ఆర్భాటంగా మారుతున్న పెళ్లిళ్లు..

by Ravi |   (  Updated:2026-03-13 00:45:27  IST  )

భారతదేశంలో ఆధునిక టెక్నాలజీ, డెస్టినేషన్ వెడ్డింగ్స్ ప్రభావంతో పెళ్లిళ్లు రోజురోజుకు ఆర్భాటంగా మారుతున్నాయి. పెరుగుతున్న పెళ్లి ఖర్చులు, కొత్త ట్రెండ్లు, యువత ఆలోచనల్లో వచ్చిన మార్పులపై ఈ ప్రత్యేక కథనం.

ఆర్భాటంగా మారుతున్న పెళ్లిళ్లు..
X

ఆధునిక టెక్నాలజీ హంగుల ప్రపంచంలో వివాహ మహో త్సవాలు రోజురోజుకు మరింత ఆర్భాటంగా మారుతున్నాయి. ఒకప్పుడు ప్రముఖులు, సంపన్నులు మాత్రమే తమ హోదాను ప్రదర్శించేందుకు భారీగా ఖర్చు చేసేవారు.. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ప్రత్యేక ఉత్సవంగా పెళ్లి!

సామాజిక జీవన విధానంలో వచ్చిన మార్పులు, ఆర్థిక స్థితి గతుల్లో పెరిగిన అవకాశాలు, యువతలో పెరిగిన ఆత్మవిశ్వాసం-ఇవన్నీ కలిసి వివాహాల రూపాన్ని కొత్త దిశగా తీసుకెళ్తున్నాయి. ఇప్పటి తరంలో పెళ్లి అంటే కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు. ఒక ప్రత్యేకమైన ఉత్సవంగా మారింది. జీవితంలో ఒకసారి జరిగే ఈ వేడుకను చిరస్మరణీయంగా నిలుపు‌కోవాలనే కోరిక ప్రతి కుటుంబంలో పెరుగుతోంది. అందుకే పెళ్లి వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు..

భారీగా పెరిగిన పెళ్లి ఖర్చులు..

ఇటీవలి కాలంలో పెళ్లి ఖర్చులు భారీగా పెరిగినట్టు పలు సర్వేలు సూచిస్తున్నాయి. ‘వెడ్ మి గుడ్’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో గత సంవత్సరాలతో పోలిస్తే వివాహ వ్యయం గణ నీయంగా పెరిగినట్లు వెల్లడైంది. 2022లో సగటు పెళ్లి ఖర్చు సుమారు రూ.25 లక్షలు కాగా, 2023లో అది రూ.28 లక్షలకు చేరింది. 2024 నాటికి అది మరింత పెరిగి సగటున రూ.36.5 లక్షలకు చేరిందని ఆ సర్వే తెలిపింది. డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ కోసం సగటు ఖర్చు రూ.51.1 లక్షలకు పైగా ఉందని పేర్కొంది. అదే విధంగా పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసే వారు సుమారు 9 శాతం ఉన్నారని, రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేసే వారు 18 శాతం వరకు ఉన్నారని సర్వేలో వెల్లడైంది. మరోవైపు రూ.25 లక్షల లోపు ఖర్చు చేసే వారు సుమారు 60 శాతం వరకు ఉన్నారని పేర్కొన్నారు.

ఖర్చుకు తగ్గేదేలే- అందరికీ నచ్చినట్లే..!

ముఖ్యంగా యువతలో ఆర్థిక స్వావలంబన పెరిగింది. చిన్న వయసులోనే మంచి ఉద్యోగాలు సంపాదిస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. ఐటీ, కార్పొరేట్ రంగాల్లో పనిచేస్తున్న యువతలో ‘జీవితం ఒక్కసారే వస్తుంది’ అనే భావన బలపడుతోంది. అందువల్ల పెళ్లి వేడుకలను ప్రత్యేకంగా జరుపుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది. భవిష్యత్తులో మరింత సంపాదించగలమనే ధీమాతో పెళ్లి వేడుకలపై భారీగా ఖర్చు చేస్తున్నారు.

జోరుగా డెస్టినేషన్ వెడ్డింగ్స్!

పట్టణాల్లో ఉన్న కన్వెన్షన్ సెంటర్లు, ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు, లగ్జరీ హోటళ్లు వివాహాలకు ప్రధాన వేదికలుగా మారాయి. సంపన్నులు, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు విదేశాల్లో లేదా ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ నిర్వహిస్తున్నారు. గోవా, జైపూర్, ఉదయపూర్, కేరళ వంటి ప్రాంతాలు ఇందుకు ప్రధాన కేంద్రాలుగా నిలుస్తున్నాయి.. మధ్యతరగతి కుటుంబాలు కూడా కన్వెన్షన్ సెంటర్లు, రిసార్టుల్లో పెళ్లి వేడుకలు నిర్వహించడం సాధారణంగా మారింది.

టెక్నాలజీతో కొత్త ట్రెండ్

ఇటీవలి కాలంలో పెళ్లి ఆహ్వాన పత్రికలు కూడా కొత్త రూపం దాల్చాయి. ఒకప్పుడు సాధారణంగా ఉండే శుభలేఖలు ఇప్పుడు టెక్నాలజీతో ముస్తాబై ఆకర్షణీయంగా మారాయి. వెండి, బంగారు అక్షరాలతో అచ్చు వేసిన కార్డులు, ప్రత్యేక డిజైన్లు, బాక్స్ ఇన్విటేషన్లు ఇప్పుడు ఫ్యాషన్‌గా మారాయి. కొత్తగా వర్చువల్, ఎన్‌ఎఫ్‌సీ, 3డీ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డులు కూడా అందుబాటులోకి వచ్చాయి.

ఫ్యాషన్‌గా మారుతున్న ఖర్చు..!

ఈ విధంగా వివాహ వేడుకలు ఒక ఫ్యాషన్‌గా మారుతున్నా యి. ఆర్థికంగా స్థోమత ఉన్నవారు భారీగా ఖర్చు చేయడంలో తప్పేమీ లేదు. కానీ కొందరు తమ స్థాయికి మించి కేవలం ప్రతిష్ట కోసం అప్పులు చేసి పెళ్లిళ్లను ఆర్భాటంగా నిర్వహించడం ఆందోళ‌నకరం. పెళ్లి తరువాత సంవత్సరాల పాటు అప్పులు తీర్చాల్సిన పరిస్థితి రావడం కుటుంబాల ఆర్థిక స్థితిని దెబ్బ తీస్తోంది. అధిక డబ్బు ఉంటే పేదలకు సహాయం చేయడం, అనాథా‌శ్రమాలు, విద్యాసంస్థలు లేదా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు కొంత భాగం ఖర్చు చేయడం కూడా ఒక మంచి సంప్రదాయంగా మారాలి.

-మేకిరి దామోదర్

95736 66650

Next Story