- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తన కాలు తాను నరుక్కుంటే.. ఆ పాపం ఎవరిది?
మొత్తం సమాజం తలదించుకోవలసిన ఘోరమైన ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పుర్‌లో జరిగింది. రెండు సార్లు నీట్ (Neet) ప్రవేశ పరీక్ష రాసి విఫలమైన ఒక విద్యార్థి, దివ్యాంగుల కోటాలో తేలికగా ఎంబీబీఎస్ సీటు పొందవచ్చని భావించి తీవ్ర చర్యకు దిగాడు. తన లక్ష్యం కోసం తన పాదాన్నే నరుక్కున్నాడు..

మొత్తం సమాజం తలదించుకోవలసిన ఘోరమైన ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పుర్‌లో జరిగింది. రెండు సార్లు నీట్ (Neet) ప్రవేశ పరీక్ష రాసి విఫలమైన ఒక విద్యార్థి, దివ్యాంగుల కోటాలో తేలికగా ఎంబీబీఎస్ సీటు పొందవచ్చని భావించి తీవ్ర చర్యకు దిగాడు. తన లక్ష్యం కోసం తన పాదాన్నే నరుక్కున్నాడు. తన ప్రయత్నం బెడిసి కొట్టడమే కాకుండా పోలీసు కేసు వచ్చి పడింది. వినగానే ఒళ్లు జలదరిస్తున్న ఈ వార్త సమాజం మొత్తాన్ని భయకంపితం చేస్తోంది.
కాల్పనిక గాథలు ఎన్నో చదువుకున్నాం. తామనుకున్న పని కాకపోవడంతో. లక్ష్యం నేరవెరకపోవడంతో తమ శరీరాన్ని హననం చేసుకుని ప్రాణాలు ధారపోయడానికి కూడా సిద్ధపడిన పురాణ గాథలెన్నింటినో చదువుకున్నాం. కానీ ఈ అబ్బాయి మెడికల్ సీటు రాదేమో అని భయపడి కాలు నరుక్కున్న వైనం ఏ దృష్టితో చూడాలి మనం. అతడు చేసింది నేరమేనా, అతడిని శిక్షించి ఒక గుణ పాఠం చెప్పాలా.. అలా శిక్షిస్తే తప్ప సమాజాన్ని సరైన దారిలో నడపడం సాధ్యం కాదా.. ప్రశ్నల మీద ప్రశ్నలు.
తాము కోరుకున్న విద్య చదువుకోవాలని, తమ లక్ష్య సాధనకోసం తామనుకున్న మార్గంలోనే కొనసాగాలని ప్రయత్నించి సాధ్యం కాక విఫలమై జీవితాంతం ఏదో ఒక పని, వృత్తిని ఎంచుకుని పనిచేస్తూ బతికేవారు మన దేశంలో లక్షలాది మంది ఉన్నారు. తమకు సాధ్యం కాని పని తమ బిడ్డల ద్వారా సాధింప చేసుకోవాలని ప్రయత్నించి పిల్లలకు తాము కోరుకున్న చదువు చెప్పించి సంతోషపడే వారు ఎందరో ఉన్నారు. తమ పిల్లలు సైతం తాము కోరుకున్న లక్ష్యాలను నెరవేర్చడం లేదని అర్థమైనప్పుడు హుతాశులైనవారు ఎందరో ఉన్నారు.
ఇష్టం లేని చదువులు
పిల్లలకు ఇష్టం లేని చదువుల కోసం కాలేజీల్లో చేర్పించి లక్షలు ఖర్చు పెట్టే తల్లితండ్రులను చూస్తున్నాం. పిల్లలకు ఇంటరెస్టు ఉన్న సబ్జెక్టులలో చేర్పించకుండా తమ ఇష్టాలను వారిమీద రుద్దినప్పుడు ఆ కోర్సు పూర్తి చేయలేక, ర్యాంకులు రాక, లెక్చరర్లు, ప్రొఫెసర్ల చేతిలో అవమానాలు భరించలేక గొంతు కోసుకుని, ఉరి వేసుకుని చనిపోతున్న పిల్లల వార్తలను అసంఖ్యాకంగా చూశాం ఇంతవరకు. మార్కులు సరిగా రాకున్నా లక్షలు పోసి సీట్లు కొనేవాళ్లు కొందరయితే, మార్కులు తక్కువ వచ్చినా కోటా కింద సులభంగా సీట్లు పొందేవారు కొందరు. అది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు కావచ్చు. కానీ అటు డబ్బులు లేక, ఇటు కోటా సౌకర్యం లేక తాము కోరుకున్న చదువులు చదవలేక నలిగిపోతున్నవారు, ఆశలు నిరాశలై ఏదో ఒక చిన్న కూలోడి పని, పెద్ద కూలోడి పని చేసుకుంటా ఆశలు చంపుకుని బతుకుతున్న వారు లక్షలమంది మన దేశంలో ఉన్నారు.
ఉన్నత విద్యలో సీట్ల కొరత, అవకాశాలు లేక, నచ్చిన చదువులు చదవలేక కుంగిపోతున్న వారికి మన దేశంలో ఎప్పటికీ పరిష్కారం దొరకదా అనిపిస్తుంది. ఎలాగైనా సరే మెడికల్ సీటు సాధించాలి అనే తపన, ఉద్వేగంతో కాలు నరుక్కునేంతవరకు తెగించిన ఈ కుర్రాడికి తాను కోరుకున్న చదువును చదువుకునే సౌకర్యాన్ని మన సమాజం, వ్యవస్థ కలిపించలేవా? విదేశాల్లో నచ్చిన చదువును చదువుకునే ఆవకాశాలు బోలెడున్నాయి. ఏదో ఒకటి చదువుకునే బలవంతపు విద్యలకు ఆ సమాజాలు ఆస్కారమివ్వవు.
మెడికల్ సీటు ఏమో కానీ కేసు మిగిలింది
ఉత్తర ప్రదేశ్ లోని జౌన్‌పుర్‌కి చెందిన 20 సంవత్సరాల సూరజ్ భాస్కర్ తీవ్రంగా గాయపడ్డాడని తొలివార్త. తనను గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసినప్పుడు పాదం తెగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని అతడు సోదరుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. 2026లో నేను డాక్టర్‌ని అవుతాను అని డైరీలో రాసి ఉంచుకోవడంపై దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు దివ్యాంగుల కోటాలో తేలికగా సీటు సాదించువచ్చనే ఆలోచనతో ఓ పాదాన్ని తానే తొలగించుకుని తనపై దాడి ఘటనలో పాదం తెగిపోయిందని నమ్మించాలని చూశాడు. తన ప్లాన్ విఫలమై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ కుర్రాడిపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలనే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు..
తన పాదాన్ని తానే నరుక్కోవడం అంటే..
ఎంబీబీఎస్ విద్యార్థి కావడానికి ఒక యువకుడు తన పాదాన్ని తానే నరుక్కున్నాడు అంటే... ఇది ఆ విద్యార్థి ఆశయం కాదు. ఇది సహాయం కోసం నిశ్శబ్దంగా కేకలు వేయడం. అతడు ప్రమాదంలో కాలు కోల్పోలేదు. అతను ఆశను కోల్పోయాడు. ఒత్తిడి కారణంగా. వెనుకబడిపోతానేమోననే భయం తనది. నీట్‌లో రెండుసార్లు విఫలమైన తర్వాత, వైకల్యం కోటా కింద ఎంబీబీఎస్ సీటుకు అర్హత సాధించడానికి అతను తన పాదాన్ని తానే నరికివేసుకున్నట్లు ఆరోపణలు.
ఒక పరీక్ష ఒక జీవితం విలువను నిర్వచించే వ్యవస్థలో.. వైఫల్యాన్ని క్షమించలేని సంస్కృతిలో, కాలు నరుక్కోవడం ద్వారా.. సీటు కోసం జీవితాంతం అనుభవించే నొప్పి మాత్రమే తనకు మిగిలి ఉన్న ఏకైక ఎంపిక అని భావించిన విద్యార్థి నేరం చేసినట్లా లేక బాధితుడిగా మిగిలినట్లా... మనకు ఇంతకు మించిన కఠినమైన ధృవీకరణ అవసరం లేదు. మనకు మెరుగైన కౌన్సెలింగ్, బహుళ మార్గాలు, మానవీయ వ్యవస్థలు ఇప్పుడు అవసరం. ఎందుకంటే ఏ కల కూడా ఎవరి శరీరాన్ని కోల్పోయేలా చేయకూడదు. ఇక్కడ విఫలమైంది ఏమిటి విద్యార్థా లేదా వ్యవస్థా..?
జీవితాన్ని బలికోరే కలలు అవసరమా?
ఒకటి మాత్రం నిజం. ఏదైన ఒక కల మనిషికి గౌరవాన్ని అందించే ముందు రక్తాన్ని కోరితే, ఆ కల ఇక అమాయకంగా ఉండదు. ఇది చెడు నిర్ణయం గురించిన కథ కాదు. యువతకు పరీక్షల్లో ర్యాంక్ అనేది శరీరం కంటే, జీవితం కంటే ముఖ్యమైనదని నిశ్శబ్దంగా బోధించే వ్యవస్థకు ఇది అద్దం. ఒక విద్యార్థి... తన జీవితాశయమైన మెడికల్ సీటు సాధన కోసం కొని తెచ్చుకున్న కృత్రిమ వైకల్యం నొప్పిని కూడా జీవితాంతం భరించవచ్చు అని నమ్మడం ప్రారంభించినప్పుడు, మన వ్యవస్థలో ఏదో చాలా తప్పు జరిగిందనే అర్థం. విద్యతో మాత్రమే కాదు, మనం విలువను ఎలా నిర్వచించాలో కూడా పునరాలోచించుకోవాలి. మనం టాపర్లను ప్రశంసిస్తాము, మెరిట్‌ను ఉటంకిస్తాము, ముందుకు సాగుతాము. పడిపోయే వారితో, వైఫల్యాలను పునరావృతం చేసే వారితో, మనం కలిసి కూర్చోము.
నష్టం జరిగాక కరుణ కలిగితే...
విద్య అనేది తలుపులు తెరవడానికి ఉద్దేశించబడింది, అంతే కానీ, నిరాశ ధైర్యంగా అనిపించే ఒక ఇరుకైన మార్గంలో ప్రజలను దింపి ఒక మూలన పెట్టడానికి కాదు. ఇది ఆశయం కాదు. ఇది ఆశగా ధరించిన భయం. విషాదం ఏమిటంటే అతను డాక్టర్ కావాలనుకోలేదు. సీటు లేని, సీటు రాని జీవితాన్ని అతను అసంపూర్ణంగా భావించాడు. ఏ మానవ వ్యవస్థ కూడా వికలాంగత్వం ఒక మార్గం అనీ, తిరిగి ప్రయత్నించడం వైఫల్యం అని ఎవరినీ నమ్మించకూడదు. కాబట్టి ఇక్కడ ప్రశ్న విద్యార్థి విఫలమయ్యాడా లేదా వ్యవస్థ విఫలమయిందా అనేది కాదు. నిజమైన వైఫల్యం సమిష్టిగా ఉంటుంది, ఉదాహరణకు బాధలను సాధారణీకరించే, ప్రత్యామ్నాయాలను అవమానించే, నష్టం జరిగిన తర్వాత మాత్రమే కరుణ వచ్చే సంస్కృతిని మనం ఇంత కాలం నిర్మించాం, నిర్మిస్తూ వచ్చాం. అదే మనందరినీ కలవరపెట్టాలి.
ఆ వార్తను చదవడం నిజంగా బాధాకరం. మనం ఇప్పటికే ప్రతిరోజూ చాలా ఒత్తిడిని ఎదుర్కొంటాము న్యాయం అనిశ్చితంగా అనిపించడం ప్రారంభించినప్పుడు, అది నెమ్మదిగా మనల్ని లోపలి నుండి విచ్ఛిన్నం చేస్తుంది. విద్య ఆశను ఇవ్వడానికి ఉద్దేశించింది తప్ప దానిని దూరం చేయడానికి కాదు. ఇప్పుడు అతనికి కోటా లభిస్తుందా లేక జైలు జీవితం తప్పనిసరి అవుతుందా.. ఇది చాలా చాలా దురదృష్టకరమైన అంశం.
సీతారావుడి న్యాయం ఇప్పటికీ అమలైతే ఎలా..
భూస్వామికి తాను బాకీ ఉన్న అప్పు తన పిల్లాడికి చుట్టుకుని గుదిబండ కాకూడదని కన్నకొడుకుని నరికేసి, 'నా కొడుకు ఇక ఎవరకీ అప్పు పడడు' అంటూ చెప్పిన కన్నతండ్రి సీతారావుడి కథను మనందరం కాళీ పట్నం రామారావు గారి 'యజ్ఞం' లో చదివాం. ఏమీ చేయలేని నిస్సహాయతతో పిల్లవాడికి కన్నతండ్రి విధించిన దయనీయమైన శిక్ష అది. మెడికల్ సీటు కోసం కాలు నరుక్కున్న ఆ అబ్బాయి చర్య ఏ సామాజిక దౌష్ట్యానికి, ఏ విలువల విధ్వంసానికి నిదర్శనం మరి. లక్ష్య సాధన కోసం కాలు లేకపోయినా ఫర్వాలేదని తెగించిన ఆ పిల్లాడికి జైలు శిక్ష విధిస్తే అది మొత్తం సమాజం తల వంచుకోవలసిన తీర్పు కాదా?
జంటిల్మన్ సినిమా చెప్పిన సారం
30 ఏళ్ల కాలం నాటి జెంటిల్మన్ సినిమాలో తన కుమారుడి సీటుకోసం తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్న కన్న తల్లి ఆత్మ త్యాగాన్ని చూసి కోట్లమంది చలించిపోయారు. అది సినిమా కాబట్టి అందరికీ నచ్చేసింది. వాస్తవ జీవితంలో రెండు కాళ్లతో నడిచే జీవితమే వద్దనుకుని మెడికల్ సీటు కోసం కాలు నరుక్కున్న పిల్లాడిని తప్పు పట్టే అర్హత ఈ సమాజానికి ఉందా..?
మెరిట్ లేకున్నా లక్షలు, కోట్లు డొనేషన్లు కట్టి మెడిసన్ సీట్లు సంపాదించుకునే వారిని మనం ఆమోదిస్తాం. కనీస మార్కులతో పాస్ అయినా సరే రిజర్వేషన్ కోటా కింద సీట్లు సులభంగా పొందితే దాన్ని కూడా గౌరవిస్తాం. ఎందుకంటే అది వెనుకబడిన కులాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ ఆ సంపన్నులు, ఈ రిజర్వేషన్ పేదల మధ్య ఎటూ కాకుండా నలిగిపోతున్న ఇలాంటి పిల్లల జీవన విధ్వంసక చర్యను మనం సానుభూతితో అర్థం చేసుకోలేం. పైగా మీడియాలోనే తీర్పులు చెప్పడానికి, అతడి చర్యలోని నేరస్వభావాన్ని అంచనా వేయడానికి మనం ఘటన జరిగిన తొలి రోజునుంచే సిద్ధపడిపోతాం. మన అసమాన సమాజం, దుర్మార్గ వ్యవస్థ సృష్టిస్తున్న ఇలాంటి దారుణాలకు నేరం ఎవరిపై మోపాలో తెలీక కళ్లు మూసుకుంటే ఈ వ్యవస్థ రేపటి గతి ఏంటనేది ప్రశ్నార్థకమే అవుతుంది.
ఆ పిల్లాడి గదిలో దొరికిన సిరంజిలు, అనస్తీసియా ఇంజెక్షన్లు, కటింగ్ మెషిన్ ఆధారంగా అకడమిక్ ఒత్తిడి వల్ల ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడించారు. అమూల్యమైన జీవితం పైనే గురిపెట్టిన ఈ అకడమిక్ ప్రెషర్‌కు కారణమెవరు..? అలా ఆ విద్యార్థిని ప్రేరేపించిన కారకులను విచారించి శిక్షలు విధించేంత స్థాయి మన న్యాయస్థానాలకు లేదు. ఇలాంటి స్వీయ విధ్వంసక ఘోరాల లోతుల్లోకి పోయి ప్రభుత్వాలను, పాలకులను నిలదీసే న్యాయమూర్తులు ఇప్పుడు లేకపోవడమే మన దేశ నిజమైన దౌర్భాగ్యం..
-కె. రాజశేఖర
73964 94557






