- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశవ్యాప్తంగా రేపు మెడికల్ షాప్‌లు బంద్.. ఎందుకంటే?
ఆన్‌లైన్ ఫార్మసీల పెరుగుతున్న వ్యాపార ధోరణులు దేశవ్యాప్తంగా చిరు మెడికల్ షాపుల మనుగడకు ముప్పుగా మారుతున్నాయి. నకిలీ మందులు, యాంటీబయోటిక్ రెసిస్టెన్స్, కార్పొరేట్ ఆధిపత్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చారు.

ఆన్ లైన్ ఫార్మసీల అక్రమ వ్యాపార ధోరణుల కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షలకు పైగా చిరు మెడికల్ షాపుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. వినియోగదారులు కళ్లముందు కనిపించే తక్షణ లాభాలకు ఆకర్షితులవుతుండడం ప్రమాదకరం. దీంతో దీర్ఘకాలంలో స్థానిక మెడికల్ షాపులు మూతపడితే ప్రజలు పూర్తిగా కార్పొరేట్ సంస్థలపై ఆధారపడే ప్రమాదం పొంచి ఉంది.
గాలిలో దీపంలా ప్రజారోగ్యం!
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనిషి అవసరాలను సులభతరం చేస్తూ సమస్తాన్ని ఇంటి ముంగిటకే తెచ్చిపెడుతోంది. కానీ, ప్రాణా లతో ముడిపడి ఉన్న ఔషధాల విషయంలో మాత్రం ఈ విధానం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేవలం లాభాలే పరమావధిగా సాగు తున్న ఈ - ఫార్మసీల ధాటికి ప్రజారోగ్యం గాలిలో దీపంగా మారు తోంది. సాధారణ వస్తువుల విక్రయానికి, ప్రాణరక్షక ఔషధాల విక్రయానికి మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని విస్మరించి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తలుపులు బార్లా తెరవడం విచారకరం.
యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ఓ మహమ్మారి..
ప్రిస్క్రిప్షన్‌ను సరైన వెరిఫికేషన్ లేకుండానే మందులు సరఫరా అవుతుండటంతో నకిలీ మందులు రోగి చెంతకు చేరే ప్రమాదం పెరుగుతోంది. అంతేకాకుండా యాంటీబయోటిక్స్‌ను వైద్యుల పర్యవేక్షణ లేకుండా అధికంగా వినియోగించడం వల్ల భవిష్యత్తులో మందులు పనిచేయని 'యాంటీబయాటిక్ రెసిస్టెన్స్' వంటి ప్రమాద కర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. యువత నిద్రమాత్రలు, ఇతర మత్తు కలిగించే మందులకు సులభంగా బానిసయ్యే పరి స్థితులు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇది యువశక్తిని నిర్వీర్యం చేస్తూ జాతి భవిష్యత్తునే ప్రమాదంలోకి నెడుతోంది.
డేంజర్‌లో చిరు మెడికల్ షాపులు..
మరోవైపు, భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయ ఆఫర్ల పేరుతో బహుళ జాతి కంపెనీలు సాగిస్తున్న వ్యాపార ధోరణుల వల్ల దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షలకు పైగా చిరు మెడికల్ షాపుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏ వ్యాపారంలో అయినా ఈ డిస్కౌంట్ల వెనుక ఉన్న వ్యాపార వ్యూహాన్ని అర్థం చేసుకోలేని వినియోగదారులు కళ్లముందు కనిపించే తక్షణ లాభాలకు ఆకర్షితులవుతున్నారు. కానీ, దీర్ఘకాలంలో స్థానిక మెడికల్ షాపులు మూతపడితే ప్రజలు పూర్తిగా కార్పొరేట్ సంస్థలపై ఆధారపడే ప్రమాదం ఉంది.
స్థానిక ఫార్మాసిస్టుల ఉనికికి ప్రమాదం!
చదువురాని, గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద రోగులకు ఆన్‌లైన్ ఆర్డర్లు ఒక భారంగా మారుతుంటే, స్థానిక కెమిస్టులు అందించే సూచనలు, మందుల వినియోగంపై అవగాహన, అత్యవ సర సమయంలో ఇచ్చే మానవీయ సహాయం ఈ విధానంలో పూర్తిగా కనుమరుగవుతున్నాయి. అనేక సందర్భాల్లో రోగి తీసుకుంటున్న ఇతర మందులను పరిశీలించి హెచ్చరించే పాత్రను స్థానిక ఫార్మసిస్టులు నిర్వహిస్తుంటారు. ఆ మానవ సంబంధాన్ని ఏ యాప్ కూడా భర్తీ చేయలేకపోతుంది.
కఠిన నియంత్రణలు అవసరం!
ఇలాంటి ప్రమాదకర ధోరణులను నిరసిస్తూ అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘం (AIOCD) పిలుపు మేరకు మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ జరుగుతోంది. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ-ఫార్మసీ విధానంపై కఠిన నియంత్రణలు తీసుకు రావాలని, ప్రిస్క్రిప్షన్ ఆధారిత మందుల విక్రయంపై పారదర్శక వ్యవస్థను అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. విద్య, వైద్యం వంటి ప్రాథమిక రంగాలు కేవలం లాభాపేక్షకు పరిమితం కాకుండా సేవా దృక్పథంతో కొనసాగేందుకు చట్టబద్ధమైన రక్షణ కల్పించవలసిన అవసరం అత్యవసరంగా కనిపిస్తోంది. బంద్ నేపథ్యంలో ఇప్పటికే ఔషధాలు కావాల్సిన వారు ఒక రోజు ముందుగానే కొనుగోలు చేయండి.
(రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ నేపథ్యంలో )
- యండి. ఫారూఖ్ జునైద్ ఖాన్
రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్
78934 94103






