ఫాసిజానికి బ్లూ ప్రింట్ నూతన విద్యా విధానం-2020

by Disha edit |
ఫాసిజానికి బ్లూ ప్రింట్ నూతన విద్యా విధానం-2020
X

ఈ నూతన విద్యా విధానాన్ని పీడిత ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా వ్యతిరేకించాలి. వ్యక్తి వికాసానికి, సామాజిక ప్రగతికి మార్గం చేసే శాస్త్రీయ, లౌకికవాద, స్వాతంత్ర్య, ప్రజాతంత్ర విద్యా విధానం నేడు దేశానికి ఎంతో అవసరం. దీనికోసం విద్యార్థి, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి ప్రజల ఆకాంక్ష అయిన శాస్త్రీయ, లౌకిక, స్వతంత్ర ప్రజాతంత్ర విద్యావిధానం కోసం, కేజీ నుంచి పీజీ వరకు అందరికీ సమాన ఉన్నత ప్రమాణాలు గల విద్యావకాశాల కోసం పోరాటం జరుగుతున్నది. ఈ లక్ష్యం నెరవేరాలంటే మొదటగా విద్యా వ్యాపారాన్ని నిషేధించాలి. విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చి ఆయా రాష్ట్రాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి, రాజకీయ అంశాలకు తోడ్పాటు నిచ్చే, తమ భాషా సాంస్కృతిక వైవిధ్యాలకు అనుగుణంగా మార్చుకునే స్వేచ్ఛ వారికి కల్పించాలి.

1988లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో మార్పులు తీసుకురావడంతో విద్య వ్యాపారంగా విస్తరించింది. దీని ఫలితంగా ప్రభుత్వ విద్యా సంస్థలు బలహీనపడ్డాయి. దీనిని గ్లోబలైజ్ చేయడానికి 2010లో అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కనీసం ఓటింగ్‌కు కూడా రాకుండానే ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం(bjp government) 'జాతీయ నూతన విద్యా విధానం-2020'(National Education Policy 2020) ను తీసుకొచ్చింది.

విద్యా వ్యాపారీకరణకు, ప్రభుత్వ నిధులు ప్రైవేట్ యాజమాన్యాలకు తరలించడానికి, విదేశీ విశ్వవిద్యాలయాలకు, కార్పొరేట్ పెట్టుబడులకు ఎర్ర తివాచీ పరుస్తున్నది. దీని వలన పాఠశాల పాఠ్యపుస్తకాల నుంచి ఉన్నత విద్యా కోర్సుల వరకు అన్ని ఢిల్లీలో తయారవుతాయి. అంటే విద్య పేరుతో హిందూత్వ ఫాసిస్ట్ భావజాలాన్ని రుద్దడానికి అవసరమైన కేంద్రీకరణ ఈ విధానంలో ఉంది.

ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా

ఈ నూతన విద్యా విధానంలో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (National Research Foundation) ద్వారా పరిశోధనలను, రాష్ట్రాల ఫెడరల్ హక్కులను, రాష్ట్ర ఉన్నత విద్యా సమితి (scert)ని కేంద్ర ప్రభుత్వమే నియంత్రిస్తుంది. పాఠశాల ప్రవేశాలలో, కోర్సుల బోధనలో, పరీక్షలలో వివక్షను ప్రవేశపెట్టబోతున్నారు. విద్యా ప్రవేశాలలో రిజర్వేషన్లు తీసివేయాలని చూస్తున్నారు. దీంతో విశ్వవిద్యాలయాలు అగ్రకుల, వర్గ వ్యవస్థలుగా మారిపోతాయి. నియమాకాలలో రిజర్వేషన్లు, పదోన్నతులు, సీనియారిటీ కోల్పోతారు. చివరికి విద్యార్హతలు కూడా ప్రాధాన్యం కోల్పోయి, పాలక పార్టీకి అనుకూలంగా ఉన్నవారే ప్రొబేషన్ పూర్తిచేసుకోని పదోన్నతులు పొందగలరు. విశ్వవిద్యాలయాలు పాలక పార్టీ భావజాల కేంద్రాలుగా మారిపోతాయి. ప్రతి వర్సిటీ పాలక పార్టీ అనుకూల పాలకమండలితో నియంత్రించబడుతుంది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి హక్కులు ఉండవు. చివరికి ఈ విధానం ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడుతుంది.

మెజారీటి సామాజిక వర్గాలకు ఉన్నత విద్య అందదు. వారంతా వ్యక్తిత్వ వికాసానికి, ప్రగతికి దూరమవుతారు. విద్యను జీవితంలో సమాజంలో మార్పు తెచ్చేదిగా చెబుతారు కానీ, ఈ విధానంలో విద్యను సంప్రదాయం పరిరక్షించే ప్రక్రియగా చెప్పి గౌతమ బుద్ధుడు, జైన మహావీరుడు, చార్వకుడు వంటి పేర్లను కనిపించకుండా చేస్తారు. స్వాతంత్ర్య పోరాటం గురించి, అంతకుముందే ప్రారంభమైన సంస్కరణోద్యమం గురించి ప్రస్తావించరు. మధ్య యుగాలలో సాధించిన ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విజయాలను ఈ నివేదిక ప్రస్తావించదు. కానీ, ఈ విధానం బ్రాహ్మణీయ, పితృస్వామిక సంస్కృతీ, ప్రాచీన సంస్కృతిని ఆకాశానికి ఎత్తుతుంది. ఇందులో పౌరుల ప్రాథమిక బాధ్యతల గురించి ప్రస్తావించారే కానీ, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల(fundamental rights) గురించి రాయలేదు. చివరికి ఈ విద్యా విధానం జర్మనీలో విశ్వవిద్యాలయాలను ఫాసిస్టులు తమ భావజాల కేంద్రాలుగా మార్చుకున్నట్టు తయారవుతుంది. దేశంలో జాతీయవాదం పక్కకు పోయి హిందూ జాతీయవాదం తెర మీదకు వస్తుంది. అందుకే ఇది బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజానికి బ్లూ ప్రింట్.

తీసుకురావాల్సిన మార్పులు

ఈ నూతన విద్యా విధానాన్ని పీడిత ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా వ్యతిరేకించాలి. వ్యక్తి వికాసానికి, సామాజిక ప్రగతికి మార్గం చేసే శాస్త్రీయ, లౌకికవాద, స్వాతంత్ర్య, ప్రజాతంత్ర విద్యా విధానం నేడు దేశానికి ఎంతో అవసరం. దీనికోసం విద్యార్థి, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి ప్రజల ఆకాంక్ష అయిన శాస్త్రీయ, లౌకిక, స్వతంత్ర ప్రజాతంత్ర విద్యావిధానం కోసం, కేజీ నుంచి పీజీ వరకు అందరికీ సమాన ఉన్నత ప్రమాణాలు గల విద్యావకాశాల కోసం పోరాటం జరుగుతున్నది.

ఈ లక్ష్యం నెరవేరాలంటే మొదటగా విద్యా వ్యాపారాన్ని నిషేధించాలి.విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చి ఆయా రాష్ట్రాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి, రాజకీయ అంశాలకు తోడ్పాటు నిచ్చే, తమ భాషా సాంస్కృతిక వైవిధ్యాలకు అనుగుణంగా మార్చుకునే స్వేచ్ఛ వారికి కల్పించాలి. కొఠారీ కమిషన్(kothari commission) చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వ జీడీపీలో ఆరు శాతం నిధులు కేటాయించాలి. ప్రైవేట్ యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో ధారబోస్తున్న విధానాన్ని రద్దు చేసి విద్యారంగానికి కేటాయించిన నిధులను పబ్లిక్ రంగ విద్యా సంస్థల ద్వారా ఖర్చు చేయాలి. విద్యా వ్యాపారాన్ని రద్దు చేస్తూ రాజ్యాంగానికి సవరణ చేయడంతో పాటు రాష్ట్రాలకు ఫైనాన్స్ కమిషన్(finance commission) ద్వారా నిధులు అందించాలి. అన్నింటి కంటే ముఖ్యంగా జాతీయ విద్యా విధానం-2020(NEP 2020) రద్దు చేయాలి. శాస్త్రీయ, లౌకిక, ప్రజాతంత్ర, స్వతంత్ర విద్యా విధానాన్ని రూపొందించాలి. సమాజంలో ప్రగతిశీల మార్పులకు మార్గం వేసి మానవీయ విలువలు పెంపొందించాలి.


మారుపాక అనిల్ కుమార్

9440482429



Next Story