గిరిజన వర్సిటీ ఏది?

by Disha edit |
గిరిజన వర్సిటీ ఏది?
X

తెలంగాణలో ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్సీటీలో 30 శాతం సీట్లు రాష్ట్ర కోటాగా నిర్ణయించాలని కేటాయించాలని రాష్ట్ర గిరిజన శాఖా మంత్రి కోరారు. కానీ కేంద్రం దీనినీ ఆమోదించలేదు. దీనివలన తెలంగాణ గిరిజన అభ్యర్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయినందున ఇప్పటికి అయినా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యకు తోడ్పాటును అందించాలి.

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం రెండు రాష్ట్రాలలో అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను పరిగణనలోకి తీసుకొని కొన్ని ప్రత్యేకమైన హామీలను రెండు రాష్ట్రాలకు కల్పించారు. ఇందులో భాగంగా సెక్షన్ 94 షెడ్యూల్ 13(3) ప్రకారం రెండు రాష్ట్రాలలో రెండు ట్రైబల్ యూనివర్సీటీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులు భాష, ఆచారం, సాహిత్యం, కళలలో ప్రత్యేక శైలి కలవారు.

అటవీ ఆధారిత ఔషధాలను ఉపయోగించి వైద్యం చేయడంలో ప్రావీణ్యం కలవారు. కాబట్టి వారికి నాణ్యమైన విద్యను అందించి, వారి సేవలను సామాజిక పునర్నిర్మాణానికి అందించాలనే ఉద్దేశంతో యూపీఏ ప్రభుత్వం 2008లో మధ్యప్రదేశ్‌లోని అమరకంటక్ ప్రాంతంలో తొలి నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ నెలకొల్పింది. మన రాష్ట్రం అక్షరాస్యతలో దేశంలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. కానీ, గిరిజనుల అక్షరాస్యత రాష్ట్ర అక్షరాస్యతో పోల్చితే సుమారు 17 శాతం తక్కువ. రాష్ట్రంలో వీరి జనాభా 10 శాతంగా ఉంది. వీటన్నింటిని బేరీజు వేసుకొని విభజన చట్టం ప్రకారం ట్రైబల్ యూనివర్సీటి స్థాపనకు హామీ ఇచ్చింది కేంద్రం.

రాష్ట్ర అలసత్వంతో జాప్యం

రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవతో అక్కడ ట్రైబల్ యూనివర్సీటీని విజయనగరం జిల్లా రెల్లి ప్రాంతంలో 2019 లో ఏర్పాటు చేశారు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా దీని ఏర్పాటుకు ఎలాంటి చొరవ తీసుకోలేదు. ఈ అంశం మీద గత సంవత్సరం పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన మంత్రి స్పందిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటు కొరకు భూమి కేటాయించడంలో అలసత్వం చేయడంతో ఆలస్యం అవుతుందని తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ములుగు ప్రాంతంలో యూనివర్సిటీ కోసం 335 ఎకరాల భూమి కేటాయించింది. దీనిని కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా పరిశీలించింది.

ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాలలో తిరిగి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపలేదని సమాధానమిచ్చారు. అలాగే, తెలంగాణలో ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్సీటీలో 30 శాతం సీట్లు రాష్ట్ర కోటాగా నిర్ణయించాలని కేటాయించాలని రాష్ట్ర గిరిజన శాఖా మంత్రి కోరారు. కానీ కేంద్రం దీనినీ ఆమోదించలేదు. దీనివలన తెలంగాణ గిరిజన అభ్యర్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయినందున ఇప్పటికి అయినా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యకు తోడ్పాటును అందించాలి.

జె. శ్రీనివాస్‌

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం

9701938358

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed