పల్లె ప్రచారంలో ఆయన పాటలదే జోరు

by Bhoopathi Nagaiah |

రాజకీయ నేతల ప్రచార కార్యక్రమాల పాటలు పాడటంలో నల్లగొండ గద్దర్ ప్రముఖంగా నిలిచారు. వార్డు మెంబర్ నుంచి సీఎం వరకు ఆయనతో పాట పాడించుకోవాల్సిందే.

పల్లె ప్రచారంలో ఆయన పాటలదే జోరు
X

మారుతున్న కాలంతో పాటు ఎన్నికల ప్రచార సరళి కూడా మార్పు చెందుతోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే, అభ్యర్థులు, వారి అభిమానులు, మద్దతుదారులు ఎక్కువగా ఒకే వ్యక్తి పాడిన పాటలోని చరణాలను వాట్సాప్ స్టేటస్ వీడియోలతో పాటు సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ల‌లో వాడుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడైన నల్లగొండ గద్దర్. ఇటీవల పదివేలకు పైగా గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో ఆయన పాటలను జోరుగా వాడేసుకున్నారు.

ర్పంచ్ పోటీపడుతున్న అభ్యర్థుల్లో వారు వీరు అని కాదు అన్ని పార్టీలకు చెందిన వారు ఆ జాబితాలో ఉన్నారు. ఇక వార్డు సభ్యులైతే సరే సరి. లక్షకు పైగా వార్డులు ఉన్నాయి. అందులో సైతం ఒకే వార్డులో పోటీ చేసిన ప్రత్యర్థులు కూడా నల్లగొండ గద్దర్ పాటల‌ను వాడేసుకున్నారు. ఈ లెక్కన ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆయన పాటల్లోని ఎంపిక చేసిన చరణాలను తమ స్టేటస్ కింద వాడుకున్న వారు లక్షల్లోనే ఉంటారంటే అతిశయోక్తి కాదు.

ఆయన పాటలే ఎందుకు?

నల్లగొండ గద్దర్ అసలు పేరు కాసాల న‌ర్సిరెడ్డి. ఆయన నల్లగొండ జిల్లా వాసి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఆయన చేసిన ప్రయాణం రాజకీయాలపై మక్కువ పెంచింది. ఆయన మొదట్లో స్వంతంగా పాటలు అల్లుకొని పాడేవారు.వాటికి ఆయనే దరువు కూడా వేసేవాడు. చుట్టూ ఉన్న వారు పాటలను ఆసక్తిగా విని, భలేగా ఉన్నాయంటూ మెచ్చుకునేవారు. ఆ తరువాత కోమటిరెడ్డి వెంకట్ ఆయన సోదరుడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు గ‌డ్డ మీద కాంగ్రెస్ జెండా పాటతో పాటు ఇత‌ర పాట‌లు ఎన్నికల్లో హిట్ అయ్యాయి. అలవోకగా పాడుకునే విధంగా ఉండడంతో పాటు, పదాలు సులువుగా గుర్తుండేట్లు ఉంటాయి. అన్నిటికి మించి ఎవరిమీదైతే పాట కడతాడో వారి ఇమేజిని అమాంతం పెంచే విధంగా సాగుతాయి. ఆయన పాటలు వింటే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే! దీంతో ఆయన పాటలకు సామాన్య ప్రజల్లో క్రేజ్ ఏర్పడింది.

ఉర్రూతలూగిస్తున్న పాటలు

మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నల్లగొండ గద్దర్ పాడిన ‘మూడు రంగుల జెండా పట్టి.. సింహమోలే వచ్చినాడు ఒక్కడే కాంగ్రెసూ సూర్యూడు మన రేవంతన్న.. ’ పాట కాంగ్రెస్ కార్యకర్తలను ఉర్రూతలూగించింది. ఆ పాటను సైతం అనేక మంది తమ రింగ్ టోన్ కాలర్ ట్యూన్ వాట్సాప్ స్టేటస్ వాడుకున్నారు. కేవలం కాంగ్రెస్ శ్రేణులే కాకుండా ఇతరులు సైతం ఆ పాటకు ఫిదా అయ్యారు. అదే తరహాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాట కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఎన్నికలకు ముందు, ప్రభుత్వం వచ్చిన తరువాత సిఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ప్రాంగణానికి వచ్చే ముందు, ఆయన ప్రసంగించే ముందు ఈ పాటలోని ముందు సంగీతం, పల్లవి వినిపించడం రివాజుగా మారింది. అలాంటి నల్లగొండ గద్దర్ అన్ని పార్టీల నాయకులు పాటలు పాడించుకున్నారు. మొన్నటికి మెన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే న‌వీన్ యాద‌వ్‌కు పాడిన పాట కూడ హిట్ అయ్యింది. గతంలో శాసనసభ నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు అనేక అభ్యర్థులకు పాటలు పాడిన నల్లగొండ గద్దర్ తాజా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆయన పాట చరణాలను వినియోగించుకోవడం ద్వారా పార్లమెంటు నుంచి పంచాయితీ ఎన్నికల వరకు ఆయన పేరు మారుమోగని ప‌ల్లెలేదు.

శంకర్ శిగ

91770 33044

Next Story