- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతరకు ఊరు రమ్మంటుంది
మాది నల్లగొండ జిల్లా నాంపల్లి. ఐతే మూడు, నాలుగు రోజుల నుంచి నా శ్రేయోభిలాషులు ఫోన్లు చేస్తున్నారు. గురువారం

మాది నల్లగొండ జిల్లా నాంపల్లి. ఐతే మూడు, నాలుగు రోజుల నుంచి నా శ్రేయోభిలాషులు ఫోన్లు చేస్తున్నారు. గురువారం(ఈ నెల 13న) శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ జాతర కదా.. వస్తున్నారా? లేదా? ఈ సారి తప్పకుండా రండి అంటూ ఆహ్వానిస్తున్నారు. చాలా సంతోషమనిపించింది. నిజమే.. కాలం రివ్వున తిరిగింది. ఊరిని వదిలి 18 సంవత్సరాలైంది. అప్పుడప్పుడు వెళ్లి రావడం తప్ప ఎక్కువ రోజులు మా ఊరిలో ఉండాల్సిన సందర్భాలు లేవు. అప్పుడెప్పుడో మా ఊరిలో బొడ్రాయి పండుగ చేసినప్పుడు మూడు రోజులు ఉండాల్సి వచ్చింది. మా పాత ఇంట్లోనే మేం అందరం ఉన్నాం. ఐతేనేం? ఆ రోజులు క్షణాల్లో గడిచాయి.. దశాబ్దాల క్రితం వెళ్లిపోయిన కుటుంబాలు కూడా ఊరికి తిరిగొచ్చాయి. నేను పుట్టకముందే ఊరు వదిలి ఉపాధి కోసం వెళ్లిన వారు సైతం ఆ పండుగకు రావడం భలే ఆనందం అనిపించింది. ఏదైనా ఊరికి వెళ్లి ఉండడమంటే ఎవరికి ఇష్టం ఉండదు?
ఇలాంటి వేడుకలు ఆధ్యాత్మిక కార్యక్రమాలే కావచ్చు. నమ్మకాలు, మూఢ నమ్మకాలు.. దేవుడి మీద భక్తి ఉండొచ్చు..లేదంటే నామమాత్రంగా ఉండొచ్చు. కానీ ఇలాంటి జాతరలు మాత్రం ప్రతి ఊరిలోనూ జరగాల్సిందే. ఆ ఊరిని ఏకం చేసేందుకు, ఏకతాటి మీద నిలబెట్టేందుకు దోహదపడే సామూహిక కార్యక్రమాలివి. నల్లగొండ జిల్లాలో దాదాపు ప్రతి పల్లెలోనూ ఏదో ఒక జాతర లేదంటే అందరూ కలిసి నిర్వహించుకునే ఓ వేడుక ఉంటుంది. కనీసం పక్క ఊరి జాతరైనా ఉంటుంది. అందుకే మా నల్లగొండ జిల్లా ప్రత్యేకమే. మా ఊరు గురించి ప్రస్తావిస్తున్నానంటే ప్రతి పల్లె కూడా ఇలాంటిదే. ఎప్పుడో ఉపాధి కోసం పట్నం బాట పట్టినా, ఉద్యోగాల కోసం విదేశాలకు పరుగు పెట్టినా ఊరును గుర్తు చేసుకోవాలంటే ఏదో ఒక వేడుక అంశంగా నిలుస్తుంది. అందుకే మా ఊరు మంచితనం గురించి చెప్తున్నాను.
కలుపుగోలు..
మా ఊరిలో జాతర అంటే కులాలకతీతంగా జరిగేది. ఎక్కడా ఆ తేడానే కనిపించదు.. అందరూ ఏకమైతేనే, అందరూ ఉంటేనే ఆ వేడుక పూర్తవుతుంది. ప్రతి కులం అవ సరం ఆ జాతరకు ఉంటుంది. ఏ ఒక్కరూ లేకపోయినా వెలితే. నా చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాను. జాతర ఎప్పుడొస్తుం దా? అని ఎదురుచూసే రోజులవి. స్నేహితులను కలుసుకోవచ్చు. అన్ని కుటుం బాల సంతోషాన్ని, దు:ఖాన్ని పంచుకునేందుకు ఉపయోగపడే సరైన సమయమదే. ఇప్పటికీ అంతే.. జాతర పేరుతోనైనా ఊరికి వెళ్లొచ్చునన్న ఆశ. ఈ సారి కూడా అలా కొందరు మిత్రులు ఆహ్వానించగానే గుర్తుకొచ్చాయి. అప్పటికీ ఇప్పటికీ ఏం తేడా లేదు. ప్రతి ఒక్కరూ కలుపుగోలుతనంతో ఉంటారు. ఎందుకో ఏమో గానీ.. అప్పుడైనా, ఇప్పుడైనా కులం పట్టింపు లేకుండానే వరుసలు పెట్టి పిలుచుకోవడం ఆనవాయితీ. అదే కదా ఊరి స్వభావం. మా ఇంటికి దగ్గరగా ఉండే ముస్లిం కుటుంబాన్ని కూడా మేం ఇప్పటికీ వరుసలతోనే క్షేమ సమాచారాన్ని అడుగుతాం. ఏ రోజు కులాల మధ్య గొడవలు చోటు చేసుకున్న సందర్భాలు లేవు. అలాగే కలకాలం కొనసాగాలని కోరుకుందాం.
లోకల్ మేడ్
ఇప్పుడంటే స్వీట్ షాప్స్‌కి వెళ్లి కొనుక్కుంటున్నాం కానీ మా ఊరి జాతరలో అప్పటికప్పుడే తయారు చేసే స్వీట్లు ఉంటాయి. ఐతే ఇవి లోకల్ మేడ్. తెలిసిన వాళ్లే అమ్మితే కొనేవాళ్లం. గాజులు, బొమ్మల షాపులు.. ఇలా ఒక్కటేమిటి? ప్రతి షాపు యజమాని సొంత మనుషుల లెక్కనే. కొందరు పక్క ఊరి వారైతే.. ఇంకొందరు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్లే. కానీ ప్రతి సంవత్సరం ఒకే చోట షాపు పెడుతుండడంతో అందరికీ పరిచయమే. అంటే వ్యాపారంలో ఏ ఎస్జీ, ఎస్టీ, సీజీఎస్టీలు లేకుండానే సాగాయి. ఇప్పుడంటే అన్నీ క్యూఆర్ కోడ్స్‌తోనే చెల్లింపులాయే. అంతా డిజిటల్ మనీతోనే లావాదేవీలాయే. ఏదేమైనా జాతరలో పెట్టే ప్రతి షాపుతోనూ అందరికీ అనుబంధం ఉండేది. ఇప్పుడూ ప్రతి పల్లె జాతరలో కొనసాగుతుండడం వెనుక స్వచ్ఛమైన మనుసులే కారణం. లేదంటే క్వాలిటీ, బ్రాండెడ్ అంటూ షోరూముల్లో కొనుగో లు చేసే రోజుల్లోనూ ఆ చిన్న దుకాణాలు మనుగడ సాగించడం వెనుక జాతర మహత్తు తప్పకుండా ఉంది. ఆ జాతరే లేకుంటే ఎన్ని కుటుంబాలకు ఇబ్బంది కలిగేదో కదా! అందుకే ప్రతి జాతర వర్ధిల్లాలి. మీరు కూడా నాతో ఏకీభవిస్తారనుకుంటున్నాను. ఐతే ఏ కుటుంబమైనా ఆ చిన్న షాపుతోనే కాలం వెళ్లదీయాలన్నది నా అభిమతం కాదు. కానీ గడిచినంత కాలం ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలంటే తప్పదనేది నా అభిప్రాయం.
ఒక్క ఫొటో వెయ్యి మాటలే
ఎందుకో తెలియదు.. కానీ ఊరి అంగడి బజార్ చాలా స్పెషల్‌గా ఉంటుంది. నేను తెలంగాణ వ్యాప్తంగా తిరిగాను. ఎక్కడా ఊరి మధ్యలో అంత ఓపెన్ స్పేస్ ఉన్నది గమనించలేదు. అంగడి బజార్‌కి ఓ వైపున ఆలయం. మూడు వైపులా ఓపెన్ స్థలం. అన్నీ షాపులే. ఇలా ఉండడంతో చాలా అందంగా కనిపిస్తుంది. ఐదేండ్ల క్రితం మా రాము (ఫొటోగ్రాఫర్) మంచి వీడియో తీశాడు. వాటిని యూట్యూబ్‌లోనే పెట్టాం. ఐతే నన్ను జాతరకు రావాలని ఆహ్వానించిన ఓ మిత్రుడు ఆ వీడియో గురించి గుర్తు చేయడంతో మళ్లీ మళ్లీ చూసి మా ఊరి అందాన్ని గుర్తుకు తెచ్చుకున్నాను. 20, 30 ఏండ్ల క్రితం జాతరకొచ్చిన చాలా మంది ఫొటో స్టూడియోలోకి అడుగు పెట్టే వారు. జాతరలో ఫొటోలు దిగితే ఆ మజానే వేరు కదా. ఇప్పుడేమో మా వేణుగోపాల స్వామి రథం కదులుతుందంటే వందల కెమెరాలు(మొబైల్స్) చూస్తున్నా యి. ప్రతి క్షణం మా ఊరి వాట్సాప్ గ్రూపుల్లో అప్‌లోడ్ అవుతూనే ఉన్నాయి. ఆలయానికి కలర్స్ వేసే ప్రక్రియ నుంచి ముగింపు ఘట్టం వరకు లేటెస్ట్ అప్‌డేట్స్ వస్తుండడంతో జారతకు వెళ్లలేని వేలాది మందికి తృప్తినిస్తుంది. జాతరలోనూ సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. నాలాగా హైదరాబాద్‌లో స్థిరపడిన వేలాది మందికి ఊరి గురించి ప్రతిరోజూ తెలుసుకునే వెసులుబాటు కలిగింది.
వేడుకంటే సంతోషమే
మా నల్లగొండ జిల్లాలో వందల జాతరలు ఉన్నాయి. ఆ ఊరి గుడిలో దేవుడు, చరిత్రను బట్టి ఏదో ఒక సందర్భంగా సంవత్సరానికి ఒక్క సారైనా ఊరంతా ఒక్కటవడం మాత్రం పక్కాగా జరుగుతుంది. చిన్న చిన్న బేధాభిప్రాయాలు సహజం. కానీ జాతరను గట్టెక్కించడంలో మాత్రం ఏకాభిప్రాయ నెలకొంటుంది. ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నా, ఎన్ని కక్షలు, కార్పణ్యాలు ఉన్నా జాతర రోజు మాత్రం హాజరు కావాల్సిందే. ఎన్నికలు, పార్టీలు.. ఎవరి అభిప్రాయం వారిదే. కానీ గ్రామాల్లో ఏకాభిప్రాయంతో నిర్వహించే వేడుక ఈ జాతర్లు మాత్రమే. వేగంగా మారుతున్న కాలంలోనూ, ఉపాధి కోసం ఉరుకులు, పరుగులు పెడుతున్న తరుణంలోనూ ఊరిని ఏకం చేయాలంటే జాతర రావాల్సిందే. ఈ జాతర్లు ప్రతి పల్లెలోనూ కలకలం వర్ధిల్లాలి.. వందేండ్లయినా.. తరాలు మారుతున్నా మనుషులను ఏకం చేసే దేవుడు పూజలు అందుకోవాల్సిందే. అందుకే ఎక్కడ స్థిరపడినా వీలు చూసుకొని మీ ఊరికి వెళ్లడానికి ప్రయత్నించండి.
శిరందాస్ ప్రవీణ్ కుమార్
80966 77450






