ప్రధాని నరేంద్ర మోడీ.. సుదీర్ఘ నాయకత్వం వెనుక విజయగాథ

by Ravi |   (  Updated:2026-06-10 01:16:00  IST  )

ప్రజల విశ్వాసాన్ని సుదీర్ఘకాలం నిలబెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం, పేదరిక నిర్మూలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, బిహార్‌కు అందించిన మద్దతు, ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ట పెంపులో ఆయన పాత్రపై ప్రత్యేక విశ్లేషణ.

ప్రధాని నరేంద్ర మోడీ.. సుదీర్ఘ నాయకత్వం వెనుక విజయగాథ
X

భారత్ లాంటి విశాలమైన, పోటీతత్వం గల ప్రజాస్వామ్య దేశంలో ప్రజల విశ్వాసాన్ని గెలుచు‌కోవటం చాలా కష్టం.. దాన్ని నిలబెట్టుకోవటం మరింత కష్టం. నిరంతర రాజకీయం గా పోటీ, ప్రజల నిశిత పరిశీలన ఉన్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎల్లప్పుడూ ప్రజల విశ్వాసాన్ని పొందుతూనే ఉన్నారు. ఎన్నికైన ప్రధానమంత్రిగా భారతదేశంలో సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన వ్యక్తిగా నిలిచి, ప్రజాస్వామ్య రాజకీయాల్లో నూతన ప్రమాణాలను నెలకొల్పారు.

భారత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ.. ప్రధాన‌మంత్రి మోడీ, నేను ఎమర్జెన్సీ పరిస్థితుల నుంచి రాజకీయ చైతన్యాన్ని పొందిన తరానికి చెందిన వాళ్లం. ప్రజాస్వామ్య స్వేచ్ఛపై జరిగిన దాడిని మేం ప్రత్యక్షంగా చూశాం. ఆ స్వేచ్ఛను పునరుద్ధరించేందుకు ప్రయత్నించిన ఉద్యమంలో పాల్గొన్నాం.

సాధారణ నేపథ్యాలకు గొప్ప స్ఫూర్తి!

దశాబ్దాలుగా దేశంలో అత్యున్నత పదవులు కేవలం విశేషా ధికారాలు ఉన్నవారికి లేదా ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో జన్మించిన వారికి మాత్రమే పరిమితమనే భావన ఉండేది. ఆ భావన తప్పు అని ప్రధానమంత్రి మోడీ ప్రస్థానం నిరూపించింది. ఒక సామాన్య నేపథ్యం నుంచి దేశంలోనే అత్యున్నత పదవికి ఎన్నికైన స్థాయికి ఎదగటం ద్వారా లక్షలాది మంది భారతదేశ యువతకు, ముఖ్యంగా సాధారణ నేపథ్యాల నుంచి వచ్చిన వారికి ఆయన గొప్ప స్ఫూర్తిగా నిలిచారు. శక్తిమంతమైన ప్రజాస్వామ్యంలో పట్టుదల, కష్టపడేతత్వం, ప్రతిభ ఉంటే.. పుట్టుక, పరిస్థితులు సృష్టించే అడ్డంకులను అధిగమించవచ్చనే నమ్మకాన్ని ఆయన కథ నిరూపిస్తుంది. ఈ కీలక ఘట్టం కేవలం ఆయన వ్యక్తిగత విజయం మాత్రమే కాదు.. భారత ప్రజాస్వామ్య బలానికి, పారదర్శకతకు శక్తిమంతమైన నిదర్శనం.

పేదరిక నిర్మూలనపై ప్రత్యేక దృష్టి!

ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావటం, గౌరవ‌ప్రదమైన జీవితాన్ని గడిపేలా చూడటం వంటివి ప్రతి రాజకీయ నాయకుడికి అత్యున్నత ప్రాధాన్యతగా ఉండాలి. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. పేదరిక నిర్మూలనపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించటం వల్ల.. ఎన్డీయే ప్రభుత్వంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాలు, మహిళలు, పేద కుటుంబాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తొలి తరం లబ్ధిదారులుగా ఉన్న అధిక సంఖ్యాక ప్రజలు ఇప్పుడు భారతదేశ ప్రగతి ప్రయాణంలో క్రియాశీల భాగస్వాములుగా ఉన్నారు. ప్రత్యేక పథకాల ద్వారా యువతకు నూతన వ్యాపార అవకాశాలు లభిస్తున్నాయి. ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు మహిళలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చటమే కాక, వారి దైనందిన జీవితాన్ని సులభతరం చేశాయి.

పౌరులతో నేరుగా మాట్లాడటంలో మాస్టారిటీ!

పరిపాలన ద్వారా పౌరులకు స్పష్టమైన ఫలితాలను అందించేలా చూడటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టి సారించటం ఆయన నాయకత్వంలోని ముఖ్య లక్షణం. సంక్షేమ పథకాలైనా, మౌలిక సదుపాయాల అభివృద్ధి అయినా, ప్రజా సేవల పంపిణీ అయినా... సమర్థత, పార దర్శకత, జవాబుదారీతనంపై ఆయన నిరంతరం శ్రద్ధ చూపించారు. విస్తృతమైన సాంకేతికత వినియోగం, ప్రత్యక్ష నగదు బదిలీలు, పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా విధానాల రూపకల్పన, అమలుకు మధ్య అంతరం గణనీయంగా తగ్గింది. ప్రజలకు మరింత సమర్థవంతంగా, అవినీతి, దుర్వినియోగం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలు అందటం వల్ల వ్యవస్థలపై విశ్వాసం బలపడుతుంది. పౌరులతో ప్రధానమంత్రి నిరంతరం మమేకమవ్వడం, మాట్లాడటం ద్వారా ఈ విశ్వాసం మరింత బలపడి... ప్రభుత్వం, ప్రజల మధ్య బలమైన అనుబంధాన్ని పెంపొందించడంలో దోహదపడింది.

బిహార్ అభివృద్ధి మోడీ చలవే..

నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయ పరిస్థితులతో సంబంధం లేకుండా బిహార్ అభివృద్ధికి ఆయన అందించిన మద్దతును నేను స్వయంగా చూశాను. ముఖ్యంగా 2024-25, 2025-26 బడ్జెట్‌లో బిహార్‌కు లభించిన అద్భుతమైన మద్దతును నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నా. ఇందులో మఖానా బోర్డు ఏర్పాటు, భాగల్‌పూర్‌లో విద్యుత్ కేంద్రం, వరదల నిర్వహణకు నిధులు, అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రముఖులకు బిహార్‌కు చెందిన మఖానా, మధుబని పెయింటింగ్స్, ఇతర ఉత్పత్తులను బహుమతిగా ఇవ్వటం ద్వారా రాష్ట్ర వారసత్వాన్ని ప్రపం చ వేదికపై చాటిచెప్పారు. దశాబ్దాలుగా నెరవేరని, పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను నెరవేరుస్తూ... జననాయక్ కర్పూరీ ఠాకూర్‌కు భారత రత్న పురస్కారం దక్కేలా చేసింది పీఎం మోడీనే. గత దశాబ్ద కాలంలో బిహార్ పలు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా ప్రయోజనం పొందింది.

ప్రజలకు ఇంత దగ్గరగా ఎలా అయ్యారు?

ప్రజలకు ప్రధానమంత్రి మోడీ దగ్గరవటానికి ముఖ్య కారణం... ఆయనపై ఎలాంటి అనినీతి మచ్చ లేకపోవటం, అవినీతిపై ఆయనకున్న బలమైన వైఖరి. దశాబ్దాల పాటు అధికారంలో ఉండి కూడా తమ నిజాయతీపై ఎలాంటి మచ్చ పడకుండా వ్యవహరించిన నాయకులు చాలా అరుదు. సంస్థాగత సంస్కరణల ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా చేయటంతోపాటు అవినీతిపరులైన రాజకీయ నాయకులు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయంలో ఆయన రాజకీయ సంకల్ప బలాన్ని ప్రదర్శించారు. నరేంద్ర మోడీ హయాంలో ప్రపంచ వేదికపై భారత్ ప్రత్యేక గుర్తిం పుని, ప్రాముఖ్యతను సంపాందించుకుంది. వివిధ దేశాలు, కూటములతో బలమైన సంబంధాలను కొనసాగిస్తూనే... శాంతి, పురోగతి వైపు ప్రధానమంత్రి మోడీ నిలబడ్డారు. దీని ఫలితంగానే, 21వ శతాబ్దంలో ప్రపంచ వృద్ధికి ప్రధాన శక్తిగా భారత్ వైపు ప్రపంచం ఎంతో ఆశగా చూస్తోంది.

ఆయన సేవలను వేడుకగా జరుపుకుందాం!

సుదీర్ఘకాలం పాటు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవటానికి ప్రధానమంత్రి మోడీ అలుపెరుగని శక్తి, అంకితభావమే కారణం. భారత్‌లో సుదీర్ఘకాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా పదవిలో కొనసాగిన నరేంద్ర మోడీ చారిత్రక ఘట్టాన్ని చేరుకున్న తరుణంలో ప్రజా జీవితానికి ప్రధానమంత్రి మోడీ చేసిన సేవలను వేడుకగా జరుపుకోవాలి. ఇలాంటి మరెన్నో విజయాలను ఆయన సాధించాలని ఆకాంక్షించాలి. ఈ చరిత్రా‌త్మక ఘనత సాధించినందుకు ఆయనకు నేను అభినందనలు తెలియజేస్తూ, ఆరోగ్యంగా ఉండి, దేశ సేవలో నిరంతర విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నా.

-నితీశ్ కుమార్

రాజ్యసభ సభ్యులు,

బీహార్ మాజీ ముఖ్యమంత్రి

Next Story