- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుపరిపాలన దిశగా నవ్యాంధ్ర
దేశ రాజకీయాల్లో పదిహేనేళ్ళు ముఖ్యమంత్రి, మరో పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా రికార్డు ఆయన సొంతం.

దేశ రాజకీయాల్లో పదిహేనేళ్ళు ముఖ్యమంత్రి, మరో పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా రికార్డు ఆయన సొంతం. అడుగడుగునా ఎన్నో ఒడిదొడుకులు. ఎప్పటికప్పుడు ఎన్నో సవాళ్లూ సంక్షోభాలు. అలాంటి సమయాల్లో కూడా ధైర్యంగా నిలబడి, అవకాశాలను వెతుక్కుంటూ సవాళ్లను అధిగమించుకుంటూ సాగుతున్నారు.
ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఆయన ఎదుర్కొన్నన్ని సమస్యలు, సవాళ్లు, వేధింపులు అన్నీ ఇన్నీ కావు. అదే మరొకరైతే రాజకీయాల నుంచి తప్పుకునేవారు. మరో పార్టీ అయితే చెల్లాచెదురు అయిపోయేది! కానీ 74 ఏళ్ళ వయసులో కూడా చంద్రబాబు నాయుడు అద్భుతమైన పోరాట పటిమ, రాజకీయ చతురతతో ముందుకు సాగుతూ, పార్టీని కాపాడుకుంటూ తనకు తిరుగేలేదనుకున్న జగన్మోహన్ రెడ్డిని మట్టి కరిపించి మళ్లీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సుపరిపాలన అందించారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని రెండుగా విభజించి చూస్తే రాష్ట్రాభివృద్ధి కోసం తపించే ముఖ్యమంత్రిగా కనిపిస్తారు.
రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యత
ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతి రోజూ పనిచేస్తున్న తనదైన శైలిలో పాలనను సాగిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు చంద్రబాబు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలనను గాడిన పెట్టి...సంక్షేమాన్ని అందిస్తూ... అభివృద్ధి పట్టాలెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి. రాష్ట్ర విభజన కంటే ఐదేళ్ల జగన్ విధ్వంసక పాలనలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని తెలుసుకున్నారు. ఈసారి అసాధారణ సంఖ్యలో సీట్లు కట్టబెట్టి, కనీవినీ ఎరుగని మెజారిటీలతో కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబుకు మరోసారి పట్టం కట్టారు. అందుకే రాష్ట్ర భవిష్యత్తును చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని రేయింబవళ్ళు పనిచేస్తున్నారు!
వ్యవస్థను చక్కదిద్దే పనిలో..
రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్తర బాధ్యతను భుజస్కంధాలపైనే ప్రజలు ఉంచారు. జగన్ పాలనలో అన్ని వ్యవస్థలూ విధ్వంసమయ్యాక ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యాక వచ్చే ఐదేళ్లూ రాష్ట్రాన్ని పరిపాలించడం నల్లేరు మీద బండి నడక కాదని తెలిసినా తన అనుభవంతో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెడుతున్నారు., తీవ్ర నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన యువతకు మళ్లీ భరోసా ఇచ్చి, ఉపాధి కల్పనకు బాటలు వేయడం, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తిచేయడం, పెట్టుబడిదారుల్లో మళ్లీ విశ్వాసాన్ని పాదుకొల్పి పరిశ్రమల్ని తేవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, యువ నాయకుడు నారాలోకేష్‌లు అహరహం శ్రమిస్తున్నారు.!
కేంద్రం నుంచి నిధుల వెల్లువ
జగన్ తన 5 ఏళ్ల పాలనలో 94 కేంద్ర ప్రభుత్వ పథకాలను నిర్వీర్యం చేశాడు. వాటిలో 74 పథకాలను పునరుద్ధరించారు సీఎం చంద్రబాబు. వాటికి తగిన నిధులను, వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీని, అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ కు ముడి ఖనిజ సరఫరా గురించి ప్రధాని మోడీతో సంప్రదించి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే పోలవరానికి రూ.12,127 కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్లను చంద్రబాబు సాధించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు, కడప జిల్లా కొప్పర్తికి రూ.25 కోట్ల పెట్టుబడితో పారిశ్రామిక హబ్ లను సాధించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకే కాకుండా ప్రకాశం జిల్లాకు కూడా ప్రత్యేక ప్యాకేజీని సాధించారు. విశాఖ రైల్వే జోన్‌ను సాధించిన ఘనత చంద్రబాబుదే.
అమలు దిశగా సూపర్ హామీలు
సూపర్ -6 హామీలు అమలు దిశగా అడుగులు పడ్డాయి. వచ్చే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు సాధించే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. గత ఏడాది పాలనలోనే 6.5లక్షల కోట్లు పెట్టుబడులు రప్పించడం చంద్రబాబు పాలన దక్షతకు నిదర్శనం.. వీటిద్వారా 4.5 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇది తొలి అడుగు మాత్రమేనని చెప్పాలి. ఎన్‌టిపిసి, బిపిసిఎల్, ఆర్సెలర్ మిట్టల్, టాటా రెన్యువబుల్ పవర్, నక్కపల్లి బల్క్ డ్రగ్, రైల్వే జోన్, రిలయన్స్ సిబిజి ప్లాంట్ వంటివి ముందుకు రావడంలో చంద్రబాబు, లోకేష్‌ల కృషి అమోఘం. మెగా డిఎస్సీలో భాగంగా 16347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఒక చరిత్రే.. గత ప్రభుత్వం పెన్షన్ రూ.1000 పెంచడానికి ఐదేళ్లు తీసుకుంటే, చంద్రబాబు పాలనలో ఒకేసారి వెయ్యి పెంచి, వికలాంగుల పెన్షన్ రూ.6వేలు చేసి వారి జీవితాల్లో చంద్రోదయం నింపారు.. పెన్షన్ల కోసమే రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తున్నారంటే, అదీ ఎన్డీఏకూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి. ప్రతి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలండర్ల పథకాన్ని ప్రారంభించాం, తొలివిడతలో కోటి కుటుంబాలకు ఉచిత సిలండర్లు ఇచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే.
వయసు ఛాయలు సోకని నాయకుడు
చంద్రబాబు మనసుకు వయసు ఎప్పుడూ ప్రతిబంధకం కాలేదు. చంద్రబాబు దేహానికి సైతం వయసు ఛాయలు సొకక పోవటం విశేషం. ఊపిరిసలుపని పర్యటనలు వున్నప్పటికీ, గంటల తరబడి వాహనంపై నిలబడి వుండటం, అనర్గళంగా ఉపన్యాసం ఇస్తుండటం చూసిన వారెవరైనా చంద్రబాబుకు వయసు మీరింది అనగలరా అప్పట్లో ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబుకు మాత్రమే అది సాధ్యమయింది. ప్రజాసంక్షేమం పట్ల వున్న శ్రద్ధ, చిత్తశుద్ధి, నిబద్ధత కారణంగానే చంద్రబాబుకు అంతటి శక్తి వచ్చిందనేది నిర్వివాదాంశం. ఆ సంకల్ప బలమే చంద్రబాబుకు శ్రీరామరక్ష.
వాసంశెట్టి సుభాష్
కార్మిక శాఖ మంత్రి






