మరోకోణం: రాజకీయాలు మామూలుగా లేవు... పక్కా బిజినెస్!!

by D.Markandeya |
మరోకోణం: రాజకీయాలు మామూలుగా లేవు... పక్కా బిజినెస్!!
X

కుంభకోణాలు, కేసులు, రాజకీయ వివాదాలతో రాష్ట్రం అట్టుడికిపోతున్నది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత సహా కేసీఆర్ కుటుంబానికి సన్నిహితులుగా ఉన్న పలువురి పాత్ర వుందనే ఆరోపణలతో సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. ఇప్పటికే గులాబీ బాస్‌కు సన్నిహిత మిత్రుడైన బోయినపల్లి హన్మంతరావు కుమారుడు అభిషేక్‌ను, ఇంకొందరిని ఈ కేసులో జైలుకు పంపగా, మరికొందరిని ఆ సంస్థలు విచారిస్తున్నాయి. కవితకు, ఎంపీ సంతోష్‌కు త్వరలోనే నోటీసులు ఇస్తారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతున్నది. ఇదే ఈడీ చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ కుటుంబం, ఎమ్మెల్సీ రమణతో పాటు పలువురు నేతల పాత్రపై దర్యాప్తు చేస్తున్నది.

మరోవైపు, ఆదాయపు పన్ను విభాగం (ఐటీ) అధికారులు గత రెండు మూడు నెలల నుంచి తెలంగాణపై తమ దాడులను కేంద్రీకరించారు. ఫినిక్స్, వాసవి, సాహితి వంటి రియల్ ఎస్టేట్ సంస్థలతో ప్రారంభించి మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ కంపెనీ శ్వేత సహా పలు గ్రానైట్స్ కంపెనీల కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు. గత వారం మంత్రి మల్లారెడ్డికి, ఆయన బంధువులకు చెందిన నివాసాలపై, విద్యాసంస్థలపై ఐటీ అధికారులు చేసిన దాడులు పెను సంచలనం సృష్టించాయి. సీబీఐ, ఈడీ, ఐటీ ఇవన్నీ కేంద్రం పరిధిలోవి కాగా, రాష్ట్ర పోలీసులు కూడా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన కుట్రను ఛేదించి తామేమీ తక్కువ కాదని నిరూపించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసి, బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బీఎల్ సంతోష్ తదితరుల పాత్రపై విచారిస్తున్నారు.

ఇపుడు ప్రజల భావన అదే

ఈ వరుస ఘటనలతో రాష్ట్ర ప్రజలలో ఒక సాధారణ భావన ఏర్పడింది. రాజకీయమంటే పక్కా వ్యాపారమని, కాంట్రాక్టులంటే కమీషన్లని, నేతలంటే అక్రమ, అవినీతి మార్గాలలో డబ్బులు సంపాదించేవాళ్లని, ఎన్నికలంటే నోట్లు పంచడమనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. మల్లారెడ్డి ఇంట్లో కోట్లాది రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారం దొరకడం, ఫామ్ హౌజ్ కేసులో ఒక్కో ఎమ్మెల్యేకు 50 కోట్ల రూపాయల ఆశ చూపడం, పేకాట క్లబ్బులలో, లిక్కర్ వ్యాపారం(liquor scam)లో కోట్లాది రూపాయల చేతులు మారడం, రియల్ ఎస్టేట్, గ్రానైట్ తదితర కంపెనీలలో భారీగా అక్రమాలు బయటపడడం, ఈ అన్ని వ్యవహారాలలో రాష్ట్రానికి చెందిన ప్రధాన పార్టీలలోని ప్రముఖుల పాత్ర ఉందని ఆరోపణలు రావడం ఇందుకు కారణం.

మంత్రులలో, మాజీ మంత్రులలో, ఎమ్మెల్యేలలో, ఎమ్మెల్సీలలో చాలా మందికి మైనింగ్, రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్, మీడియా, విద్య, వైద్య రంగాలలో వ్యాపారాలుండడం ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అంతెందుకు, సర్పంచుగానో, ఎంపీటీసీగానో, జడ్పీటీసీగానో ఎన్నిక కాకముందు సాధారణ జీవితం గడిపే ఒక గల్లీ లీడరు ఒక్కమారు పదవి చేపడితే చాలు కాంట్రాక్టరుగానో, వ్యాపారవేత్తగానో అవతారమెత్తడం, కార్లలో తిరగడం వాళ్లు నిత్యం చూస్తూనే వున్నారు.

Also read: లౌకికవాదుల డైలమా!?

పోటాపోటీగా పంపకాలు

ఇటీవలే ముగిసిన మునుగోడు ఉపఎన్నికలో ప్రత్యర్థులిద్దరూ పోటీపడి ఓటర్లకు మూడు నుంచి ఐదు వేల రూపాయల పంచడం, గత సంవత్సరం జరిగిన హుజూరాబాద్ బైఎలక్షన్‌లో అధికార పార్టీ ఓటుకు ఆరు వేల రూపాయల ఇవ్వడం ప్రజలింకా మరిచిపోలేదు. కొన్ని గ్రామాలలో డబ్బులు పంచి మరికొన్ని గ్రామాలలో పంచకపోవడం, కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోవడంపై పలుచోట్ల ధర్నాలు, ఆందోళనలు జరిగాయి. ఉపఎన్నిక తప్పదన్న టైం నుంచి పోలింగ్ జరిగే వరకూ ఈ రెండు నియోజకవర్గాలలో మద్యం ఏరులై పారింది. విందులు సర్వ సాధారణమయ్యాయి. సభలకు, ప్రచారానికి వెళ్లిన వారికి ఐదు వందలో, వేయో ఇచ్చారు. బిర్యానీ పాకెట్లు పంచారు. ఇటీవలి కాలంలో సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో కూడా అభ్యర్థులు లక్షలు, కోట్లలో ఖర్చు పెడుతుండడం, నోట్లు పంచుతుండడం కూడా ప్రజలు గమనిస్తూనే వున్నారు.

ఇవే కారణాలు

ఆయా పార్టీల అగ్రనేతలు తమ ప్రత్యర్థులపై తరచూ చేసే ఆరోపణలు కూడా ప్రజలలో ఈ అభిప్రాయం పెరగడానికి దోహదపడుతున్నాయి. కాళేశ్వరం తదితర ప్రాజెక్టులలో వేలాది కోట్ల రూపాయల కమీషన్లను కేసీఆర్ కుటుంబం దండుకుందని రేవంత్‌రెడ్డి ఎన్నోమార్లు ఆరోపించారు. ఎప్పటికైనా సీఎంను జైలుకు పంపుతామని, తమ వద్ద ఆయన అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని బండి సంజయ్ పదే పదే సవాలు విసిరారు. ఓటుకు నోటు కేసులో కోటి రూపాయలతో రేవంత్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం, ఫామ్ హౌజ్ ఆపరేషన్‌లో ఒక్కొక్కరికి రూ. 50 కోట్ల ఆఫర్ ఇవ్వజూపడం, మల్లారెడ్డి ఇంటిలో నోట్ల కట్టలు దొరకడం ఇవన్నీ కూడా కారణమే.

లెక్కలేనన్ని ఘటనలు

నెహ్రూ పాలన పంచవర్ష ప్రణాళికలకు, ఇందిరాగాంధీ జమానా ఎమర్జెన్సీకి ఫేమస్ అయితే, ఆ తర్వాత వచ్చిన వరస కేంద్ర ప్రభుత్వాలు అవినీతి కుంభకోణాలకు పేరుగాంచాయి. రాజీవ్ కాలంలో బోఫోర్స్, పీవీ పాలనలో జార్ఖండ్ ఎంపీలకు ముడుపులు, మన్మోహన్ యూపీఏ కాలంలో 2జీ స్పెక్ట్రం, ఇలా చెప్పుకుంటూ వెళితే లెక్కకు మించిన స్కాంలు జరిగాయి. లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనం అవినీతిపరుల జేబులకు వెళ్లింది. రాష్ట్రాలలో కూడా ఇలాంటి ఘటనలకు కొదవేం లేదు.

మంచం కింద నోట్ల కట్టలు, విలువైన వజ్రాలు, బంగారు నగలు, ఖరీదైన పట్టు చీరలు దొరికి జైలుపాలైన తమిళనాడు దివంగత నేత జయలలిత ఆ తర్వాత మళ్లీ గెలిచి సీఎం అయ్యారు. బిహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ యాదవ్, హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంగా ఉన్న సుఖ్‌రాంపై అవినీతి ఆరోపణలు కోర్టులో నిరూపితమై జైలుకు సైతం వెళ్లారు. అక్రమాస్తుల వ్యవహారంలో మన పొరుగు రాష్ట్ర సీఎం జగన్ కూడా 16 నెలల పాటు ఊచలు లెక్కబెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఘటనలు ఉన్నాయి.

Also read: అది జరిగితేనే ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు!

ఎన్నికలంటేనే ఖర్చు

ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే మనం ఒక విషయాన్ని సూటిగా చెప్పవచ్చు. నేడు రాజకీయాలు పక్కా బిజినెస్‌గా మారిపోయాయి. ఆయా పార్టీల టిక్కెట్ పొందడానికి, ఎన్నికలలో గెలవడానికి, గెలిచిన తర్వాత పై పదవులు పొందడానికి ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టడానికి అభ్యర్థులు వెనకాడడం లేదు. అధికారంలోకి రావడానికి ఎన్ని ఉచిత హామీలివ్వడానికైనా, ఎన్ని వేల కోట్లు ఖర్చు చేయడానికైనా పార్టీలు తెగిస్తున్నాయి. ముందు ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే, ఆ తర్వాత అంత ఎక్కువ సంపాదించవచ్చుననే పరిస్థితి ఉంది. లాభాలెక్కడ ఎక్కువుంటాయో పెట్టుబడి అక్కడికి తరలిపోతుందని కారల్ మార్క్స్ చెప్పినట్లుగానే ఎన్నికల వ్యవహారం కొనసాగుతోంది. వ్యాపారులు నేతలవుతున్నారు. నేతలు బిజినెస్ చేస్తున్నారు. ఈ రెండు రంగాలూ అన్యోన్యంగా కలిసి కాపురం చేస్తున్నాయి.

చుక్కా, ముక్కా, రూకా

ఉపఎన్నికలలో గెలుపు ఎక్కువ రాజకీయ ప్రయోజనాలను చేకూరుస్తుంది కనుకనే పార్టీలు అక్కడ వందలాది కోట్ల రూపాయల కుమ్మరిస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలలో సైతం రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలలో మందు, విందుతో పాటు ఓటుకు వందో రెండు వందలో ఇచ్చారు. గెలుపు ప్రతిష్టాత్మకమనుకున్న చోట అంతకంటే ఎక్కువే ఇచ్చారు. ఒక్క రిజర్వుడ్ స్థానాలలో మాత్రమే ఓటుకు నోటు దందా నడవలేదు. హుజూరాబాద్, మునుగోడు తర్వాత ఈసారి (2023) ఎన్నికలలో ఓటు విలువ బాగా పెరుగుతుందనే అంచనా విశ్లేషకులలో ఉంది.

మరోవైపు, ఓటర్ల ఆశలు కూడా బాగా పెరిగిపోయాయి. తక్కువ ఇచ్చిన చోట ఇంకా ఎక్కువ ఎందుకివ్వరు? కనీసం పదివేలైనా ఇవ్వండి.. అని డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. తాము ఓటేసి గెలిపించిన అభ్యర్థులు ఆ పైన భారీగా దండుకుంటున్నప్పుడు తాము ఓటుకు నోటు డిమాండ్ చేయడంలో తప్పేముందన్నది వారి లాజిక్.

పాలిటిక్స్ ఇప్పుడు పక్కా బిజినెస్.. సో.. అభ్యర్థులారా.. పెట్టుబడి సిద్ధం చేసుకోండి!

డి. మార్కండేయ

[email protected]

Next Story