మౌన ముని… భారత ఆర్థిక సంస్కరణల శిల్పి

by Ravi |   (  Updated:2025-09-26 01:01:20  IST  )

భారతదేశ విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరు మన్మోహన్ సింగ్. ఎంతో నిరాండబర వ్యక్తిగా ఉండే ఆయన ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు

మౌన ముని… భారత ఆర్థిక సంస్కరణల శిల్పి
X

భారతదేశ విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరు మన్మోహన్ సింగ్. ఎంతో నిరాండబర వ్యక్తిగా ఉండే ఆయన ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో పనిచేసి దేశ ఆర్థిక విధానంపై ఎంతో బలమైన ముద్రవేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలతో రూపొందించి ప్రపంచ స్థాయిలో భారత్‌ను ప్రబల ఆర్థిక శక్తిగా నిలిపిన కాకలు తీరిన ఆర్థికవేత్త. భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి వరుసగా పదేళ్ల పాటు ప్రధానిగా కొనసాగిన మిశ్రమ అనుభూతులను మూటగట్టుకుని దేశ రాజకీయ రంగస్థలం నుంచి నిష్క్రమించారు.

ప్రస్తుత పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో జన్మించిన ఈయన పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత కేంబ్రిడ్జి నుంచి బ్యాచ్‌లర్స్‌ డిగ్రీ అందుకున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో డాక్టరేట్‌ పూర్తి చేశారు. పంజాబ్‌ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌ లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరిన ఆయన తర్వాత అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ అయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌‌లో ప్రొఫెసర్‌గా, జేఎన్‌యూలో హనరరీ ప్రొఫెసర్‌గా సేవలందించారు.

ఆర్థిక సలహాదారుడిగా చేరి..

భారత ప్రభుత్వంతో అప్పటి విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరి, 1980లో ప్రణాళికా సంఘం సభ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. రెండున్నరేళ్ల తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పనిచేసి ప్లానింగ్ కమిషన్‌కు తిరిగి వచ్చారు. ఈసారి దాని డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ విధంగా, సుమారు పదిహేనేళ్ల వ్యవధిలో, ఆయన భారతదేశంలో ఆర్థిక, అభివృద్ధి రంగాలలో గణనీయమైన అనుభవాన్ని పొందారు. జెనీవాలో కొత్తగా స్థాపించబడిన సౌత్ కమిషన్‌కు మొదటి సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించడంతో, ఈయన ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలను అన్వేషించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఈయన 1991లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. పార్లమెంటు ఎగువ సభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2004లో, డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలోని వివిధ రాజకీయ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ భారత ప్రధానమంత్రి అయ్యారు. ఆయన 2014 మే 26 వరకు పదవిలో కొనసాగారు.

ద్రవ్యోల్బణ రేటు తగ్గించి..

1973లో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వల్ల భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. భారతదేశం వంటి దేశంలో, 20% కంటే ఎక్కువ ఉన్న ద్రవ్యోల్బణం చాలా ఆమోదయోగ్యం కాదు. ద్రవ్యోల్బణ వ్యతిరేక విధానాన్ని రూపొందించాలని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కోరారు. ఈయన ఆదాయాలను పరిమితం చేసి ఓ డ్రాఫ్ట్‌‌ను రూపొందించారు. ఇది పాలసీ 1974 జూలై నుండి అమలులోకి వచ్చింది. 1974 సెప్టెంబర్ తర్వాత, విధానం సానుకూల ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. 1975 మార్చి నాటికి ద్రవ్యోల్బణం 5.7%కి తగ్గింది. RBI గవర్నర్‌గా ఉన్నప్పుడు డాలర్‌లకు అనుగుణంగా భారత రూపాయి మారకం విలువను కొనసాగించడంలో సహాయం చేశారు.

భారత్ ప్రపంచ దేశాలతో పోటీపడేలా..

1991లో, భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు, పివి నరసింహారావు ప్రభుత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ అప్పటి ఆర్థిక మంత్రి అయ్యారు. భారతదేశం స్థూల ఆర్థిక సమతుల్యతను, పేలవమైన ఉత్పాదకత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం రేట్లు లాంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో, మన్మోహన్ సింగ్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, సంస్కరించడానికి అనేక తీవ్రమైన చర్యలను ప్రారంభించారు. నాడు ఆర్థిక మంత్రిగా వామపక్షాల ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటూనే ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం మారినప్పటికీ సంస్కరణల ప్రక్రియ కొనసాగింది. ఇది రాబోయే సంవత్సరాల్లో చాలా విజయవంతమైంది. ఈయన రూపొందించిన విధానం అమలు తర్వాత, 1991 జూన్ నుండి 1993 జూన్ వరకు భారతదేశ విదేశీ మారక నిల్వలు 1 బిలియన్ తక్కువ నుండి 10 బిలియన్ డాలర్లకు పెరిగాయి. దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు పరిచి తన పదవీకాలంలో రికార్డు స్థాయిలో దాదాపు 8.5% జీడీపీని నమోదు చేశారు. భారత్‌ను ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తన సరళీకృత ఆర్ధిక విధానాలు రూపొందించిన నేత. పనితీరులో వేగం, స్పష్టతతో సేవలందించిన మౌనముని ఆయన.

(నేడు మన్మోహన్ సింగ్ జయంతి)

-వాడవల్లి శ్రీధర్ ,

99898 55445

Next Story