మరోకోణం: అంబానీ..అదానీ.. మధ్యలో ప్రధాని!

by D.Markandeya |
Is PM Behind the Growth Of Ambani, Adani
X

Is PM Behind the Growth Of Ambani, Adani

ప్రపంచ ఐశ్వర్యవంతుల టాప్ టెన్‌లో ఉన్న అంబానీ, అదానీ పేర్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారుండరు. టీవీలు, పేపర్లు, వెబ్‌సైట్‌లలో వార్తలు చూసే ప్రతి ఒక్కరికీ ఈ ఇద్దరు చిరపరిచితులు అయ్యారు. ప్రధాని మోడీ గుజరాతీ షావుకార్లకు సేల్స్‌మన్‌గా మారిపోయారని సీఎం కేసీఆర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో వీరిపై చర్చ జోరందుకుంది. తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీకి చెందిన ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ ఆక్షన్‌లో అదానీ కంపెనీ ఎల్-1 గా నిలవడం వివాదాస్పదమైంది.

పొరుగు రాష్ట్రం ఏపీలోనూ క్రిష్ణా-గోదావరి బేసిన్‌లోని చమురు, సహజవాయువు నిక్షేపాల‌పైన అంబానీకి చెందిన రిలయెన్స్ కంపెనీ లక్షలాది కోట్ల పెట్టుబడులు పెట్టింది. మొదట వైఎస్, చంద్రబాబుతో, ఇప్పుడు జగన్‌రెడ్డితో ఆ కంపెనీ అధినేత ముఖేశ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. రిలయెన్స్ డైరెక్టర్లలో ఒకరైన పరిమళ్ నత్వానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపారు. అదానీతోనూ జగన్‌కు సత్సంబంధాలే ఉన్నాయి. క్రిష్ణపట్నం రేవును వంద శాతం చేజిక్కించుకున్న అదానీ గ్రీన్ ఎనర్జీ ఇటీవలే దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశం సందర్భంగా ఏపీలో రూ. 60 వేల కోట్లతో 3700 మెగావాట్ల హైడ్రో, 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను నెలకొల్పడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అదానీని లేదంటే ఆయన సతీమణి ప్రీతిని రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపనున్నారనే వార్తలూ ఇటీవల గుప్పుమన్నాయి.

ఇంతకీ ఎవరు వీరు?

అసలు ఎవరీ అంబానీ, అదానీ? మోడీతో, వివిధ పార్టీలతో వాళ్లకున్న సంబంధాలేమిటి? అతి తక్కువ సమయంలోనే ప్రపంచ టాప్ టెన్ బిలియనీర్లుగా ఎలా ఎదిగారు? కేంద్రంలో, వివిధ రాష్ట్రాలలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వీరికే పెద్దపీట వేయడానికి కారణాలేమిటి? వంటి అంశాలను పరిశీలిస్తే అనేక ఆసక్తికర నిజాలు బయటపడతాయి.

అలా అడుగులు వేసి

అంబానీలకు చెందిన రిలయెన్స్ కంపెనీని ముఖేశ్ తండ్రి ధీరూభాయ్ రిలయెన్స్ కమర్షియల్ కార్పొరేషన్‌గా 1966లో స్థాపించారు. అప్పటివరకూ యెమెన్‌లో చిన్నపాటి వ్యాపారం చేస్తూ బతికిన ఆయన 1958లో ముంబయి వచ్చి కొంతకాలం పాలిస్టర్ దారం, మసాలా పదార్థాల ఎగుమతి-దిగుమతి వ్యాపారం చేశారు. అప్పుడు వారి కుటుంబం ముంబైలోని భూలేశ్వర్‌లో ఓ డబుల్ బెడ్రూం అపార్ట్‌ మెంట్‌లో నివసించేది. ఆఫీసు కూడా కేవలం 350 చ. అ. విస్తీర్ణంలో ఒక టేబుల్, మూడు కుర్చీలు, ఒక టెలిఫోన్‌, ఇద్దరు ఉద్యోగులతో పనిచేసేది. 1973లో రిలయెన్స్ ఇండస్ట్రీస్‌గా పేరు మార్చుకున్న తర్వాత 'ఓన్లీ విమల్' టెక్స్‌‌టైల్ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ బ్రాండ్ అప్పట్లో బాగా ఫేమస్ అయింది.

ఇంతింతై వటుడింతై

అంబానీల అదృష్టరేఖ 1980లో అమాంతం ఎగబాకింది. అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం పాలిస్టర్ దారం తయారీ రంగాన్ని ప్రైవేటీకరించింది. టాటా, బిర్లా వంటి బడా పారిశ్రామిక సంస్థలనేకం లైసెన్స్ కొరకు అప్లై చేయగా, 'పెద్దల' సహకారంతో అది రిలయెన్స్ కే దక్కింది. ఇక అప్పటినుంచి వెనక్కి చూసిందే లేదు. కేంద్రంలో, వివిధ రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల లోపాయికారీ వత్తాసుతో కంపెనీ సామ్రాజ్య విస్తరణ అతివేగంగా జరిగింది. పీవీ హయాంలోనూ, ఆ తర్వాత మన్మోహన్-చిదంబరం ప్రైవేటీకరణ విధానాలతోనూ ఎక్కువగా లాభపడింది రిలయెన్స్ సంస్థే కావడం గమనార్హం.

జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోలియం రిఫైనరీ స్థాపన, కేజీ బేసిన్‌లో గ్యాస్ నిక్షేపాల వెలికితీత, విద్యుదుత్పత్తి, రేవులు, టెలికాం తదితర రంగాలలోకి ప్రవేశం వేగంగా జరిగింది. రిలయెన్స్ జియోతో 4జీ స్పెక్ట్రంలోకి, రిలయెన్స్ ఫ్రెష్‌తో రిటైల్ రంగంలోకి 'ఇందుగలదందు లేదని సందేహము వలద'న్న రీతిలో విస్తరించింది. 2014లో మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రిలయెన్స్ ప్రభ ఏమాత్రం తగ్గలేదు. కాంగ్రెస్‌కు మించిన సపోర్టును బీజేపీ అందిస్తున్నదని రాజకీయవర్గాలలో టాక్ ఉంది.

సాన్నిహిత్యం పెంచుకుని

అదానీ ప్రస్థానం మరోలా ఉంది. బీజేపీ ప్రభుత్వాల కనుసన్నలలోనే ఆయన బడా పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ముఖేశ్ అంబానీ కంటే ఐదేళ్లు చిన్నవాడైన ఆయన పదహారేళ్ల వయస్సులోనే ముంబయికి వచ్చి ఓ డైమండ్ షాపులో ఉద్యోగిగా చేరారు. మూడేళ్ల తర్వాత తిరిగి అహ్మదాబాద్ వెళ్లి సోదరుడి ప్లాస్టిక్ పరిశ్రమలో పనిచేశారు. 1985లో విదేశాల నుంచి పాలిమర్స్ దిగుమతి చేసుకుని చిన్న కంపెనీలకు సరఫరా చేసే వ్యాపారాన్ని సొంతంగా ప్రారంభించారు. 1988లో అదానీ ఎక్స్‌పోర్ట్స్ పేరిట దీనిని హోల్డింగ్ కంపెనీగా మార్చారు. ఇదే ఆ తర్వాత అదానీ గ్రూపునకు మాతృకంపెనీ 'అదానీ ఎంటర్‌ప్రైజెస్'గా మారింది.

1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణలు అదానీకి ఊతమిచ్చాయి. 1995లో బీజేపీ గుజరాత్‌లో మొదటిసారి అధికారం చేపట్టింది. సీఎం కేశూభాయ్ పటేల్‌తో అదానీ సన్నిహిత సంబంధాలు కలిగివుండి ముంద్రా రేవు సహా పలు కాంట్రాక్టులు పొందారు. అభివృద్ధికి ఊతం పేరుతో నామమాత్రపు ధరకు వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల కేటాయింపు జరిగింది. టెక్స్‌టైల్, పవర్, అగ్రి ప్రొడక్ట్స్ తదితర రంగాలలోకి కంపెనీ విస్తరించింది.

కలిసి వచ్చిన కాలం

2001లో ప్రస్తుత ప్రధాని మోడీ గుజరాత్‌కు సీఎం అయ్యారు. 2002లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట మతకల్లోలం చెలరేగింది. ముఖ్యంగా గోద్రా అల్లర్లలో వేలాది మంది హిందూ-ముస్లింలు ఊచకోతకు గురయ్యారు. పెట్టుబడిదారులు గుజరాత్ వైపు కన్నెత్తి చూడడానికే భయపడ్డారు. అలాంటి క్లిష్ట సమయంలో మోడీకి తోడుగా నిలిచారు అదానీ. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన సమావేశంలో బడా వ్యాపారవేత్తలు మోడీని ఈ విషయంలో నిలదీస్తుండగా అదానీ ఎంటరయ్యారు.

మోడీ విధానాలను అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ప్రసిద్ధి చెందిన 'వైబ్రాంట్ గుజరాత్' నినాదం ఈ సమావేశం తర్వాతే ఊపిరి పోసుకుంది. ఇక అప్పటి నుంచి మోడీ-అదానీ మధ్య స్నేహ సంబంధాలు రోజురోజుకీ బలోపేతమవుతూ వచ్చాయి. 2002-14 మధ్య అదానీ గ్రూప్ గుజరాత్‌ను డామినేట్ చేస్తే, 2014లో మోడీ ప్రధాని అయిన తర్వాత దేశమంతటికీ, ఖండాంతరాలకూ విస్తరించింది. వరల్డ్ టాప్ టెన్ ఐశ్వర్యవంతులలో అంబానీని, బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టి నంబర్ 4 స్థానాన్ని అందుకున్నారు.

నాడు వారు, నేడు వీరు

వలస పాలనలో బ్రిటన్‌కు చెందిన బడా కంపెనీలు భారత ఆర్థిక వ్యవస్థను ఆక్రమించగా, 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జాతీయ పెట్టుబడిదారులైన టాటాలు, బిర్లాలు, థాపర్‌లు, దాల్మియాలు బలపడుతూ వచ్చారు. నిజానికి అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా అండగా నిలిచింది ఈ కుటుంబాల కంపెనీలే. అందుకు తగ్గట్టుగానే అప్పటి ప్రధాని నెహ్రూ తన పారిశ్రామిక విధానంలో వీరికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఇందిర హయాంలోనూ వీరికి అదే ప్రోత్సాహం దొరకగా, చివరి రోజులలో ఆమె అంబానీ వైపు మొగ్గారు.

పోటాపోటీగా రేస్

మిగతా కంపెనీలన్నీ ప్రస్తుతం రెండవ శ్రేణిలో నిలవగా, కేవలం అంబానీ, అదానీలే పోటాపోటీగా దూసుకుపోతున్నారు. కొవిడ్ కాలంలో అంబానీ ఆస్తులు భారీగా పెరగగా, పోస్ట్-కొవిడ్‌లో అదానీ విన్నర్‌గా నిలిచారు. ఇటీవలికాలంలో మోడీ-అంబానీ మధ్య సంబంధాలు క్షీణించాయని, అందుకే అదానీ పైనే కేంద్రం అవ్యాజ ప్రేమ చూపిస్తున్నదని మీడియాలో వార్తలు వచ్చాయి. మరోవైపు, తన మిథ్యా ఆదర్శవాదం మూలంగా యువనేత రాహుల్‌గాంధీ కార్పొరేట్లను దగ్గరకు రానివ్వడం లేదని, తద్వారా కాంగ్రెస్ పార్టీకి వారి నుంచి విరాళాలు తగ్గాయని సమాచారం.

అందరిదీ అదే దారి

బ్రిటిషర్లు వెళ్లిన నాటి నుంచీ మన దేశంలో రాజకీయ పార్టీలు, కార్పొరేట్ కంపెనీల మధ్య ఇచ్చుకో.. పుచ్చుకో.. (క్విడ్ ప్రో క్వో) సంబంధాలు కొనసాగుతూనే వున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, జనతా, జనతాదళ్, చివరకు కమ్యూనిస్టు, ప్రాంతీయ పార్టీలు సైతం ఇందుకు మినహాయింపుగా లేవని చెప్పవచ్చు. అధికారికంగా పార్టీ ఫండ్, అనధికారికంగా కమీషన్లు ఇచ్చిన కంపెనీలకే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. నామమాత్రపు రేటుకు భూములు, మౌలిక సదుపాయాలు, సరళతరంగా లైసెన్సింగ్, పక్షపాత పూరితంగా టెండర్ల కేటాయింపులు చేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఈ అక్రమాలపై గొంతు చించుకోవడం, తాము అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని మర్చిపోయి అదే విధానాన్ని అనుసరించడం సాధారణమైపోయింది.

ఓటర్లు మారాలి

ఈ అస్తవ్యస్త పరిస్థితి మారాలంటే ఓటర్లు చైతన్యవంతులు కావాలి. నోటుకు ఓటుగా నడుస్తున్న ఎన్నికల వ్యవస్థను సమూలంగా మార్చేలా, నయా పైసా ఖర్చు లేకుండా పార్టీలు, అభ్యర్థులు తమ జెండాలను, అజెండాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేలా చట్టాలు చేసేలా ఒత్తిడి తేవాలి. అప్పటి వరకూ అంబానీ-అదానీ లాంటి బిలియనీర్లు, మెఘా, మై హోమ్ వంటి కాంట్రాక్టర్లు దేశ, రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారనడంలో సందేహం లేదు.


డి. మార్కండేయ

[email protected]com


మరిన్ని ఆసక్తికర మరోకోణం విశ్లేషణల కోసం క్లిక్ చేయండి

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed