- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్వాడీ గో బ్యాక్.. ఎందుకీ ఉద్యమం? మార్వాడీల ఆధిపత్యం ఎలా కొనసాగిందంటే..
తెలంగాణలో 1995లో 100 శాతంగా ఉన్న వైశ్యుల వ్యాపారం 2005 నాటికి 65 శాతానికీ, 2015 నాటికి 35 శాతానికీ, 2024 నాటికి కేవలం

తెలంగాణలో 1995లో 100 శాతంగా ఉన్న వైశ్యుల వ్యాపారం 2005 నాటికి 65 శాతానికీ, 2015 నాటికి 35 శాతానికీ, 2024 నాటికి కేవలం 15 శాతానికి పడిపోయింది. ఈ లెక్కల బట్టే స్థానికుల వ్యాపారం దిగజారిపోయి మార్వాడీల వ్యాపారం ఎలా బలపడిందో అర్థమవుతుంది. దీనికి తోడు మార్వాడీలు ఉత్తరాది నుంచి పని వారిని తీసుకోవడంతో స్థానికుల ఉపాధి అవకాశాలు హరించుకుపోయాయి.
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ‘వైశ్య వ్యాపారులు’ అంటే ఆర్థిక భరోసా. కేవలం సరుకులు అమ్మే వాళ్లే కాదు, పల్లె ప్రజల ఆర్థిక భద్రతకు రక్షకులు. ఎవరైనా రైతు పంట విఫలమైతే, లేదా ఎవరికైనా అనారోగ్యం వస్తే, బ్యాంకులు కాకుండా ముందుగా పల్లె వ్యాపారి దగ్గరికి వెళ్లేవారు. వారు ‘తప్పనిసరిగా సహాయం చేస్తారు’ అన్న నమ్మకం ఉండేది. ఆ సహాయం కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, గోధుమలు అప్పుగా ఇవ్వడం, సీజన్ ముగిసాక చెల్లించమని చెప్పడం, అవసరమైతే వడ్డీ కూడా మాఫీ చేయడం. ఈ నమ్మకమే పల్లె ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారం. కానీ.. ఈ ఊపిరి ఇప్పుడు క్రమంగా ఆగిపోతోంది.
పల్లె గుండె చప్పుడు..
తెలంగాణలో పల్లె బజార్ అనేది కేవలం కొనుగోలు, అమ్మకాలకే పరిమితం కాదు, అది ఒక సమాజపు ఆర్థిక గుండె చప్పుడు. ఒకప్పుడు ప్రతి పల్లెలో ‘బజార్ రోజు’ అంటే పండుగ వాతావరణం. స్థానిక వైశ్యులు (బనియాలు) ప్రతి ఇంటికి సరుకులు అందించేవారు. ధన స్రవంతి పల్లె గుండా పారినట్లుగా, వ్యాపారం గ్రామం గుండెల్లో ప్రవహించేది. కానీ గడచిన రెండు దశాబ్దాల్లో ఈ దృశ్యం పూర్తిగా మారిపోయింది.
కుప్పగూలిన గ్రామీణ వ్యాపారం..
స్థానిక వ్యాపారులు తగ్గిపోవడం, మార్వాడీ వ్యాపారుల పెరుగుదల, ప్రభుత్వ నిర్లక్ష్యం, పెద్ద రీటైల్ చైన్లు, ఆన్‌లైన్ షాపింగ్, క్విక్-డెలివరీ యాప్స్ కూడా గ్రామీణ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇవన్నీ కలిసి పల్లెల ఆర్థిక శ్వాసను బిగించాయి. రైతు పంటను అమ్ముకోవడానికి, అవసరమైన ఎరువులు, విత్తనాలు కొనడానికి, రోజువారీ సరుకులు పొందడానికి, పల్లె వ్యాపారం తప్ప వేరే మార్గం ఉండదు. కానీ మార్వాడీల ప్రవేశం, రుణ పద్ధతుల మార్పు, బ్యాంకుల కఠిన నిబంధనలు, ఆధునిక రిటైల్ దుకాణాల పెరుగుదలతో గ్రామీణ వైశ్య వ్యాపార వ్యవస్థ నెమ్మదిగా కూలిపోయింది.
మార్వాడీ వ్యాపారుల ప్రవేశంతో..
1990ల తర్వాత, ముఖ్యంగా సరళీకరణ కాలంలో, గ్రామీణ మార్కెట్లలోకి మార్వాడీ వ్యాపారులు క్రమంగా ప్రవేశించారు. పట్టణాల్లో పెద్ద మోటారు వ్యాపారం చేసే వారు, మొదటగా పల్లె బజార్లలో గోదాములు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో వైశ్యులకు తక్కువ వడ్డీ రుణం లేదా క్రెడిట్‌లో సరుకులు ఇచ్చి స్నేహం పెంచుకున్నారు. కొన్నేళ్లలోనే సొంత దుకాణాలు ప్రారంభించారు. మార్వాడీ వ్యాపారులు సంఖ్యాపరంగా లాభం ఆధారంగా పనిచేశారు. పెద్ద మొత్తంలో సరుకులు తక్కువ ధరలకు కొనుగోలు, కస్టమర్‌ను ఆకర్షించే డిస్కౌంట్ ఆఫర్లు, ధరల యుద్ధం ద్వారా స్థానిక వైశ్యుల లాభం తగ్గించడం. ఫలితంగా స్థానిక వైశ్యుల మార్కెట్ షేర్ తగ్గిపోవడం, గ్రామంలో ఆర్థిక నిర్ణయాలు ‘బయటి వ్యక్తుల’ చేతుల్లోకి వెళ్లడం చకచకా జరిగిపోయాయి.
వైశ్యుల వ్యాపారాల తగ్గుదల..
ఒకప్పుడు గ్రామంలో వైశ్యుడే రైతుకు విత్తనం, ఎరువు, నిత్యావసరాలను సరఫరా చేసి, చెల్లింపులు పంట తర్వాతే తీసుకునేవాడు. కానీ వ్యాపారం తగ్గిపోవడంతో ఆయనకే రుణం అవసరమయ్యే పరిస్థితి వచ్చింది. బ్యాంకుల రుణాలపై కఠిన నిబంధనలు, భూమి పత్రాలపై ఆధారపడిన రుణ విధానం,మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ వల్ల స్థానిక వైశ్యులు అవసరమైన మూలధనాన్ని సమకూర్చుకోలేక పోయారు. ఇదే సమయంలో, బాహ్య రాష్ట్రాల నుండి వచ్చిన వ్యాపార వర్గాలు (ప్రత్యేకించి మార్వాడీలు) పెద్ద మూలధనంతో, తక్కువ లాభ మార్జిన్‌తో వస్తువులను అమ్మడం మొదలుపెట్టారు. అనధికార రుణదాతల వద్ద అధిక వడ్డీకి అప్పు తీసుకొని వ్యాపారం కొనసాగించేందుకు వైశ్యులు ప్రయత్నించగా, ఆ వడ్డీ భారం వారిని పూర్తిగా దెబ్బతీసింది.
పల్లె ఆర్థిక వ్యవస్థపై ప్రభావం!
స్థానిక వ్యాపారి వెనక్కి తగ్గితే, గ్రామంలో నిధుల ప్రవాహం (సర్కులేషన్) బలహీనమవుతుంది. వైశ్యుడు సంపాదించిన లాభం మళ్లీ పల్లెలోనే తిరుగుతుంది. రైతు నుంచి కూలీ వరకు అందరికీ లాభం చేకూరుతుంది. కానీ మార్వాడీ వ్యాపారి సంపాదనను గ్రామం వెలుపలకి తరలిస్తాడు. దీని ఫలితంగా పల్లె ఆర్థిక చక్రం నెమ్మదించింది, స్థానిక ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. రుణ భరోసా లేకపోవడం, వైశ్యులు లేకపోవడంతో రైతులు బ్యాంకుల వద్దకు వెళ్లాల్సి వచ్చింది, కానీ అక్కడ రుణాలు పొందడం కష్టం.
ఇలా చేస్తే బెటర్..
గ్రామీణ వైశ్యులు కేవలం వ్యాపారులు కాదు, వారు పల్లె ఆర్థిక శక్తి కేంద్రాలు, మార్వాడీల ఆధిపత్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆధునిక మార్కెట్ పోటీ, ఇవన్నీ కలిపి పల్లె వ్యాపారాన్ని కోలుకోలేనంతగా బలహీనపరిచాయి. ఈ పరిస్థితిని మార్చడం కోసం ప్రభుత్వం, గ్రామీణ సమాజం కలసి పని చేస్తేనే పాత ఉజ్వల దశ తిరిగి వస్తుంది. ఇందుకోసం ముందుగా ప్రభుత్వం చొరవ చూపాలి. అందుకు అనుగుణంగా గ్రామీణ వైశ్య సహకార బ్యాంకులు, వైశ్యులు కలసి రుణాలివ్వగలిగే విధంగా సహకార బ్యాంకులు ప్రారంభించాలి. సబ్సిడీతో రుణ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వ్యాపారులకు ప్రత్యేకంగా తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వాలి. మార్వాడీ-వైశ్య భాగస్వామ్య నమూనా పోటీ కాకుండా భాగస్వామ్యం ఏర్పరుచుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిందించినప్పుడే తెలంగాణకు మంచి ఆర్థిక భవిష్యత్తు ఉంటుందని ఆశిద్దాం.
డా. బి. కేశవులు. ఎండి
చైర్మన్ తెలంగాణ మేధావుల సంఘం
85010 61659






