వీర వనితల స్మరణ వేడుక

by Ravi |   (  Updated:2024-02-21 00:30:26  IST  )

medaram festival is a Commemoration of heroic womens

వీర వనితల స్మరణ వేడుక
X

సృష్టికి మూలం జీవం జీవనానికి మూలం వనం. మన జాతి కోసం పోరాడి వారి ప్రాణాలనే ఫణంగా పెట్టి ప్రజల యోగక్షేమాలే ఊపిరిగా బ్రతికి ప్రజల కోసమే ప్రాణాలు అర్పించిన మహనీయులను గౌరవించడం మన సంప్రదాయం. గిరిపుత్రుల నిష్కల్మషత్వానికి అసమాన పోరాట పటిమకు ప్రతిరూపం సమ్మక్క సారలమ్మ మేడారం జాతర.

అడవిలో దొరికిన బిడ్డను కొండదేవర ప్రసాదంగా భావించి కోయలు తీసుకొచ్చి పెంచారు. ఆ బిడ్డపేరే సమ్మక్క. యుక్త వయసు రాగానే పోలవాసా రాజ్యాన్ని (ఇప్పటి జగిత్యాల) పాలించే మేడరాజు మేనల్లుడు అయిన పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేశారు. వీరు మేడారాన్ని సామంతరాజ్యంగా పాలించసాగారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. వరుస కరువుల కారణంగా కాకతీయ రాజులకు కప్పం చెల్లించలేక పోయారు. ఆగ్రహించిన కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు మేడారంపై యుద్ధం ప్రకటించాడు. లక్షల్లో ఉన్న కాకతీయ సైన్యం దాటికి నిలువలేక కోయలు ప్రాణ త్యాగం చేశారు. ఆఖరి రక్తపు బొట్టు వరకు పోరాడి పగిడిద్దరాజు తుది శ్వాస విడిచాడు. దక్షిణ దిక్కు నుండి గోవిందరాజు పడమటిదిక్కు నుండి మేడరాజు మూకుమ్మడిగా దాడి చేసి రణంలో వీరమరణం పొందారు. జంపన్న సంపెంగ వాగులో వీరమరణం పొందాడు. తమ వారి మరణ వార్త విని సమ్మక్క సారలమ్మ కత్తి చేత బట్టి యుద్ధంలో దూకారు. ఆమె పోరాటం చూసి, యుద్ధ నియమాలను తుంగలో తొక్కి దొంగ దెబ్బ తీయమని సైన్యానికి ఆదేశాలు జారీ చేయడంతో సారలక్కను కత్తితో పొడిచారు ఆమె అక్కడిక్కడే మరణించింది. సారలమ్మను సైతం బల్లెంతో వెన్నుపోటు పొడిచారు. సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమిస్తూ ఈశాన్యం వైపున ఉన్న చిలకలగుట్ట వైపు వెళ్లి అదృశ్యమైంది. సమ్మక్కని వెతుక్కుంటూ వెళ్లిన కోయలకు ఒక పెద్ద నమిలినార చెట్టు కింద కుంకుమ భరిణ కనిపించింది. ఆ కుంకుమ భరణి సమ్మక్కకు గుర్తుగా భావించి ఆమె రాక కోసం గిరిజనులంతా ఎదురు చూశారు.

క్షమాపణ చెప్పిన కాకతీయ రుద్రుడు

యుద్ధం ముగిసింది. కాకతీయుల ఇలవేల్పు ఏకవీర దేవి ప్రతాపరుద్రునికి కలలో కనిపించి, మేడారంలో జరిగిన సమ్మక్క మరణానికి చింతించి కంటతడి పెట్టిందని నానుడి. ప్రతాపరుద్రుడు పశ్చాత్తాపంతో మేడారం వెళ్లి ప్రజలకు క్షమాపణ చెప్పి మేడారాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి అంటే సమ్మక్క అదృశ్యమైన రోజున ముత్తైదువులందరూ సమ్మక్క జాతర జరుపుకోవాలని ఆదేశించాడు. అప్పటినుండి కుంకుమ భరిణినే సమ్మక్కగా భావించి జాతర జరుపుకుంటున్నారు గిరి పుత్రులు. నాలుగు రోజుల పాటు ఈ జాతర ఎంతో వైభవంగా, కోలాహలంగా జరుగుతుంది. కాకతీయ రాచరికపు అహంకారాన్ని ఎదిరించి తమను నమ్మిన ప్రజల కోసం జాతి మనుగడ కోసం రణం చేసి వీర మరణం పొందిన వీరనారుల చరిత్ర ఇది. ప్రాణ త్యాగం చేసిన ఆడపడుచులను మాతృ మూర్తులుగా భావించి భక్తజన కోటి ఆరాధించే పండుగ అరుదైన జాతర మేడారం.

కొమ్మాల సంధ్య

తెలుగు ఉపన్యాసకులు

91540 68272

Next Story