ఆధునిక హంగులతో ‘బుద్ధునితో నా ప్రయాణం’

by Ravi |   (  Updated:2025-08-04 00:46:05  IST  )

ఎలక్ట్రానిక్ మీడియా ఆవహించిన ఈ రోజుల్లో ఓ నాటకం వందల మంది ప్రేక్షకులను కదలకుండా రెండున్నర గంటలు కట్టిపడేసింది.

ఆధునిక హంగులతో ‘బుద్ధునితో నా ప్రయాణం’
X

ఎలక్ట్రానిక్ మీడియా ఆవహించిన ఈ రోజుల్లో ఓ నాటకం వందల మంది ప్రేక్షకులను కదలకుండా రెండున్నర గంటలు కట్టిపడేసింది. నాటకాన్ని చూసిన వారందరికీ ఓ కొత్త అనుభూతిని కలిగించింది. అదే ‘బుద్ధునితో నా(అంబేద్కర్) ప్రయాణం’ అనే నృత్య రూప నాటకం. స్టేజీ నాటకానికి ఆధునిక హంగులు అద్దారు. నాటకంను ప్రదర్శించే తీరులో నూతన పోకడలకు ప్రాధాన్యత ఇచ్చారు. రికార్డ్ చేసిన నాటకాన్ని 30 మంది కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. భాష, భావం, సంగీతం, నృత్యాలతో బౌద్ధాన్ని స్టేజీపై ఆవిష్కరించారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన ‘బుద్ధుడు ఆయన ధర్మం’ పుస్తకం ఆధారంగా ఈ నాటకాన్ని రాశారు. ఆ నాటి సామాజిక పరిస్థితులను, గౌతముడు బుద్ధుడిగా మారిన తీరు, బుద్ధుని బోధనల సారంతో బౌద్ధం-అంబేద్కరిజంని ఆవిష్కరించారు.

రికార్డు చేసిన నాటకం అయినప్పటికీ..

బౌద్ధానికి, బుద్ధునికి, జీవితానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు లభిస్తాయి. అంబేద్కర్ కలిగిన సందేహాలు ఎలా నివృత్తి అయ్యాయో, మనకి కూడా నివృత్తి అవుతాయి. అతి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఎక్కవ భాగం వాడుక భాషలో ఈ దృశ్య రూపకాన్ని అద్వితీయంగా రూపొందించారు. కొన్ని దృశ్యాలు చాలా ప్రత్యేకంగా ప్రదర్శించారు. వాటిలో గౌతముడు బుద్ధుడిగా మారిన సన్నివేశం చూపరులను బాగా ఆకట్టుకుంది. వేదికపై ఒకేసారి మూడు సన్నివేశాలు కనిపిస్తాయి. రికార్డ్ చేసిన నాటకం అయినా, ప్రేక్షకులు గమనించలేనంగా నటీనటులు అందరూ పెదాల కదలికను ప్రదర్శించారు. రికార్డ్ చేసిన నాటకం అయినందునే నిర్ణయించిన ప్రకారం 2.20 గంటలకు ముగుస్తుంది.

ఆకట్టుకున్న నటన..

బుద్ధుడి పాత్రధారి చాలా అందంగా ఉన్నారు. చక్కటి ముఖ వర్చస్సు. బుద్ధుడిలోని ఆ శాంతం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, నడక, నమ్రత, స్థిత ప్రజ్ఞత, మరణాన్ని జయించిన తేజస్సు ఆ నటుడిలో మూర్తీభవించింది. ఆయన మాటతీరు, అభినయం అద్వితీయం. నాటకం ఆద్యంతం, స్టేజీపై లైట్లు ఆఫ్ చేసిన సమయంలో కూడా ఆ నటుడి నటన ఒకే తీరుగా ఉండటం ప్రత్యేకం. అంబేద్కర్ పాత్రధారి కూడా చాలా చక్కగా నటించారు. ఆయన నడవడి, మాటతీరు, సందేహాలు వ్యక్తం చేసే విధానం బాగా ఆకట్టుకున్నాయి. బుద్ధుడు, అంబేద్కర్ ఇద్దరి వస్త్రధారణ బాగుంది. నాటకం మొత్తాన్ని మోసిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు మొత్తం ఆరుగురు నృత్య కార్మికులు, శ్రామికులు, కళాకారుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారు నాటకం మొత్తం శ్రమించారు. వారు అలుపెరుగకుండా, చెమటలు కక్కుతూ, ప్రేక్షకుల ఆసక్తి తగ్గకుండా నృత్యం చేశారు. కథంగా వారే నడిపారు. దాదాపు రెండు గంటలు వారు నృత్యం చేయడంతోపాటు వివిధ రకాల పాత్రలు కూడా పోషించడం విశేషం.

మైనస్ పాయింట్లు

నాటకం ఇతివృత్తం, ప్రదర్శన తీరు ఎంత అద్బుతంగా ఉన్నప్పటికీ క్లైమాక్స్‌లో హిందు మతాన్ని విమర్శించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. మతం ఏదైనా(ఏదైనా) మత్తు మందులాంటిదే. అందులో సందేహంలేదు. అలాంటప్పుడు ఒక్క హిందు మతాన్నే విమర్శించడం సరైన ఆలోచన కాదని నాకు అనిపించింది. అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్నే ఎందుకు స్వీకరించారు.? అది మరో అంశం. అంబేద్కరిస్టులలో అత్యధిక మంది క్రైస్తవులు లేక ఆ మతానికి చెందిన కుటుంబాల నుంచి వచ్చినవారే. ఇది మరో పెద్ద అంశం. వాటిజోలికి నేను వెళ్లడంలేదు.

ఈ మార్పులు చేస్తే..

సమాజానికి ఎంతో ఉత్తమమైన, విలువైన సందేశాలను అందించిన, బుద్ధుని బోధనలను అత్యంత ఆసక్తికరంగా చూపించి, వినిపించి, చివరకు హిందూ మతాన్ని విమర్శించిన తీరు అసలు బాగోలేదు. ఉత్తమ బోధనలతో శిఖర స్థాయికి వెళ్లిన ఆలోచనలు చివరి అయిదు నిమిషాల్లో ఒక్కసారిగా దిగజారినట్లనిపించింది. ఈ సమాజానికి ఈ నాటకం అవసరం చాలా ఉంది. బౌద్ధం, అంబేద్కర్ భావజాలంతో పాటు ప్రపంచ మానవ జాతికి కావాల్సిన అనేక అంశాలను అత్యంత సులువుగా అర్థం చేసుకునే విధంగా నాటకంని ప్రదర్శించారు. అందువల్ల, నాటక రచయిత, ప్రదర్శకులు ఈ విషయాన్ని తప్పక ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇక ముందు ముందు ప్రదర్శనలలో మార్పులు చేస్తే మంచిదని నా అభిప్రాయం. అలాగే నాటకంలో భాష 90 శాతం వ్యవహారికమే వాడారు. ఓ పది శాతం మాత్రం గ్రాంథికం వాడారు. దానిని కూడా వ్యవహారికంలోకి మార్చవలసిన అవసరం ఉందనిపించింది.

వర్షం పడుతున్న లెక్కచేయకుండా..

విజయవాడ మొగల్రాజ్ పురం సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో జూలై 22 మంగళవారం రాత్రి బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్ధ కళాపీఠం, కామ్రేడ్ జీఆర్‌కే - పోలవరపు సాంస్కృతిక సమితి వారి సంయుక్త సహకారంతో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు ఈ నాటకాన్ని ప్రదర్శించారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా వందల మంది నాటకం చూసేందుకు వచ్చారు. వారిలో కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వారితో పాటు ప్రగతిశీల వాదులు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. కదలకుండా కూర్చొని చూశారు. ఓ నాటకం పట్ల ప్రజలు ఇంతటి ఆసక్తి కనబరచడం, వారి ఆలోచనల స్థాయికి తగ్గకుండా నాటకాన్ని ప్రదర్శించడం గమనార్హం. సంతోషం.

-శిరందాసు నాగార్జున,

సీనియర్ జర్నలిస్ట్

94402 22914

Next Story