వైద్య వృత్తి.. వ్యాపారమౌతున్న వేళ

by Ravi |   (  Updated:2025-03-01 01:00:34  IST  )

ఈ విశ్వంలోనే అత్యంత పవిత్రమైన వృత్తి "వైద్య వృత్తి" అందుకే వైద్యో నారాయణో హరీ.. అంటూ సాక్షాత్ భగవంతునితోనే

వైద్య వృత్తి.. వ్యాపారమౌతున్న వేళ
X

ఈ విశ్వంలోనే అత్యంత పవిత్రమైన వృత్తి "వైద్య వృత్తి" అందుకే వైద్యో నారాయణో హరీ.. అంటూ సాక్షాత్ భగవంతునితోనే పోలుస్తారు కూడా.. అంతటి ప్రశస్తమైన సేవారంగం నేడు సరళీకృత ఆర్థిక విధానాల పుణ్యమా అని ఈ రంగం కూడా వ్యాపార రంగంగా మారిపోతుంది. దీనికి వైద్య విద్యా, ఆరోగ్య సేవలు అతీతంగా ఉండలేక పోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు మినహా మెజారిటీ ప్రైవేటు ఆసుపత్రులు వాణిజ్య లాభాపేక్షతోనే నడుపుతున్నారనేది ఎవరూ కాదనలేని నగ్న సత్యం.

అధిక భారంతో కూడిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల కారణంగా, ఆరోగ్య సంరక్షణలో వాణిజ్యీకరణ పెరగడంతో పాటు, వైద్య సేవలపై అపనమ్మకం, అనుమానాలు.. ఆరోగ్య సంరక్షణ చుట్టూ కథనాలుగా మారుతున్నాయని మాజీ భారత ప్రధాన న్యాయ మూర్తి వై.వి చంద్రచూడ్ గతంలో అన్న మాటలు అక్షర సత్యాలు.. భారతదేశంలో పెరుగుతున్న సామాజిక-ఆర్థిక అసమానతలు అట్టడుగు వర్గాల ఆరోగ్య ఫలితాలపై అసమాన ప్రభావాన్ని చూపుతున్నాయని, వైద్యులు వ్యాపార ధోరణిలో చిక్కుకు పొవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఇన్నీ మెడికల్ సీట్లు అవసరమా?

కాసులు కురిపించే వైద్య విద్య వైపు నేడు అత్యధిక ప్రజలు దృష్టి సారించారు. కానీ దీనిని అభ్యసించే స్థితిలో చాలా మంది లేరు. ఒక సగటు తండ్రి తన బిడ్డను డాక్టర్‌గా చూడాలనుకుంటాడు. కానీ స్థోమత ఉండదు. ఇలా ఎందరో తల్లిదండ్రుల ఆశలు నెరవేరకుండా పోతున్నాయి. ముఖ్యంగా మెడికల్ పీజీకి ఎనలేని డిమాండ్ ఉంది. ఈ రోజుల్లో పోటీలో నెగ్గాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. పరపతి కావాలి. ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో మెడికల్ సీటు సాధించిన విద్యార్థి సైతం అన్ని సెమిస్టర్లు పూర్తి చేసే వరకు రూ.10 నుండి 12 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 33 జిల్లాల్లో మొత్తం 62 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి పది లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్లతో మాత్రమే నూతన వైద్య కళాశాల మంజూరు చేస్తామని జాతీయ వైద్య కమిషన్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. నిజానికి తెలంగాణలో జనాభా నిష్పత్తి కంటే అధికంగానే మెడికల్ కాలేజీలున్నాయి. ఎన్ఎంసీ నిబంధన మేరకు తెలంగాణలో 3500 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండాలి. కానీ మొత్తం 8515 సీట్లున్నాయి. ఇలా ఇబ్బడిముబ్బడిగా వైద్య కళాశాలలు రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తగిన మౌలిక సదుపాయాలు కల్పించకుండా పుట్టగొడుగుల్లా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని సీనియర్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కార్పొరేట్ ఆసుపత్రుల దందా!

వైద్యం ఎంతో ప్రియం. సాధారణ వైద్యానికి సైతం వేల రూపాయలు లేకుండా ఆసుపత్రిలో అడుగే పెట్టలేము. ఇక ప్రస్తుతం ప్రైవేటు మెడికల్ కళాశాలలు, ఆసుపత్రులు ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎంతో ఖరీదైన చికిత్సలు, ఆధునిక పరికరాలు సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. అదే సందర్భంలో అనేక లొసుగులూ, లెక్కకు మించి లోపాలు సైతం ఉంటున్నాయి. ఇక కొన్ని ప్రైవేటు వైద్య కళాశాల నుంచి వచ్చిన విద్యార్థుల నాలెడ్జ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. హాజరు పట్టికలోనే టీచింగ్ సిబ్బంది, సరియైన ట్రైనింగ్ చదువులు నేర్వకుండానే వారికి డిగ్రీలు ఇస్తున్నారు. ఆ కళాశాలల్లో చదివే విద్యార్థులకి ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్ కింద ఏడాదికి రూ.6000 కోట్లు కేటాయిస్తున్నారు. ఇక పేదల ఆరోగ్య సంజీవనీ ఆరోగ్యశ్రీ కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు కాసులు కురిపించేందుకే ఏర్పాటు చేశారనే తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఇది వాస్తవం కూడా.. దీని ద్వారా కొంత మంది సామాన్యులకు అత్యవసర వైద్య సేవలు అందుతున్న మాట వాస్తవమే. అయితే ఆ దిశగా పేద ప్రజలకు ఒరిగింది కొంత మాత్రమే.. అయితే ఈ పథకం కింద వేల కోట్లు ప్రభుత్వ సొమ్ము కార్పొరేట్ అధిపతుల ఖజానాలోకి వెళ్ళుతుంది. ప్రతీ సంవత్సరం ఆరోగ్యశ్రీ కింద రూ.600-700 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇలా అన్ని వేల కోట్ల రూపాయల నిధులను ప్రైవేటు కాలేజీలకు మళ్లించకుండా, ప్రభుత్వ వైద్య కళాశాలలను, బోధనాసుపత్రులను అభివృద్ధి చేస్తే అర్హులైన నిరుపేదలకు ఉచిత వైద్య విద్యతో పాటు, నాణ్యమైన అధునాతన వైద్య సేవలను అందుబాటులోకి తేవచ్చనేది మెజారిటీ వైద్య నిపుణుల ఆలోచనలు.

ఆరోగ్యశ్రీ డబ్బులతో..

ప్రభుత్వ వైద్యాన్ని ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందనిపిస్తుంది. ఒకరకంగా చెప్పా లంటే గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ చాలా వరకు దెబ్బతింది. గ్రామీణ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆసుపత్రులు చూస్తే మందులు, వసతుల లేమి, శిథిలావస్థకు చేరిన భవనాలు, పురాతన మంచాలు.. ఇలా ఆసుపత్రికే జబ్బు పట్టిన దుస్థితి కనిపిస్తుంది. అందుకే ప్రభుత్వం ఆరోగ్యశ్రీని కొనసాగిస్తూనే ప్రభుత్వ వైద్య రంగాన్ని పటిష్ట పర్చాలని, ఆ దిశగా పాలకులు చర్యలు తీసుకోవాలని అనేక మంది నిపుణులు సూచనలు చేశారు. ఆరోగ్యశ్రీ పేరుతో వెచ్చిస్తున్న వేల కోట్లతో జిల్లాకో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని, ప్రతి నియోజకవర్గం కేంద్రంలో ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వ ఆధీనంలో నడపొచ్చు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కొనసాగించాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న కూడా కొందరిలో ఉత్పన్నమవుతోంది. కనీసం గత ప్రభుత్వాలు చేసిన చారిత్రక తప్పిదాలను సరిదిద్ది, నీతి నిజాయితీ నమ్మకం విశ్వాసం కోల్పోతున్న వైద్య రంగానికి భారీ ఎత్తున శస్త్ర చికిత్సలు చేసి, పేద కుటుంబాలకు వైద్య సేవలు, వైద్య విద్య అవకాశాలు కల్పించే దిశగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్దాం.

డాక్టర్. బి.కేశవులు

ఎండి. సైకియాట్రీ.

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.

85010 61659

Next Story