- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నానా పటేకర్ - తెరపై రగిలే స్వరాగ్ని
నానా పటేకర్ నటనలోని ఆవేశం, జీవిత అనుభవాలు, రైతుల కోసం చేసిన సేవలు, నసీరుద్దీన్ షా–ఓం పురిలతో ఆయన నటనా వైవిధ్యాన్ని విశ్లేషించే ప్రత్యేక కథనం.

భారతీయ సినీ ప్రపంచంలో ముగ్గురు నటుల్ని గురించి విశేషంగా చెప్పుకోవాలి. విశేషమైన ప్రతిభ, సజీవ పాత్ర పోషణే వారి సాధికారిక సంతకం. వాళ్లే నానా పటేకర్, నసీరుద్దీన్ షా, ఓం పురి. ఈ ముగ్గురిని పోల్చడం, మాట్లాడడం అనేది మూడు భిన్నమైన నటనా ప్రతిభల్ని, సజీవ పాత్రల రూపాల్ని ఒకే అద్దంలో చూడటం లాంటిది.
నసీరుద్దీన్ నటనలో కళాత్మక శిల్పం ఉంటుంది, ఆయన ప్రతి మాటలో (పెస్తోంజీ), ప్రతి నిశ్శబ్దంలో(స్పర్శ్) ఒక ఆలోచన క్రమశిక్షణ కనిపిస్తుంది. ఓం పురి ముఖంలో (ఆక్రోష్) జీవితం గీతలు గీసినట్టు ఉంటుంది. అతను పాత్రను పోషించడు, పాత్రగా మారిపోతాడు (అర్ధ సత్య). అతని కళ్లలో నిశ్శబ్దం కూడా కథ చెబుతుంది. నానా పటేకర్ మాత్రం అగ్నిలాంటి వాడు. అతని మాట ఒక చెర్నాకోల దెబ్బ, అతను ఇచ్చే విరామం ఒక పేలుడు. నటన అని లోపలి నుంచి ఉప్పొంగుతుంది. ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప అని తేల్చడం కష్టం ఎందుకంటే నసీర్ మనసును ఆలోచింపజేస్తాడు, ఓం పురి హృదయాన్ని తాకుతాడు, నానా మన నరాలను కదిలిస్తాడు. ముగ్గురూ కలిసి భారతీయ నటనకు మూడు స్వరాలు.. అవి శిల్పం, అనుభవం, ఆవేశం అని చెప్పొచ్చు.
అగ్నిని రగిలించే డైలాగులు..
సినిమా నటీనటుల్లో కొందరు నటనతో, మరికొందరు తమ స్వరం సంభాషణలతో గుర్తుండిపోతారు. కొంతమంది నవ్వులతో కానీ ఇంకొందరు నిశ్శబ్దంతోనే మనసులో నిలిచిపోతారు. నానా పటేకర్ తన స్వరంలో ప్రకటించే కోపం ఆవేదన ఆక్రోశం ఆవేదనలన్నీ ప్రేక్షకుల్ని కదిలిస్తాయి. నానా తెరపై చెప్పిన ప్రతి డైలాగ్‌లో ఒక అగ్ని రగులుతుంది. నిప్పు వెలుగుతుంది. ఆయన తెరపై మౌనంగా నిలబడిన ప్రతి క్షణంలో తెలీని ఒక గాయం వినిపిస్తుంది. అది నటన కాదు.. జీవితమే తనను తాను ప్రకటించుకున్న శబ్దం లాంటిది.
పాత్రలను ఆవాహన చేసుకుంటే.. నానా
సినిమా కథల్లో పాత్రలను రూపొందిస్తారు. కానీ చిత్రంగా నానా పటేకర్ ఆ పాత్రల్లోకి వెళ్లడు ఆ పాత్రలను తనలోకి ఆవాహన చేసుకుంటాడు. ‘పరిందా’ సినిమాలో అన్నాగా కనిపించినప్పుడు మనకు నానా ఒక విలన్‌గా కనిపించడు. మనిషి లోపల చీకటి ఎలా ఉంటుందో ఆ ప్రతిబింబాన్ని చూపిస్తాడు. ఇక ‘క్రాంతివీర్’లో నానా మాట్లాడిన మాటలు కేవలం సంభాషణలు కావు. ఈ సమాజం మీద ఉన్న కోపం, నిస్సహాయత, ఒక నిరసన స్వరంగా మారిన మాటలవి. ‘అబ్ తక్ ఛప్పన్’ సినిమాలో నానా పోలీస్ పాత్రలో జీవించి న్యాయా న్యాయాల నడుమ ఎంత పలుచని గీత ఉంటుందో చూపించాడు. ‘వెల్ కం’ సినిమాలో అతను నవ్విస్తాడు. కానీ ఆ నవ్వులో కూడా ఒక చిత్రమయిన పిచ్చి ఒక విచిత్రమైన తీవ్రత ఉంది. మనం తరచి చూస్తే మంచి నటుడి నటనలో కనిపించే నిజం ఎక్కడో నిజ జీవితంలోనూ కనిపిస్తుంది.
స్టార్‌డమ్‌ని దాటి నడిచిన నటుడు..
నానా పటేకర్ తన జీవితంలో యుద్ధం చూసిన మనిషి. టెరిటోరియల్ ఆర్మీలో సేవ చేసిన సైనికుడు. అక్కడ ఆయన చూసిన మరణాలు, అక్కడ విన్న శోకాలు ఆయన కళ్లలో అట్లా నిలిచిపోయాయి. అందుకే ఆయన కళ్లు తెరమీద సంభాషిస్తాయి. చిత్రంగా తెరమీద ఆయన ప్రకటించే మౌనం కూడా ఒక డైలాగే అవుతుంది. సినిమా బయట కూడా అతను మామూలు మనిషిగానే ఉంటాడు. నానా తాను పుట్టిన ఊరికి, పెరిగిన మట్టికి దగ్గరగా ఉంటున్న వ్యక్తి. సామాజిక సేవలో నిమగ్నమై గ్లామర్‌కు దూరంగా బతుకుతున్న ఒక యాత్రికుడని చెప్పాలి. ఇవ్వాల్టి కాలంలో స్టార్‌డమ్ అంటేనే పబ్లిసిటీ, ప్రదర్శన కానీ నానా పటేకర్ ఆ వెలుగుల నుంచి దూరంగానే కాదు ఆ వెలుగుల్ని దాటి నడిచాడు. ఊర్లో ఉంటూ గేదెల్ని పెంచుతూ తన వంట తానే చేస్తూ వచ్చిన వారికి వడ్డిస్తూ జీవిస్తున్నాడాయన. సినిమా పాత్రల్లో కోపంగా కఠినంగా కనిపించే నానాపటేకర్ మనసు నిజజీవితంలో మంచు లాంటిది.
అభినయం కాదు.. అనుభవం
1951 జనవరి 1న మహారాష్ట్రలోని మురుడ్-జంజీరాలో విశ్వనాథ్ పాటేకర్‌గా జన్మించిన నానా పాటేకర్ పేదరికం, అనేక కష్టాల మధ్య పెరిగాడు. జీవితమే అతనికి పుస్తకాల కంటే ఎక్కువ పాఠాలు నేర్పింది. డబ్బులకు, తిండికి కష్టపడ్డ నానా ఆర్ట్స్ కాలేజీ రోజుల్లో రోడ్లమీద జీబ్రా లైన్లు గీసే పని చేసి భోజనం ఖర్చులు వెళ్లదీసాడు. సినిమా ప్రపంచంలో స్మితా పాటిల్ ప్రోత్సాహంతో 1978లో ‘గమన్’ తో ప్రారంభమైన అతని ప్రయాణం, పరిందా, క్రాంతి వీర్, ప్రహార్ వంటి చిత్రాలతో గొప్ప స్థాయికి చేరింది. నటన అంటే అతనికి అభినయం కాదు, అనుభవం. అందుకే అతని ప్రతి సంభాషణలో జీవితం వినిపిస్తుంది. మూడు జాతీయ అవార్డులు 2013లో పద్మశ్రీ అందుకున్న నానా పాటేకర్ కేవలం నటుడే కాదు.
కారు కోసం సేకరించిన డబ్బు.. రైతులకు ఇచ్చి..
మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు, కరువు విషాదాన్ని చూసి నానా హృదయం తట్టుకోలేకపోయాడు. తనకోసం కారు కొనుక్కోడానికి సమకూర్చుకున్న కోటిన్నర రూపాయల సొమ్ముని ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి 15 వేల చొప్పున సాయం అందించాడు. దానితో కష్టాలు తీరవని తన బాధ్యత తీరిపోలేదని భావించిన ఆయన ‘నాం ఫౌండేషన్’ను మిత్రుడు మకరంద్ అనాస్ పురేతో కలిసి ప్రారంభించాడు. చెరువులు, కాలువల పునరుద్ధరణ గ్రామాల్లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, విధవలకు ఇళ్లు చిన్న వ్యాపారాల కోసం సహకారం లాంటి అనేక కార్యక్రమాలకు పూను కున్నాడు నానా.
మననును కరిగిస్తున్న సేవలు..
అత్యంత సాధారణంగా జీవించే ఆయన సంపాదనలో అధిక భాగం పేదలకు దానం చేస్తున్నాడు. గొప్ప ప్రచారం ఆశించకుండా సేవ చేస్తున్నారు. తెరమీద అతను నటించిన పాత్రలు మనల్ని కదిలిస్తే, అతను చేస్తున్న సేవలు మనసును కరిగిస్తాయి. సినిమాల్లో హీరోలు సరే.. కానీ జీవితంలో హీరోగా నిలిచే వారు చాలా అరుదు. అలాంటి వాడు నానా పటేకర్. ‘గమన్’, పరిందా, క్రాంతివీర్, ప్రహార్ లాంటి సినిమాలు చూడాలంటే యూట్యూబ్‌లో ఉన్నాయి.
- వారాల ఆనంద్
94405 01281






