- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక సంక్షోభం దిశగా భారత్..!?
పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న వేళ, భారత్‌పై వాటి ప్రభావం ఎలా ఉందో, ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పడిపోవడం వంటి సవాళ్లతో పాటు భవిష్యత్ అవకాశాలపై సమగ్ర అవగాహన..

పశ్చిమ ఆసియాలో చెలరేగిన యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపేస్తున్నాయి. ఇది కేవలం ప్రాంతీయ ఘర్షణగా మిగలకుండా, ఇప్పుడు గ్లోబల్ సరఫరా వ్యవస్థలపై నేరుగా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చమురు, సహజ వాయువు సరఫరాల్లో అంతరాయం ఏర్పడటం, హార్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో అనిశ్చితి పెరగడం వల్ల ఇంధన ధరలు పెరుగుతున్నాయి.. ఈ పరిణామాలు ప్రపంచ మార్కెట్లలో అస్థిరతను పెంచుతూ, అభివృద్ధి చెందుతున్న దేశాలపై అధిక ఒత్తిడిని సృష్టిస్తున్నాయి.
ఈ ప్రభావం నుంచి భారత్ తప్పించుకోలేకపోతోంది. రవాణా ఖర్చులు పెరగడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు ఎగబాకుతున్నాయి.. ఇంధన ధరల పెరుగుదల నేరుగా ద్రవ్యోల్బణాన్ని పెంచుతూ, సామాన్యుడి జీవన వ్యయాన్ని గణనీయంగా పెంచుతోంది. రూపాయి విలువ పడిపోవడం దిగుమతులను మరింత ఖరీదుగా మారు స్తోంది. ముఖ్యంగా చమురు దిగుమతులపై అధిక ఆధారపడటం దేశ ఆర్థిక బలహీనతను బయటపెడుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే జీడీపీ వృద్ధి రేటుపై కూడా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది.
దౌత్యపరంగా పరీక్షే..!
దౌత్య పరంగా కూడా భారత్‌కు ఇది కీలక పరీక్ష కాలం. సమతుల్య విదేశాంగ విధానం అమలులో స్పష్టత లేక పోవడం విమర్శలకు దారితీస్తోంది. పశ్చిమ దేశాలు, గల్ఫ్ దేశాలు, ఇరాన్ మధ్య సమతుల్యత పాటించడంలో ఆలస్యం జరిగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. అంతర్జాతీయ రాజకీయాల్లో మాటలు, సంకేతాలు కూడా ప్రాముఖ్యం కలిగి ఉంటాయి. సమయస్ఫూర్తితో స్పందించకపోతే దేశ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో పని చేస్తున్న లక్షలాది భారతీయుల భద్రత మరో ప్రధాన ఆందోళన. అక్కడి అస్థిరత పెరిగితే వారి ఉపాధి మాత్రమే కాదు, దేశానికి వచ్చే విదేశీ మారక ప్రవాహాలు కూడా తగ్గే ప్రమాదం ఉంది. ఇది దేశీయ వినియోగం, పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
దేశీయంగా తీవ్ర భారం..!
దేశీయంగా చూస్తే ద్రవ్యోల్బణం సాధారణ ప్రజలపై తీవ్రమైన భారం మోపుతోంది. ఆహార ధరల పెరుగుదల మధ్య తరగతి, పేద వర్గాల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తోంది. ఇక ఆదాయాలు తగినంతగా పెరగక పోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. ప్రభుత్వం అందించే సబ్సిడీలు తాత్కాలిక ఉపశ మనాన్ని ఇచ్చినా, పెరుగుతున్న ప్రభుత్వ అప్పులు దీర్ఘకాలిక ఆర్థిక సవాళ్లకు దారితీసే ప్రమాదం ఉంది. అయితే ఈ సంక్షోభం కొన్ని సానుకూల సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ గణనీయమైన పురోగతి సాధిస్తోంది. సౌర, పవన శక్తి వినియోగం పెరగడం ద్వారా ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే అవకాశం ఉంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణ, పన్ను వసూళ్ల పెరుగుదల వంటి అంశాలు ప్రభుత్వానికి కొంత ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తున్నాయి.
తయారీ సామర్ధ్యం పెంచాలి...!
దీర్ఘకాలిక స్థిరత్వం కోసం దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచడం అత్యవసరం. ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఫలితాలు ఇవ్వాలి. ఎలక్ట్రానిక్స్, యంత్రాల తయారీ రంగాల్లో స్వయం సమృద్ధి సాధిస్తే దిగుమతులు తగ్గడమే కాకుండా, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి. వ్యవసాయ రంగంలో కూడా నిర్మాణాత్మక మార్పులు అవసరం. రైతులకు సరైన ధరలు, సమర్థ సరఫరా వ్యవస్థ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక క్రమశిక్షణ అత్యంత కీలకం. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగం, ఆర్థిక సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. బ్యాంకింగ్ రంగంలో బకాయిల నియంత్రణ, పెట్టుబడుల సమర్థ వినియోగం అవసరం. నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక వినియోగం ద్వారా ఉత్పాదకతను పెంచడం ద్వారా మాత్రమే భారత్ గ్లోబల్ పోటీలో ముందుకు సాగగలదు..
సమిష్టి బాధ్యతతో సంక్షోభాన్ని అధిగమించాలి...!
విధాన నిర్ణేతలు తక్షణ రాజకీయ ప్రయోజనాలకు కాకుండా దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. సవాళ్లు ఎన్నో ఉన్నా, సరైన విధానాలు, సమగ్ర సంస్కరణలు, సమష్టి బాధ్యతతో ముందుకు సాగితే భారత్ ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని, ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదగ గలదు. మొత్తంగా చూస్తే, పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావాలు భారత్‌కు గట్టి హెచ్చరికగా మారాయి.. సమయోచిత దౌత్యం, నిర్మాణాత్మక సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణతో ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవడం సాధ్యం. సామాన్యుడి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే ఆర్థిక అభివృద్ధి సార్థకం అవుతుంది.
- ఉదయ్ కుమార్.జి
83676 03197






