- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలి సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రం
సామాజిక అభివృద్ధికి అక్షరాస్యత మూలస్తంభం. అభివృద్ధి చెందాలనుకున్న ప్రతి రాజ్యం, దేశం తమ అక్షరాస్యత స్థాయిని మెరుగుపరుచుకునే

సామాజిక అభివృద్ధికి అక్షరాస్యత మూలస్తంభం. అభివృద్ధి చెందాలనుకున్న ప్రతి రాజ్యం, దేశం తమ అక్షరాస్యత స్థాయిని మెరుగుపరుచుకునే దిశగా నిరంతరం కృషిచేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో, ఇటీవల మిజోరం రాష్ట్రం దేశంలోనే సంపూర్ణ అక్షరాస్యతను (95%) సాధించిన తొలి రాష్ట్రం తమదేనని అధికారికంగా ప్రకటించుకోవడం అభినందనీయమైన ఘట్టం.
దూర ప్రాంతాల్లో గ్రామాలు..
1991 నుంచి త్రిపుర, కేరళ వంటి రాష్ట్రాలు అక్షరాస్యత పరంగా అగ్రగాములుగా నిలుస్తున్న సమయంలో, ఈ విజయంతో మిజోరం భారతదేశంలో అక్షరాస్యత రంగంలో మరో మార్గదర్శక రాష్ట్రంగా నిలిచింది. ఇక్కడ ఆశ్చర్యకరమైనది ఏమిటంటే, మిజోరం పర్వత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న, దూర ప్రాంతాల్లో గ్రామాలు కలిగిన రాష్ట్రం. పైగా సాంకేతిక వనరులు, లాజిస్టిక్ సదుపాయాలు పరిమితంగా ఉండటం వల్ల అక్కడ విద్యా విస్తరణ అనేది సాధారణంగా కష్టం అనిపించే విషయం. అయినప్పటికీ, మిజోరం ఈ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేయగలగడం వెనుక కారణాలను విశ్లేషించడం అవసరం.. ముఖ్యంగా, అక్షరాస్యత శాతం ఇంకా మెరుగుపరచుకోలేని తెలంగాణ రాష్ట్రానికి ఇది కీలక పాఠం.
మిజోరం విజయ రహస్యం
చాలా కాలం నుంచే విద్య పట్ల చైతన్యం ఈ ప్రాంతంలో ఉంది. మిజోరంలో క్రైస్తవ మిషనరీల ప్రభావం ఉండటంతో, అనేక దశాబ్దాల క్రితమే విద్యకు ప్రాధాన్యతనిచ్చే సంస్కృతి ఏర్పడింది. ప్రజలలో చదువు గురించి చైతన్యం ఏర్పడింది. స్థానిక పాలనా సంస్థల చురుకు దనంతో గ్రామస్థాయిలో విద్యా సంస్థలు, బాల బాలికల పాఠశాలల నిర్వహణలో గ్రామస్థాయి పాలనా వ్యవస్థలు ముఖ్య పాత్ర పోషించాయి. ప్రజాప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు విద్య పట్ల అవగాహన కలిగించడంలో భాగమయ్యారు. ఉచిత విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు ప్రాథమిక స్థాయిలోనే కాకుండా, హైస్కూల్ స్థాయి వరకు విద్యా సామగ్రి ఉచితంగా అందించడం వల్ల పేద కుటుంబాల పిల్లలు కూడా చదువుపై ఆసక్తి చూపగలిగారు. క్రమబద్ధమైన సామాజిక ప్రచారాలు, అక్షరాస్యతపై ప్రభుత్వ కార్యక్రమాలు మాత్రమే కాకుండా, ప్రజలలో విద్యపై అవగాహన కలిగించే విధంగా సంఘాలు, సంస్థలు పనిచేశాయి.
సమిష్టి కృషి కారణంగా..
2011 జనాభా లెక్కల ప్రకారం, మిజోరం రాష్ట్రం 91.33 శాతం అక్షరాస్యత రేటును కలిగి, దేశంలో మూడో స్థానంలో ఉంది. ఈ పునాదిపై, మిగిలిన నిరక్షరాస్యులైన వ్యక్తులను గుర్తించి వారికి విద్యను అందించడానికి ULLAS - అండర్‌స్టాండింగ్ ఆఫ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ, నవ భారత్ సాక్షరత కార్యక్రమాలను అమలు చేసారు. 2011 జనాభా లెక్కల డేటా ఆధారంగా, సర్వేలు నిర్వహించారు. 3,026 మంది నిరక్షరాస్యులను గుర్తించి. వారిలో 1,692 మంది సంభావ్య అభ్యాసకులుగా గుర్తించారు. విద్యార్థులు, విద్యావేత్తలు, రిసోర్స్ పర్సన్లు, క్లస్టర్ రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్లు సహా మొత్తం 292 మంది స్వచ్ఛంద ఉపాధ్యాయులు ఈ మిషన్‌కు నాయకత్వం వహించడానికి ముందుకు వచ్చారు. సమిష్టి కృషి, అంకితభావం, సమాజ సమీకరణ ఫలితంగా మిజోరం పూర్తి అక్షరాస్యత సాధించింది. ఒక చిన్న రాష్ట్రం ఎంతటి లక్ష్యాలను సాధించగలదన్న దానికి మిజోరం రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యతను సాధించడమే నిదర్శనం. అక్షరాసత రాష్ట్రానికే కాకుండా దేశానికే ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మూల స్తంభం. అందుకే మిజోరం మార్గంలో తెలంగాణ ముందడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది.
కమలహాసన్ తుమ్మ
95056 18252






