మావోయిస్టులు.. పంథా మారితేనే మంచిది!

by Ravi |   (  Updated:2025-05-15 01:16:20  IST  )

పిట్టల్లా రాలిపోతున్నారు.. మరో ప్రపంచం సాధించాలని పోరుబాట పట్టిన అప్పటి లేబ్రాయపు కార్యశూరులు.. తర్వాత కాలంలో

మావోయిస్టులు.. పంథా మారితేనే మంచిది!
X

పిట్టల్లా రాలిపోతున్నారు.. మరో ప్రపంచం సాధించాలని పోరుబాట పట్టిన అప్పటి లేబ్రాయపు కార్యశూరులు.. తర్వాత కాలంలో ఆ దారే ఎన్నుకున్నవారు. మనకేం, "ఊగరా, ఊగరా, ఊగరా! ఉయ్యాలలాగ బాగా ఊగరా!" అని ఇంట్లో కూర్చునే కీర్తించగలం. ఇంకొంచెం ధైర్యం ఉంటే ప్రకటనలు విడుదల చేయగలం. సాహసిస్తే, నిరసన సభలు నిర్వహించగలం. నేనూ ఆ తానులో ముక్కనే..

"అసలు ఇన్నేళ్లుగా ఎందుకిలా జరుగుతోంది? ఇలా జరగకుండా ఉండే వీలుండేదా?" అంటే, నా సమాధానం ఔననే. ఆర్థిక, సామాజిక మార్పులకు రాజ్యాంగ బద్ధమైన మార్గాలన్నీ మూసుకుపోవడానికి కారణం, ఆ తోవలంట నడిచే జన సముదాయం లేకపోవడమే. అణగారుతున్న కార్మిక, కర్షక, శ్రమ జీవులకు సరైన నాయకత్వం లేకపోవడమే. కార్మిక సంఘాల ప్రథమ ప్రాధాన్యం రాజకీయ ప్రయోజనాలు కావడమే. ఇందుకు ఒకే ఒక్క మినహాయింపు. అదే భావజాలం గల కార్మిక నాయకత్వం. వారి సభ్యత్వం, ప్రభావం స్వల్పం.

అన్నలు వాకబు చేసినప్పుడు..

1980లలో కేంద్ర కార్మిక విద్యాధికారిగా రాజమహేంద్ర వరంలో పనిచేసేవాడిని. ఉద్యోగ విధులలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలలో గ్రామీణ కార్మికులకు ఐదు రోజుల కార్మిక విద్యా కార్యక్రమాలు నిర్వహించేవాడిని. మా విద్యాసంస్థ పొరుగు సేవల ఉద్యోగులు నిర్వహించే రెండు రోజుల కార్య క్రమాలను పర్యవేక్షించే వాడిని. ఆ కార్యక్రమాలలో ప్రధానంగా వ్యవసాయ కార్మికులు సంఘాలుగా ఏర్పడవలసిన అవ సరాన్ని, వాటి నిర్మాణాన్ని, విధులని, నమోదు ప్రక్రియను వివరించడం, వెట్టిచాకిరి నిర్మూలన, స్త్రీ పురుష కార్మికులకు సమాన వేతనాల చెల్లింపు, భూపరిమితి చట్టం ప్రయోజనాలు బోధించేవాళ్లం. అలా ఒక ఐదు రోజుల గ్రామీణ కార్మిక విద్యా కార్యక్రమం బుట్టాయిగూడెం సమితి కార్యాలయంలో నిర్వహిస్తున్నాను. ఆ కార్యక్రమానికి హాజరవుతున్న గిరిజనులు కొందరు రెండోరోజున " మీరు ప్రభుత్వ అధికారేనా"? అని అన్నలు అడగమన్నారు" అని చెప్పారు. ముందు అలా అడగమన్నవారు క్రైస్తవ మిషనరీలేమో అనుకున్నాను.

కలవాలన్నా ధైర్యం చేయలేకపోయా..

ఆ రాత్రి భోజనానికి అక్కడున్న ఒకే ఒక హోటల్‌కి వెళ్తే, ఆ మట్టి గోడల మీద "తునికాకు సేకరణకు ఇచ్చే మొత్తం (ఎంతో గుర్తులేదు) పెంచాలన్న ఎర్రటి అక్షరాలు కనబడ్డాయి. మరుసటి రోజు కార్యక్రమంలో "అన్నలంటే.." అని అడిగాను. సూటిగా జవాబు చెప్పకుండా, "మీరు అనుకుంటున్నవారే" అన్నారు. అంతటితో ఊరుకోకుండా, "వారిని కలవవచ్చా" అని అడిగితే, కనుక్కొని చెప్తామన్నారు. నాలుగో నాడు "రావచ్చన్నారు" అనే కబురు తెచ్చారు. ధైర్యం చేయలేకపోయాను. మర్నాడు కార్యక్రమం ముగించుకుని, తోక ముడుచుకుని ఇంటిదారి పట్టాను.

యవ్వనం అడవులపాలై రక్తమోడుతోంది!

మన సామూహిక నిష్క్రియే అన్నలు ఆ బాట పట్టడానికి కారణమైంది. మనం నడవడానికి కూడా సిద్ధం కాకపోవడంతో వాళ్లు పరుగెత్తవలసి వచ్చింది. ఐతే, సాయుధ పోరాట ఉద్యమం పూర్తిగా విఫలమైందని భావించనక్కరలేదు. నేడు అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాలుగా ప్రభుత్వాలు సాగాలని గుర్తించడం, నాడు " గరీబీ హటావో" లాంటి రాజకీయ నినాదాలు తప్పనిసరి కావడం తత్ఫలితమే. అందు వల్లనే అమానుష అత్యవసర పరిస్థితి పాలన నాడే 20 సూత్రాల ఆర్థిక పథకం ప్రకటించడం. ఆ అందిన అవకాశాన్ని పౌర సమాజం వినియోగించుకుని ఉంటే, అందుకు పూనుకునే నాయకత్వం ఉండి ఉంటే... భూ సంస్కరణలు, వెట్టి చాకిరీ నిర్మూలన, మొదలైన సమాజాభ్యుదయ శాసనాలు యధాతధంగా అమలై ఉంటే యవ్వనం అడవుల పాలై రక్తం పారించడానికి, రక్తం ఓడడానికి విరామం ఉండేదేమో?

గుద్దుల బ్యాంక్ ఒకటే తెలుసు..

మా గ్రామీణ విద్యాకార్యక్రమాలలో సంక్షేమ పథకాల అమలు బాధ్యత ఉన్న అధికారులను అతిధి ఉపన్యాసకులుగా పిలిచేవాడిని. అలా ఒక కార్యక్రమంలో బ్యాంక్ అధికారొకరు మాట్లాడారు.. తర్వాత ఆ గిరిజనులను "మీకు బ్యాంక్ ఖాతా ఉందా?" అని అడిగితే, వారిలో ఒకరిచ్చిన సమాధానం నాకింకా జ్ఞాపకం ఉంది. అతని మాటల్లో రాయలేను.. కానీ, అతనన్నది "మాకు ఒక్కటే బ్యాంకు తెలుసు. అది గుద్దుల బ్యాంకు. సంత రోజున 100 రూపాయలు అప్పు తీసుకుంటే, అమ్మవారి పేరున 10 రూపాయలు మినహాయించి, 90 రూపాయలు చేతిలో పెడతారు. వారం తిరిగి, మళ్లీ సంత రోజు వచ్చినప్పుడు వడ్డీ 10 రూపాయలు కలుపుకుని 110 రూపాయలు ఇవ్వకపోతే వీపు వంచి పిడిగుద్దులు గుద్దుతారు." అని చెప్పారు.

పెట్రోల్ బంక్ దళితుడికే కానీ..

ఇంకోసారి మైదానం ప్రాంతంలోని దళితవాడలో రెండు రోజులు కార్యక్రమం జరుగుతోంది. పర్యవేక్షణకు వెళ్ళాను. నన్ను పరిచయం చేసిన తర్వాత, శిబిరంలో ఒకరు " మీ మాస్టారు మాతోపాటు పెట్రోల్ బంక్ యజమానిని కూడా చేర్చారు" అని నవ్వుతూ ఫిర్యాదు చేశారు. నేను ఇదేమిటన్నట్టు, ఆ గ్రామీణ విద్యాబోధకుడి వైపు చూశాను. అతను లోస్వరంతో తర్వాత "చెప్తానండి" అన్నారు. తర్వాత చెప్పినది విని అరుదుగా పత్రికలలో వచ్చే వార్తలు నిజమే అని తెలుసుకున్నాను. ఆ పెట్రోల్ బంకు వాస్తవ యజమాని ఆ గ్రామ సర్పంచి. దళిత వ్యవసాయ కార్మికుడి పేరిట ప్రభుత్వ చమురు సంస్థ పెట్రోల్ బంక్ కేటాయించేటట్టు ఆయన కథ నడిపారు. కాదంటే ఆ ఊరిలో మనుగడే వుండదట. ఆ అకృత్యానికి పై స్థాయి పెద్దలెవరో సహాయపడివుంటారు. అధికారులు కక్కుర్తి పడి ఉంటారు.

పంథా మారితేనే మంచిది!

కానీ, కాలక్రమంలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సంక్షేమ పెట్టుబడిదారీ వ్యవస్థగా మారక తప్పదని గ్రహించింది. కమ్యూనిజం కనుమరుగైంది. అత్యాధునిక శాస్త్ర సాంకేతిక రంగాల కారణంగా చెదురు మదురు సాయుధ పోరాటాలను నిర్దయగా అణచివేసే అవకాశం ఏర్పడింది. ఈ వాస్తవాలు గ్రహించి అన్నలు, అక్కలు తమ పంథా వీడి, సామాజిక న్యాయ సాధనకు శ్రామిక కార్మిక వర్గానికి నాయకత్వం వహించి, తొలి అడుగుగా ప్రభుత్వ శాసనాలు, పథకాలూ తూ.చా తప్పక అమలు చేయడం అనివార్యమయ్యే దిశగా మహాప్రస్థానం మొదలెట్టాలి.

- మల్లాప్రగడ రామారావు

99898 63398

Next Story