వైద్య నారాయణులకు వందనం!

by Ravi |   (  Updated:2025-07-01 00:45:39  IST  )

జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు వైద్యుల అవసరం వస్తుంది. చిన్న జ్వరం నుండి పెద్ద శాస్త్ర చికిత్స వరకు, ఏదో ఒక దశలో మన ప్రాణాలను

వైద్య నారాయణులకు వందనం!
X

జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు వైద్యుల అవసరం వస్తుంది. చిన్న జ్వరం నుండి పెద్ద శాస్త్ర చికిత్స వరకు, ఏదో ఒక దశలో మన ప్రాణాలను కాపాడే వ్యక్తిగా వైద్యులు నిలుస్తాడు. అలాంటి మనోహర మైన, బాధ్యతతో కూడిన వృత్తిని చేపట్టిన వారికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం మనందరికీ ఉంది. అందుకే దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన 'డాక్టర్స్ డే' జరుపుకుంటారు.

డాక్టర్ బిధాన్ చంద్రరాయ్, ఆయన అత్యుత్తమ వైద్యులుగా పేరు పొందినవారు.. పాలకునిగా, సమాజ సేవకుడిగా, వైద్య రంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సత్కరించింది. నేడు ఆయన జయంతి, వర్ధంతి. ఆయన స్మరణలో దేశం మొత్తం వైద్య వృత్తికి ఒక రోజును అంకితం చేయడం గొప్ప విషయం.

ప్రాణాలు పోతుంటే.. తల్లడిల్లేది వైద్యులే!

మన చుట్టూ ఉన్న అనేక మంది వైద్యులు ప్రతిరోజూ అనేక బాధ్యతలు మోస్తూ, రోగులకు అండగా నిలుస్తున్నారు.. ఆసుపత్రిలో పనిచేసే ఒక సాధారణ డాక్టర్ నుంచి, సుదూర గ్రామంలో పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల వరకూ ఎన్నో వ్యయ ప్రయాసలు, ఒత్తిడులు మధ్య, కుటుంబానికి సమయం కేటాయించలేకపోయినా, రోగుల శ్రేయస్సు కోసం శ్రమిస్తున్నారు. వీరంతా గుర్తింపు లేకుండానే నిస్వార్థంగా పనిచేస్తున్నారు. కొవిడ్ -19 సమయంలో ఇది మరింత స్పష్టంగా కనిపించింది. ఆ రోజుల్లో మనం చూసిన దృశ్యాలు ఎన్నటికీ మరిచిపోలేం. గుండెకు శ్వాస అందక రోగులు సతమతమవుతుంటే, డాక్టర్లు వాళ్ల ఊపిరిని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రాణాలకే ప్రమాదం ఉందని తెలిసినా, సేవ చేయడం వారు ఆపలేదు. అలాంటి వారి గొప్పతనాన్ని ఎంత చెప్పినా తక్కువే.

నాణేనికి మరో కోణం చేదుగానే...

ఇది నాణానికి ఒకవైపు అయితే, ఈ వృత్తి గురించి మాట్లాడేటప్పుడు, మరోవైపు కూడా చూడాల్సిన అవసరం ఉంది. దుర్మార్గమైన ఆ మరో కోణం ఏమిటంటే, కొందరు వైద్యులు ఫక్తు వ్యాపార ధోరణితో ప్రవర్తిస్తూ, అవసరం లేని స్కాన్‌లు, పరీక్షలు, ఖరీదైన మందులు సూచించడం ద్వారా నిరుపేద రోగులను ఆర్థికంగా కొల్లగొడుతున్నారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు వసూలు చేసే భారీ బిల్లులు సామాన్యుడి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఒక సేవా వృత్తిని పూర్తిగా వ్యాపారంగా మలచడం సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదు.

వైద్యుల నిజాయితీని శంకించవద్దు!

అయితే, అలాంటి కొంతమంది దుష్ప్రవర్తన వల్ల మొత్తం వైద్య వృత్తి మీద అపవాదులు వేయడం కూడా సరికాదు. ఎవరో కొంతమంది దారితప్పితే, వేలాది మంది నిజా యితీగా పనిచేసే వైద్యుల విశ్వసనీయతను మసకబార్చడం మంచిది కాదు. వారి సేవలను గుర్తించాలి, గౌరవించాలి. రోగికి భరోసా ఇచ్చే చేతి స్పర్శ, రాత్రిపూట కాల్ చేస్తే స్పందించే స్వరం, అవసరమైతే ఇంటికొచ్చే మర్యాద ఇవన్నీ డబ్బుతో కొలవలేనివి. అలాంటి విలువలే వైద్యుని గొప్పతనాన్ని ఇనుమడింపజేస్తాయి.

వైద్య విద్యను డిగ్రీగా చూడొద్దు!

వైద్య విద్యార్థులు ఈ రోజు నుండి తమను తాము పరీక్షించుకోవాలి. వైద్యవిద్యను ఒక డిగ్రీ పొందే మార్గంగా కాకుండా, సేవ చేసే మార్గంగా చూడాలి. పేద, మధ్య తరగతి, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే బాధ్యతను చేపట్టాలి. వైద్య రంగాన్ని మానవత్వంతో నడిపే వ్యక్తులే రేపటి సమాజానికి ఆశాజ్యోతుల వుతారు. ప్రభుత్వాలు సైతం వైద్యులను కేవలం డ్యూటీ లిస్టుల మధ్య నలిగిపోయేలా చేయకూడదు. వారికి కావలసిన వనరులు, గౌరవం, భద్రత కల్పించాలి. రోగులకు సరైన చికిత్స లభించే విధంగా ఆరోగ్య రంగంలో స్థిరమైన సంస్కరణలు తీసుకురావాలి.

విలువల గుర్తింపు సందర్భం..

జూలై 1వ తేదీని మనం కేవలం ఒక దినోత్సవంగా కాకుండా, నిజమైన వైద్య విలువలను గుర్తించే సందర్భంగా తీసుకోవాలి.. సేవను వ్యాపారంగా మార్చకుండా, మానవత్వంతో కూడిన వైద్య సంస్కృతిని రక్షించేందుకు ప్రతి పౌరుడూ తన వంతు పాత్ర పోషించాలి. వైద్యులకు ధన్యవాదాలు చెప్పే ప్రేరణగా ఈ రోజును మలచుకోవాలి. ఈ రోజు వైద్యులను గౌరవించడం మాత్రమే కాదు.. వారి సేవలను గుర్తించి, వైద్య వృత్తిని స్వార్ధ‌పరమైన వ్యాపారంగా మార్చకుండా పరిరక్షించే బాధ్యత కూడా మనందరిపై ఉంది.

ప్రాణ రక్షకులు.. వైద్య నారాయణులు!

వైద్యులు అంటే ప్రాణం పోసిన దేవుడి తరువాత ప్రాణం నిలిపేవారిగా చూస్తుంది సమాజం. ఆ స్థాయిని మన సమాజం, వైద్య విద్యా వ్యవస్థ, ప్రభుత్వ విధానాలు కలిసి కాపాడుకోవాలి. ప్రతి వైద్యుడు డాక్టర్ బీ.సి.రాయ్‌లా గౌరవానికి అర్హుడుగా మారాలి. ప్రతి రోగి విశ్వాసంతో ధైర్యంగా ఆసుపత్రి లేక వైద్యుని తలుపు తట్టి వైద్యం పొందే వాతావరణం కల్పించాలి. జూలై ఒకటి కూడా అన్ని రోజుల్లా ఒక రోజుగా మిగిలి పోకూడదంటే, వైద్య మహోద యులు వైద్యవృత్తిని సేవగా స్వీకరించి నిజాయితీగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించవలసి ఉంటుంది.

(నేడు జాతీయ వైద్య దినోత్సవం)

యండి. ఉబైద్ ఖాన్

6305 414351

Next Story