సైన్స్ మూలం ఇదం జగత్

by Ravi |   (  Updated:2025-02-28 01:00:21  IST  )

ఆధునిక మానవాళి అనుభవిస్తున్న అన్ని సౌకర్యాలకు మూలం సైన్స్. అంతరిక్ష యానం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

సైన్స్ మూలం ఇదం జగత్
X

ఆధునిక మానవాళి అనుభవిస్తున్న అన్ని సౌకర్యాలకు మూలం సైన్స్. అంతరిక్ష యానం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం వాడుతున్నాం. సమాజాన్ని వైజ్ఞానిక దృక్పథం వైపు మార్చి, చీకటి నుండి కాంతి వైపు ప్రయాణించేలా చేసే శక్తి సైన్స్‌కు మాత్రమే ఉంది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడింది సైన్స్ మాత్రమే. ఏ మత విశ్వాసాలు కానీ, మూఢ నమ్మకాలు గానీ ప్రజలను కాపాడలేవు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న మొదటి ఐదు దేశాల్లో భారతదేశం ఉండడం మనకెంతో గర్వకారణం.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఏ ప్రకారం భారతీయుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, హేతుబద్ధమైన ఆలోచనను విధిగా పెంపొందించాలి. గత 78 సంవత్సరాలలో భారతదేశం ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో పురోభివృద్ధి సాధించింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్-2024 ప్రకారం 133 దేశాల్లో భారతదేశం 39వ స్థానంలో ఉంది. 2023-24 లో భారతదేశం నుండి 1,03,057 పేటెంట్లను మంజూరు చేయడం ద్వారా పరిశోధనా రంగంలో పురోగతినీ మనం అర్థం చేసుకోవచ్చు.

ఆసియా ఖండంలో తొలి నోబెల్..

‘చరిత్ర చదవని వారు చరిత్ర నిర్మాతలు కాలేరు’ అని అంటారు బి.ఆర్ అంబేడ్కర్. అందుకే అందరూ నేటి తరం సర్ సి.వి రామన్ (చంద్రశేఖర్ వెంకటరామన్) జీవిత చరిత్ర తప్పకుండా చదవాలి. అప్పుడే వారు భారతదేశ భవిష్యత్ చరిత్ర నిర్మాతలు అవుతారు. రామన్ గొప్ప శాస్త్రవేత్తగా దేశానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. రామన్ సేవలకు గుర్తింపుగా ఆసియా ఖండంలోనే సైన్స్‌లో తొలి నోబెల్ పురస్కారం అందుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. 1888 నవంబర్ 7 న తమిళనాడులోని తిరుచురాపల్లిలో చంద్రశేఖర్ రామనాథన్ అయ్యర్, పార్వతి అమ్మల్ దంపతులకు జన్మించిన ఆయన 12 ఏళ్లకే మెట్రిక్యులేషన్ పూర్తి చేసి మద్రాస్ యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్ర మాస్టర్ డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. కాంతి ధర్మాలపై అనేక పరిశోధనాత్మక వ్యాసాలు రాశాడు. కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేసి పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు తన స్వభావాన్ని మార్చుకుంటుందని తన పరిశోధనల సారాంశాన్ని రామన్ ఎఫెక్ట్‌గా 1928 ఫిబ్రవరి 28న ప్రతిపాదించాడు. దీనికి గానూ 1930లో నోబెల్ పురస్కారం వచ్చింది. శాస్త్ర సాంకేతిక రంగానికి రామన్ చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1954లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది.

ప్రపంచాన్ని శాసిస్తున్నది సైన్సే!

'నేను ఈ దేశంలో నిజమైన విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తానని అనుకున్నాను కానీ మన వద్ద ఉన్నది పాశ్చాత్య దేశాల అనుచరులు మాత్రమే' అని రామన్ అన్న మాటలు మనం గమనంలో ఉంచుకోవాలి. పాలకులు తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కావాలని ప్రజలను శాస్త్రీయ వైజ్ఞానిక దృక్పథానికి దూరం చేస్తున్నారని, పరిశోధనా రంగాలను ప్రోత్సహించడం లేదని రామన్ మాటల్లో దాగి ఉన్న నిగూడ అర్థం. 'నా మతం సైన్స్ జీవితాంతం దానినే ఆరాధిస్తా' అని చెప్పిన గొప్ప దార్శనికుడు ఆయన. ఆధునిక ప్రపంచంలో సైన్స్ లేని జీవితాన్ని మానవాళి ఊహించలేదు. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది, నడిపిస్తున్నది సైన్స్ మాత్రమే. జాతీయ విజ్ఞాన దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం రోజువారీ జీవితంలో సైన్స్ ప్రాముఖ్యతను ప్రజల్లో వ్యాప్తి చేయడం కోసం, సాంకేతిక విద్య, నైపుణ్యాల వృద్ధి, భవిష్యత్‌లో సైన్స్ పరంగా సాధించాల్సిన ప్రగతి పరంగా విద్యార్థులు, యువతను ప్రోత్సహించడం. సర్ సి.వి రామన్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ జాతీయ సైన్స్ డే ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాది సైన్స్ దినోత్సవానికి ఒక ఇతివృత్తం ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి.

మూఢనమ్మకాల వ్యాప్తి హానికరం

బాల్యం నుండే బాలబాలికల్లో పాలకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అమూర్త భావనలను, మూఢ నమ్మకాలను పెంపొందించడం వల్ల వారిలో నమ్మకం పెరుగుతూ, శాస్త్రీయ వైఖరులు తగ్గుతున్నాయి. పాలకులు ఇలాంటివి ప్రజల్లో పెంచి పోషిస్తున్న తరుణంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి దేశ ప్రజలలో శాస్త్రీయ వైఖరులు పెంపొందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ దినోత్సవం సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ కోసం జాతీయ అవార్డులు అంద జేయడం ద్వారా ప్రజలలో సైన్స్‌కు ప్రాచుర్యం కల్పిం చడం, బాలలను శాస్త్రీయ పరిశోధనల వైపు ప్రోత్సహించడం, ఇన్నోవేషన్ హబ్, స్టార్ట్ అప్‌లు ఏర్పాటు చేయడం. విద్యాసంస్థల్లో సైన్స్ ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేయడం. వర్క్ షాప్‌లు, ఉపన్యాసాలు, సెమినార్‌లు నిర్వహించడం. శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో తాజా పురోహితులు విజయాలపై విశ్లేషణలు ప్రదర్శించడం, శాస్త్రీయ విజ్ఞాన ప్రాముఖ్యతను రోజువారీ జీవితంలో ఉపయోగాలని తెలియజేసే సమాచారాన్ని వ్యాప్తి చేయడంతో ప్రజల ఆలోచనా సరళిని మార్చవచ్చు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం వల్ల ప్రశించే తత్వం, హేతుబద్ధమైన ఆలోచన, మానవీయత, సెక్యులరిజం వంటి లక్షణాలు పెంపొందుతాయి. భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలు కలిగిన పౌరులుగా తీర్చిదిద్దబడుతారు. సమాజంలో శాస్త్రీయ వైఖరులు పెంచే బాధ్యత మనందరిది.

(నేడు జాతీయ సైన్స్ దినోత్సవం)

పాకాల శంకర్ గౌడ్

98483 77734

Next Story