National Girl Child Day : నేటి బాలికే రేపటి నాయిక

by Ravi |   (  Updated:2025-01-24 00:45:50  IST  )

స్త్రీలను గౌరవించడం ఒక డిమాండ్ కాదు. దానికి వారు అర్హులు. వారి ప్రేమ, ప్రేరణ, పాలన, లాలన

National Girl Child Day : నేటి బాలికే రేపటి నాయిక
X

స్త్రీలను గౌరవించడం ఒక డిమాండ్ కాదు. దానికి వారు అర్హులు. వారి ప్రేమ, ప్రేరణ, పాలన, లాలన, మన మేథో, నైతిక శక్తుల రెట్టింపు కోసమే అవసరమనే విషయాన్ని లోతుగా ఆలోచించాలి. ఇందులో ఏ మాత్రం ఆధిక్యత అనే ఆలోచనను దరికి రానీయరాదు.. అప్పుడే..ఆ.. ఆదర్శ సందర్భాలే, అద్భుతమైన నవ సమాజానికి నాంది పలుకుతాయి.

నేటి బాలికే రేపటి నాయకై అభ్యుదయ సమాజాన్ని నెలకొల్పుతుంది. ఆ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలే మనం మన బాలికలకు ఇచ్చే నిజమైన గౌరవాలు.. అమూల్యమైన ఆభరణాలు.. సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన పెంచడానికి జాతీయ బాలిక దినోత్సవం ప్రతి ఏటా జనవరి 24న జరుపుకుంటారు.

మహిళల హోదా పెంచడానికి..

బాలిక శిశువు అసమానత్వం- విద్య, పోషణ, వైద్య సంరక్షణ, చట్టపరమైన హక్కులు, రక్షణ గౌరవం బాల్య వివాహాల గురించి అవగాహన. సమాజంలో మహిళల హోదా పెంచడానికి, ప్రోత్సహించడానికి.. సాంఘిక వివక్ష, దోపిడీ తొలగించడం సమాజంలో మహిళల అవసరం. ప్రాథమిక స్వేచ్ఛ గురించి చెప్పడాన్ని చర్చిస్తాం. అలాగే బాలికా మనుగడ, భాగస్వామ్యం, అభివృద్ధి, ఆరోగ్యం, శ్రేయస్సు, గుర్తింపు, వ్యక్తీకరణ, వివక్ష రహితం, సురక్షితమైన వాతావరణం గురించి ఆలోచిస్తాం. అంతే కాకుండా జీవించే హక్కు బాలలను నిర్లక్ష్యం, దుర్వినియోగం నుండి రక్షించాలి. విద్యను ప్రాథమిక హక్కుగా భావించాలి. సమాజంలోని ప్రతి జాతి, లింగ, మతం, రంగు, భాష అభిప్రాయాలతో సంబంధం లేకుండా విద్యను అందించాలి. బాలల ఉత్తమ ప్రయోజనాలను ప్రాథమికంగా పరిగణించాలని నొక్కి వక్కాణిస్తాం.

చట్టాలు ఎన్ని ఉన్నా..

ఇక బాలికలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. జువైనల్ జస్టిస్ యాక్ట్, బాల్య వివాహాల నిషేధ చట్టం, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, బాల కార్మిక నిషేధ చట్టం.. లాంటివి భారతదేశంలో 250 కంటే ఎక్కువ చట్టాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాయి.. కానీ చట్టాలు ఎన్ని ఉన్నా, సంరక్షణ ఎంత ఉన్నా, ప్రాథమికంగా కుటుంబం, సమాజం బాధ్యత ఎంతగానో ఉంటుంది. కుటుంబంలో సమాజంలో అజ్ఞానం, అవగాహనా రాహిత్యం, చిన్న చూపు, వివక్ష ఉంటే అది బాల్యానికి, బాలిక అభ్యుదయానికి తీరని లోటు ఏర్పరుస్తుంది. ఆ లోటు రాకుండానే ప్రభుత్వం తన కర్తవ్య బాధ్యతలను గుర్తించి మసులుకోవాలి. ప్రచారం, ప్రసారం, అవగాహన సమీక్షలు, చర్చా వేదికలు, మేళాలు, ఉత్సవాలు, వేడుకలు తరచూ గ్రామ గ్రామాన సభలు నిర్వహించాలి. అవిద్య, సనాతన ఆచారాలకు సంస్కార భావజాలం వల్ల గ్రామాల్లో ప్రాథమికంగా బాలికలకు అందాల్సిన ప్రోత్సాహం, రక్షణ, అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది.

వసుదైక కుటుంబ భావన బతకాలంటే..

బాలిక చదువు భవితకు వెలుగని చాటాలి. చదువుకున్న తల్లి 100 మంది గురువులతో సమానమని, బాలికల రక్షణే - నవ సమాజానికి నాంది అని, అభ్యుదయ బాలికలే నేటి సభ్య సమాజానికి ఆవశ్యకమని పేర్కొనాలి. సభ్యత బ్రతకాలంటే.. సంస్కృతి విరజిల్లాలంటే... సంప్రదాయం ముందుకేగాలంటే... కుటుంబ వ్యవస్థ వర్ధిల్లాలి. అంటే... మాన మర్యాదలు, సంబంధ బాంధవ్యాలు, మాన వత్వ, సున్నితత్వాలు, సజీవంగా ఉండాలంటే... మనకు ఎంతగానో పేరు తెచ్చిన మన వసుదైక కుటుంబ భావన బతకాలంటే.. బాలికను పుట్టనివ్వాలి, పెరగనివ్వాలి, రక్షణ నివ్వాలి, చదువనివ్వాలి, జ్ఞానవంతమైన బాధ్యతాయుతమైన సమా జం వైపు అడుగులు వెయ్యనియ్యాలి.

బాలికలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి!

ఇప్పటికీ పురిటి మరణాలు దేశవ్యాప్తంగా 1,00,000గా నమోదవుతున్నాయి, సెకండరీ విద్య పూర్తి చేసిన బాలికలు 39%. శ్రామిక బాలలలో 27.2% బాలికలే ఉన్నారు. ఈ అంకెలు చట్టాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ సంఖ్యలు సమాజాన్ని వెక్కిరిస్తున్నాయి. ఎక్కడో లోపం ఉందని గుర్తు చేస్తున్నాయి. అందుకే తల్లిదండ్రుల ఆలోచనల్లో గొప్ప మార్పు రావాలి. గృహ వాతావరణంలో బాలికకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉండాలి. పాఠశాలల్లో బాలికా సాథికారత కోసం క్లబ్‌లను ఏర్పాటు చేయాలి. సమాజంలో మార్పు కోసం, సానుకూల దృక్పథంకై చర్యలు తీసుకోవాలి. సమస్యల పట్ల తక్షణ చర్యలు ఉండాలి. క్రీడలతో పాటు అన్ని రంగాల్లో చక్కని రాణింపుకై ప్రణాళికలు ఏర్పాటు చేయాలి. ఉన్నత విద్య అయిన ఐఐఐటీ, ఐఐటీ, మెడిసిన్‌లలో జెండర్ రిజర్వేషన్ ఇవ్వాలి. నేటి బాలికే రేపటి నాయకై అభ్యుదయ సమాజాన్ని నెలకొల్పుతుంది. ఆ స్వేచ్ఛ, స్వాతం త్ర్యాలే మనం మన బాలికలకు ఇచ్చే నిజమైన గౌరవాలు. అమూల్యమైన ఆభరణాలు. జాతీయ బాలికా దినోత్సవం వర్ధిల్లాలి.

(నేడు జాతీయ బాలికా దినోత్సవం)

- సుతారి మురళీధర్,

టీచర్,అధ్యక్షులు ప్రతిభా బాలల సంఘం

96189 39828

Next Story