మమ్ముట్టి.. నటన అనే మహాసముద్రం

by Ravi |   (  Updated:2026-07-25 01:15:29  IST  )

ఐదు దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర రంగంలో తన అసాధారణ నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన మమ్ముట్టి నటనా వైశిష్ట్యం, పాత్రలపై ఆయన అధ్యయనం..

మమ్ముట్టి.. నటన అనే మహాసముద్రం
X

భారతీయ చలనచిత్ర రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా నిరంతరంగా తన నటనతో ప్రేక్షకులను, విమర్శకులను సమానంగా మెప్పిస్తూ వచ్చిన నటులు చాలా అరుదు. ఆ అరుదైన నటులలో మమ్ముట్టి ఒకరు.. ఆయన గొప్పతనం సినిమాల సంఖ్యలోనో, అందుకున్న పురస్కారా‌లలోనో లేదు. ప్రతి పాత్రలో ఆయన ఆవిష్కరించే మానవీయ లోతుల్లో, ఆ పాత్రను జీవించిన తీరులో ఉంది.

మమ్ముట్టి నటనలో భావాలను ప్రదర్శించడు.. ఒక మనిషిగా పూర్తిగా రూపాంతరం చెందుతాడు. ఒక పాత్రను పోషించే ముందు దాని సామాజిక నేపథ్యం, మానసిక నిర్మాణం, వృత్తి, భావోద్వేగ చరిత్రలను లోతుగా చేసిన అధ్యయనం కనిపిస్తుంది. అంబేద్కర్ పాత్ర అయినా, భూస్వామి పాత్ర అయినా, పోలీసు అధికారి అయినా, కమ్యూనిస్టు నాయకుడైనా, న్యాయవాదైనా, ఉపాధ్యాయుడైనా, సాధారణ గ్రామీణుడైనా ఆ పాత్రకు ఒక అంతరంగ ప్రపంచాన్ని సృష్టిస్తారు. అందుకే తెరపై మనకు మమ్ముట్టి కనిపించరు. ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది.

నిశ్శబ్దమే సంభాషణగా మారి...

చాలామంది నటులు సినిమా దృశ్య మాధ్యమం అని మర్చిపోయి సంభాషణల మీద ఆధారపడతారు. మమ్ముట్టి మాత్రం నిశ్శబ్దాన్ని కూడా సంభాషణగా మలుస్తారు. కళ్లలో ఒక స్వల్ప కదలిక, మాటకు ముందు ఒక చిన్న విరామం, దవడలో ఒక బిగుతు, దూరంగా చూస్తున్న చూపు ఇవన్నీ కలిసి ఒక పాత్ర అంతర్మథనాన్ని వ్యక్తం చేస్తాయి. మథిలుకల్, విదేయన్, పేరన్‌బు వంటి చిత్రాలలో ఆయన అత్యంత శక్తివంతమైన నటనలో మాటల కంటే మౌనంలోనే ఎక్కువగా వ్యక్తమవుతాయి.

జీవితమంతా నటనా ప్రయోగమే

భారతీయ సినిమాల్లో గొప్ప వ్యక్తీకరణ శక్తి గల స్వరాలలో మమ్ముట్టి స్వరం ఒకటి. అధికారాన్ని, బలహీనతను, మమకారాన్ని, ఆగ్రహాన్ని, వ్యంగ్యాన్ని పాత్రల అవ సరాన్ని బట్టి ఆయన స్వరం సహజంగా మారుతుంది. ఆయన సంభాషణల ఉచ్చారణలో లయ, స్పష్టత, నియంత్రణ కనిపిస్తాయి. మాటలను కేవలం పలకడం కాదు, శిల్పంలా చెక్కుతారు.. ప్రతి విరామం, ప్రతి ఒత్తు, ప్రతి స్వరమార్పు పాత్ర నిర్మాణంలో భాగమవుతుంది. పేరన్‌బులో కూతురి కోసం జీవితాన్ని అర్పించిన తండ్రి, నన్‌పకల్ నేరత్తు మయక్కంలో రహస్యమయమైన వ్యక్తి, బ్రమయుగంలో భయానకమైన ఆధ్యాత్మిక ఉనికి, కాథల్ – ది కోర్ సినిమాలో అంతర్మథనంతో జీవించే మనిషి ఇలా ప్రతి పాత్రలో ఆయన కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తారు. దశాబ్దాల కెరీర్‌ తర్వాత కూడా ప్రయోగాలకు వెనుకాడకపోవడం ఆయన కళాత్మక ధైర్యానికి నిదర్శనం.

శరీర భాష సృష్టికర్త..

మమ్ముట్టి ప్రతి పాత్రకు తగ్గ శరీర భాషను సృష్టిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆయన శరీర భాషే పేజీల కొద్దీ సంభాషణల కంటే ఎక్కువ అర్థాన్ని వ్యక్తపరుస్తుంది. ఆయనకు శరీరం కూడా ఒక భాషే. చాలామంది నటులు బిగ్గరగా అరుస్తూ నటిస్తారు. మమ్ముట్టి సంయమనంలోనే ఆ తీవ్రతను ఆవి ష్కరిస్తారు. చాలామంది హీరోలు ఇమేజ్‌కు బందీలవుతారు. కానీ మమ్ముట్టి ఇమేజ్‌ చట్రంలో బందీ కాలేదు. డెబ్బై ఏళ్ల వయసులో కూడా యువ దర్శకులతో పనిచేస్తూ, కొత్త కథలను ఎంచుకుంటూ, క్లిష్టమైన పాత్రలను స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నిరంతర పునర్నవీకరణే ఆయన కళను సజీవంగా ఉంచుతోంది.

ఒక నటుడిని కాదు.. ఒక జీవితాన్ని చూస్తాం

భారతీయ సినిమాల్లో తారలు గొప్ప నటులు చాలామంది ఉన్నారు. కానీ కాలంతో పాటు పరిపక్వమవుతూ, ప్రతి కొత్త చిత్రంతో తనను తాను తిరిగి ఆవిష్కరించుకుంటూ వచ్చిన నటులు చాలా కొద్దిమంది మాత్రమే.. ఆయన సినిమాల్లో ఇంకో జాబితా చూస్తే మథిలుకల్లో ఖైదీగా, విదేయన్లో యజమాని పాత్రలో, పేరన్‌బులో కూతురి కోసం జీవించే తండ్రిగా, నన్‌పకల్ నేరత్తు మయక్కంలో మర్మమైన మనిషిగా కనిపించినప్పుడు మనం ఒక నటుడిని చూడం. ఒక జీవితాన్ని చూస్తాం. అసలు నటన అంటే ఏమిటి? ఇతరుల జీవితాలను తనలోకి ఆహ్వానించడం కదా. తన శరీరాన్ని, తన స్వరాన్ని, తన మనసును ఒక పాత్రకు అప్పగించడం. ఆ పాత్ర సత్యాన్ని ప్రేక్షకుల హృదయాలలో నాటడం. మమ్ముట్టి అదే చేస్తాడు.

నా కిష్టమయిన ‘మథిలుకల్’

ప్రపంచంలోని గొప్ప ప్రేమ కథలన్నీ ఒకేలా ఉండవు. కొన్ని ప్రేమలు చూపులతో మొదలవుతాయి. కొన్ని స్పర్శలతో. కొన్ని ఉత్తరాలతో, మరికొన్ని ఒక చిరునవ్వుతో, కానీ ఒక ప్రేమకథ కేవలం ఒక స్వరంతో మొదలై, ఒక గోడ చుట్టూ తిరుగుతూ, ఒక జీవితకాలపు జ్ఞాపకంగా మిగిలిపోవడం అరుదు. మలయాళ సాహిత్యంలో గొప్ప కథకుడు వైక్కం మహమ్మద్ బషీర్ రాసిన ‘మథిలుకల్’ (గోడలు) అలాంటి అరుదైన ప్రేమగాథ. అందుకే ‘మథిలుకల్’ కేవలం ఒక ప్రేమకథ కాదు. అది మానవత్వం మీద రాసిన గీతం. ఈ నవలికను 1989లో దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్ సినిమాగా మలిచినప్పుడు భారతీయ సినిమా ఒక అపూర్వమైన కళాఖండాన్ని చూసింది. సాహిత్యాన్ని సినిమాగా మార్చడం సులభం కాదు. ముఖ్యం గా ‘మథిలుకల్’ లాంటి రచనను.. ఎందుకంటే ఈ కథలో ప్రేమికులు కలుసుకోరు, కథానాయిక కనిపించదు, ప్రేమ నిశ్శబ్దంలో, మాటల్లో, నిరీక్షణలో ఉంటుంది. కానీ అదూర్ ఆ సవాలును అద్భుతంగా స్వీకరించాడు.

చిరస్థాయిగా నిలిచిపోయే నటన..

సినిమాలో కూడా నారాయణి కనిపించదు. ఆమె కేవలం ఒక స్వరం. ఆ స్వరమే ఒక పాత్ర. ఆ స్వరమే ఒక ముఖం. ఆ స్వరమే ఒక ప్రపంచం. బషీర్ పాత్రలో మమ్ముట్టి నటించలేదు, జీవించాడు.. ఆయన కళ్ళలో కనిపించే ఎదురు చూపు, స్వరంలో వినిపించే ఆతురత, విడుదల వార్త విన్నప్పుడు ముఖంపై కమ్ముకునే విషాదం ఇవన్నీ కలిసి భారతీయ సినిమాకు చిరస్థాయిగా నిలిచిపోయే నటనను అందించాయి. సాహిత్యంలో బషీర్ చేసిన అద్భుతాన్ని సినిమాలో అదూర్ పునః సృష్టించాడు. మమ్ముట్టి కేవలం భారతీయ సినిమాకే చెందిన గొప్ప నటుడు కాదు. మన కాలపు అత్యుత్తమ తెర కళాకారులలో ఒకరు.

(మమ్ముట్టి నాలుగో సారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయిన సందర్భంగా)

-వారాల ఆనంద్

94405 01281

Next Story