పటి వరకు 8 లక్షల 46 వేల 422 మంది మాత్రమే సర్ ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కేవలం 28.41 శాతం మాత్రమే డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా 21 లక్షల 32 వేల 708 మంది సర్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఈ లెక్కన జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియ ఇంకా ఊపందుకోలేదని తెలుస్తోంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లకపోవడం, ఫారాలను ఓటర్ల నుంచి తీసుకోవడంలో జాప్యం చేస్తుండటం, చేతిలో ఉన్న ఫారాలను డిజిటలైజేషన్ చేయడంలో అడుగడుగునా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చే ఎన్యూమరేషన్ ఫారాలను సైతం క్షుణ్ణంగా పరిశీలించి ఓటరు జాబితాను తప్పుల్లేకుండా రూపొందించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కలెక్టర్ ప్రత్యేక దృష్టి..
సర్ ప్రక్రియలో మేడ్చల్ జిల్లాలో ఘోరంగా వెనుకబడడంతో కలెక్టర్ మను చౌదరి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి (సెలవు దినాల్లోనూ) రోజు విస్తృత స్థాయిలో పర్యటిస్తూ, కలెక్టర్ సర్ ప్రక్రియలో వేగం పెంచేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అదేవిధంగా అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డిలు సైతం రోజూ ఏదో ప్రాంతంలో పర్యటిస్తూ సర్ ప్రక్రియ ను పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచిస్తున్నారు. కాగా గ్రామీణ జిల్లాల్లో ఈ సర్ ప్రక్రియలో ముందంజలో ఉంటే.. ఐటీ హబ్‌గా పేరొందిన రంగారెడ్డి లో 41.46 శాతం, హైదరాబాద్ లో 31.54 శాతం, మేడ్చల్ జిల్లాలో 28.41 శాతంతో అట్టడుగున నిలవడం విశేషం. కాగా కొన్ని ప్రాంతాలలో బీఎల్‌ఓలు వచ్చి ఫారాలు ఇచ్చి వెళ్లారు. కానీ వాటిని తిరిగి ఎప్పుడు తీసుకుంటారో.. ఎప్పుడు ఆన్‌లైన్ చేస్తారో స్పష్టత లేదని ఓటర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.






