రేపటి అమ్మను బతకనిద్దాం!

by Ravi |   (  Updated:2026-01-24 00:45:31  IST  )

జాతీయ బాలికల దినోత్సవం మొట్టమొదట 2008 మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈరోజు ప్రాధాన్యత ఉద్దేశం.. మన సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న లింగ ఆధారిత వివక్ష గురించి అవగాహన కల్పించడం, బాలికల పట్ల వైఖరిలో మార్పు తీసుకురావడం.

రేపటి అమ్మను బతకనిద్దాం!
X

జాతీయ బాలికల దినోత్సవం మొట్టమొదట 2008 మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈరోజు ప్రాధాన్యత ఉద్దేశం.. మన సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న లింగ ఆధారిత వివక్ష గురించి అవగాహన కల్పించడం, బాలికల పట్ల వైఖరిలో మార్పు తీసుకురావడం. దీనిని మార్చడానికి బాలికల పరిస్థితులను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా అనేక చర్యలు తీసుకుంది.

'బేటీ బచావో, బేటీ పఢావో..

బాలికల పట్ల ఉన్న వివక్ష పోవాలని, వారికి గల హక్కుల గురించి, తీసుకోవలసిన ఆహారం గురించి, విద్య వలన ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, తమ కాళ్లపై తాము నిలబడి, ఆర్థిక స్వాతంత్రంతో జీవితంలో ఎంత ధైర్యంగా ముందుకు వెళ్లవచ్చు అనే అంశాలపై అవగాహన కల్పిస్తూ ఆడపిల్లలను కాపాడుకోవాలని 'బేటీ బచావో, బేటీ పడావో’ అనే నినాదాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం..

వంటపని, ఇంటిపని... ఇదేనా జీవితం!

దురదృష్టం ఏమిటంటే, మన నరనరాల్లో ఆడపిల్ల పట్ల వివక్ష జీర్ణించుకుపోయింది. తరతరాలుగా ఆడపిల్లలను ఒక యంత్రంగానే చూశారు.. ఇంటి పని, వంట పని చేయడం కొరకే తప్ప వారికి కొన్ని కోరికలు ఉంటాయని, వాటిని అర్థం చేసుకునే బాధ్యత తల్లి తండ్రులకు లేకపోవడం శోచనీయం. కాలం మారింది, పరిస్థితులు మారాయి. గతంలో బాలికలపై నిర్లక్ష్య వైఖరి ఉన్నప్పటికీ, కనీసం ఇప్పటి తరం వారు కాలానికి అనుగుణంగా ఆడపిల్లని ఎదగనిద్దాం. తిరుగులేని శక్తులుగా వారు అవతరించేలా చేద్దాం. ఉత్తమ సమాజాన్ని చూడాలన్నా, మంచి భవిష్యత్తు కనిపించాలన్నా, రేపటి రోజులు బాగుండాలన్నా, మనం చేయవలసింది బాలికలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ, వారి బంగారు భవిష్యత్తుకై అవ కాశాలు కల్పించడమే..

ఆడపిల్ల ఇంటికి, దేశానికి గర్వకారణం..

2026వ సంవత్సరంలో ప్రాంతీయ విశిష్టతను దృష్టిలో పెట్టుకుని, విద్యార్థులు, కుటుంబాలు జాతీయ బాలిక దినోత్సవ వేడుకలలో చురుగ్గా చేరడానికి ఆచరణాత్మక మార్గాలు సూచించ‌బడ్డాయి. మహిళల హక్కులపై పాఠశాల స్థాయి చర్చలు, క్విజ్‌లు లేదా పోస్టర్ తయారీ కార్యక్రమాలు నిర్వహించడం, బాలికల కోసం విద్యా సామగ్రిని, పుస్తకాలను సేకరించే ప్రచారాలకు మద్దతు నివ్వడం మొదలైనవి. ఆడపిల్ల మమతకు మారుపేరు. కఠిన హృదయాలను కరిగించగలదు. ప్రపంచాన్ని పాలించగలదు. తన సత్తా ఏమిటో చూపగలదు. ఆడపిల్లను పుట్టనిద్దాం.. బతకనిద్దాం.. చదవనిద్దాం.. ఎదగనిద్దాం. ఆడపిల్ల ఇంటికి, దేశానికి గర్వకారణం..

అమ్మాయి అంటే కాబోయే అమ్మ!

అమ్మాయి అంటే అమ్మకు కొనసాగింపు! నాన్నను కొడుకులా చూచుకొనే మరో అమ్మే అమ్మాయి! తల్లికి తన తల్లిలా సహకరించేదే అమ్మాయి! తోడబుట్టిన వాడికి తల్లిలా తోడుండేదే అమ్మాయి! అమ్మాయి అంటే కాబోయే అమ్మ! అందుకే కొడుకులు ఎంతమంది ఉన్నా, ఒక్క కూతురన్నా ఉంటేనే ఆ ఇంటికి కళ! కూతురు ఉన్న ఇంటిలో మహాలక్ష్మి ఉన్నట్లు! ఈరోజు బాలికల దినోత్సవం! కూతుర్ని కన్న అదృష్ట వంతులకు శుభాభినందనలు! ఆడపిల్లలను పుట్టనిద్దాం.. బతక నిద్దాం.. చదువనిద్దాం.. ఎదగనిద్దాం అన్న నినాదం విధానమైనప్పుడే బాలికల దినోత్సవం ఆశయాలు నెరవేరుతాయి. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు.. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు.. అందువల్ల ఆడపిల్లలను రక్షించుదాం. అమ్మాయిలను ఆదరిద్దాం.

-పాలపర్తి సంధ్యారాణి

92473 99272

Next Story