- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడే- కిరీటాలకు అతీతమైన కథ
శ్రమ చరిత్ర నుంచి ఆధునిక గిగ్ ఎకానమీ, ఏఐ యుగం వరకు మే డే ప్రాధాన్యతపై విశ్లేషణ. కార్మిక హక్కుల పోరాటం, హే మార్కెట్ ఉద్యమం, ఆధునిక శ్రామిక సవాళ్లు, భవిష్యత్ పనితీరుపై సమగ్ర చర్చ.

చరిత్రను కిరీటాల కాంతిలో కాదు, చెమట చుక్కల వెలుగులో చదివితేనే దాని అసలు అర్థం బయలుపడుతుంది. రాజ్యాల ఉత్థాన పతనాలకంటే, సాధారణ మనిషి చేసిన నిరంతర శ్రమే ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించింది.
రాయి నుండి యంత్రం వరకు, యంత్రం నుండి అల్గారితమ్ వరకు సాగిన ఈ ప్రయాణం మనిషి సృజనాత్మకత, పట్టుదల, గౌరవప్రదమైన జీవితం కోసం చేసిన పోరాటాల ప్రతిబింబం. ఆ శ్రమకు అంకితమైన జ్ఞాపకదినమే మేడే. ఇది కేవలం సెలవు దినం కాదు, మనిషి గౌరవానికి ప్రతిధ్వని. ఆదిమ మానవుడు రాయిని చెక్కి పనిముట్టుగా మార్చినప్పుడు అది రాయి కాదు, మనిషి మేధస్సు ఆ పదార్థానికి ప్రాణం పోసింది. నేటి సాఫ్ట్‌వేర్ కోడ్ కూడా ఆ సృజనాత్మక యజ్ఞానికి కొనసాగింపే.. శ్రమ లేని లోకం ఒక నిర్జీవ శిల. శ్రమే ఈ విశ్వాన్ని నడిపించే ప్రాణవాయువు, జీవన పరమార్థం.
ఇదే మేడే అసలు లక్ష్యం!
1886 మే 1న చికాగో హే మార్కెట్ చౌరస్తాలో రగిలిన నిప్పు కణికలు నేటికీ ఆరలేదు.. ఎనిమిది గంటల పని దినం కోసం కార్మికులు చేసిన పోరాటం పని గంటల కోసం కాదు.. మనిషిగా జీవించే హక్కు కోసం. 16 గంటల అమానవీయ చాకిరీలో నలిగిపోయిన జీవితాల నుండి ఆధునిక హక్కుల పోరాటం ఉద్భవించింది. ఉరికొయ్యను ముద్దాడుతూ అమరవీరుడు ఆగస్ట్ స్పైస్ అన్న మాటలు నేటికీ ప్రతిధ్వనిస్తున్నాయి.. ‘మేము మౌనంగా ఉన్నా, మా నిశ్శబ్దం ఒక రోజు మీరు అణచివేస్తున్న గొంతుల కంటే బలంగా వినబడుతుంది’. అల్బర్ట్ పార్సన్స్ “స్వేచ్ఛ గొంతును విననివ్వండి!” అని గర్జించాడు. వారు చిందించిన రక్తం నేడు మనం అనుభ విస్తున్న ఎనిమిది గంటల విశ్రాంతికి పునాది. శ్రీశ్రీ గారు ఎప్పుడో నిలదీశారు.. “ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.” బలవంతుడు బలహీనుడి కష్టాన్ని పిండుకోవడమే చరిత్ర అయింది. ఆ దోపిడీ రూపురేఖలను మార్చడమే మే డే అసలు లక్ష్యం. కార్ల్ మార్క్స్, ఏంగిల్స్ “ప్రపంచ కార్మికులారా, ఏకం కండి! మీరు కోల్పోయేది సంకెళ్లను మాత్రమే, సాధించుకోవాల్సింది ఒక ప్రపంచాన్ని” అని గర్జించారు. ఆ మాటలు ఇప్పుడు డిజిటల్ తెరల వెనుక, అల్గారితమ్‌లలో కూడా ప్రతిధ్వనించాలి.
నేటికీ దోపిడీ మారలేదు!
కాలం మారింది. ఇనుప చక్రాల హోరు నుండి సాఫ్ట్‌వేర్ కోడింగ్ నిశ్శబ్దం వరకు మనం ప్రయాణించాం. నేడు ‘ఆల్వేస్ ఆన్’ గిగ్ ఎకానమీ కొత్త రూపం సంతరించుకుంది. ఎక నామిక్ సర్వే 2025-26 ప్రకారం, భారతదేశంలో 2025 నాటికి సుమారు 1.2 కోట్ల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. ఇది యువతకు, మహిళలకు స్వయం ఉపాధి, అదనపు ఆదాయ మార్గాలు కల్పిస్తూ ఆర్థిక వ్యవస్థలో కొత్త వెలుగులు నింపుతోంది. అయితే ఈ ప్రకాశం వెనుక సవాళ్లు కూడా ఉన్నాయి.. దాదాపు 40 శాతం గిగ్ వర్కర్లు నెలకు 15 వేల లోపు సంపాదిస్తున్నారు. ఆదాయం అనిశ్చితం, ఉద్యోగ భద్రత లేదు. ఒకప్పుడు యజమాని గడియారం చూసి దోపిడీ చేసేవాడు, ఇప్పుడు అల్గారితమ్ ఆ పని చేస్తోంది. ‘డిజిటల్ బర్న్ అవుట్’ శ్రామికులను మానసికంగా కుంగదీస్తోంది.
శ్రమకు సమానమైనది లేదు..!
2026 నాటికి ఏఐ మన జీవితాల్లో విడదీయలేని భాగమైంది. యంత్రాలు వేగంగా ఆలోచించవచ్చు, డేటాను ప్రాసెస్ చేయవచ్చు. కానీ మనం ఏఐని శత్రువుగా కాకుండా, శ్రమను సులభతరం చేసే శక్తివంతమైన పనిముట్టుగా మలచు కోవాలి. ‘ఏఐ లిటరసీ’ని నైపుణ్యంగా అందిపుచ్చుకోవాలి. యంత్రాలు డేటాను మదించగలవు కానీ, శ్రమలోని నొప్పి, చెమట చుక్కలోని భావోద్వేగం, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కోడ్‌లోని సృజనాత్మకత ఇవి మనిషికే సాధ్యం. ఒక వస్తువును సృష్టించినప్పుడు కలిగే తృప్తి, ఎదుటి మనిషి అవసరాన్ని గుర్తించే సానుభూతి ఇవి యంత్రాలకు అందనివి. మాక్సిం గోర్కీ అన్నట్లు.. “ప్రపంచంలోని శ్రమజీవులందరూ ఒకే కుటుంబం. మా రక్తం వేరు కావచ్చు, కానీ మా ఆశలు ఒక్కటే.” సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయినా, డెలివరీ బాయ్ అయినా అందరం ఒకే శ్రమైక జీవన సౌందర్యంలో భాగస్వాములం. సాంకేతికత మనిషికి సాయపడాలి, మనిషిని బానిస చేయకూడదు. శ్రీశ్రీ అన్నట్లు, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు’ మనం ఈ యంత్ర నాగరికతలో పనిముట్లం కాదు – ఈ నవసమాజాన్ని నిర్మించే కళాకారులం. టెక్నాలజీ మనల్ని నడపకూడదు, మనమే టెక్నాలజీని నడపాలి. మేడే ఒక సెలవు రోజు కాదు.. అది మన ఆత్మగౌరవ జెండా. అల్గారితమ్‌లు మనల్ని నియంత్రించే లోకంలో మన శ్రమకు మనమే యజమానులవుదాం. సుత్తి నుండి ఏఐ వరకు, మానవ గౌరవం మాత్రం అపరివర్తనీయం. శ్రామిక జ్వాలల రణభేరి! మే డే సమర శంఖారావం! దోపిడీ సంకెళ్లు తెంచు – నవయుగ శ్రామిక వేదం! అందరికీ మే డే శుభాకాంక్షలు!
(మే డే సందర్భంగా)
-నంబూరి చంద్రశేఖర్
సామాజిక విశ్లేషకులు
93939 90399






