- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహాత్మాగాంధీ మార్గమే శిరోధార్యం!!
ఇటీవల సోషల్ మీడియాలో మహాత్మాగాంధీపై వ్యంగ్యంగాను, కించపరిచే అసత్యాలతోను పోస్టులు, వీడియోలు పెడుతున్నారు. నేటి తరానికి జాతీయ ఉద్యమ స్ఫూర్తిని, మహాత్మా గాంధీ ఆదర్శ సిద్ధాంతాలను ప్రచారం చేసే ఉద్దేశంతో మాజీ మంత్రివర్యులు డా. ఎన్. రఘువీరారెడ్డి మూడు రోజులపాటు గాంధీ సందేశ్ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.

ఇటీవల సోషల్ మీడియాలో మహాత్మాగాంధీపై వ్యంగ్యంగాను, కించపరిచే అసత్యాలతోను పోస్టులు, వీడియోలు పెడుతున్నారు. నేటి తరానికి జాతీయ ఉద్యమ స్ఫూర్తిని, మహాత్మా గాంధీ ఆదర్శ సిద్ధాంతాలను ప్రచారం చేసే ఉద్దేశంతో మాజీ మంత్రివర్యులు డా. ఎన్. రఘువీరారెడ్డి మూడు రోజులపాటు గాంధీ సందేశ్ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా వారి స్వగ్రామం సత్యసాయి జిల్లా నీలకంఠాపురం గ్రామం నుండి హిందూపురం గాంధీ చౌక్ వరకు జనవరి 28, 29, 30 తేదీలలో మూడు రోజుల పాటు ఈ పాదయాత్ర చేస్తున్నారు..
భారత జాతి పితగా, మహాత్ముడుగా పేరుపొందిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహోన్నత వ్యక్తి, వినూత్న ప్రజానాయకుడు. ఇరవయ్యో శతాబ్దం పూర్వార్ధంలో భారతదేశంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన విశిష్ట వ్యక్తి. రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పిన అసాధారణ రాజకీయవేత్త. ఆధునిక రాజకీయాలకు ఆదర్శాలు నిర్దేశించి ఆచరించిన రాజనీతిజ్ఞుడు. సమాజ పరివర్తనకు హింసతో పనిలేదని రుజువు చేసిన సాంఘిక శాస్త్రజ్ఞుడు.
సత్యాన్వేషణే జీవితాచరణగా..
మానవుడి కోరికలు ప్రకృతి సిద్ధంగా చాలా పరిమితమైనవని ఆచరించి చూపినవాడు. సమాజంలోని అశాంతికీ, అన్యాయానికీ, అసమానతలకూ మితిమీరిన మానవుడి కోరికలే కారణమని విశ్లేషించిన విజ్ఞాని. తన జీవితాన్నంతా 'సత్యాన్వేషణ'కు వినియోగించాడు. సత్యం, అహింస, సత్యాగ్రహం, ధర్మకర్తృత్వం, సర్వోదయం అనే భావాలను రాజకీయ, సాంఘిక, ఆర్థిక, నైతిక విలువలుగా గుర్తించి వాటి ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఆధునికుడు. "నా జీవితమే నా సందేశం" అని చెప్పుకోగల ఉదాత్తుడు.
గాంధీయిజంకి మరణం లేదు..
గాంధీజీ తత్త్వం ఒక జీవన విధానం. ఆయన జీవితమే ఒక మహా ప్రయోగం. అందుకే గాంధీ తన ఆత్మకథకు 'సత్యాన్వేషణలో నా ప్రయోగాలు' (My Experiments With Truth) అని పేరు పెట్టుకున్నాడు. ప్రముఖ ఆధునిక రాజనీతి శాస్త్రజ్ఞుల్లో ఒకడిగా ప్రసిద్ధి చెందాడు. 'గాంధీ అండ్ గాంధీయిజం' అనే పుస్తకంలో కాంగ్రెస్ చరిత్రకారుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య “గాంధీ మరణించవచ్చు. కాని గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది" అన్నమాట అక్షరాలా సత్యం. మహాత్మా గాంధీ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూనే జాతి ఐక్యతను సామాజిక ఆర్థిక రాజకీయ సమగ్రతను సాధించేందుకు తన జీవితమంతా ఉద్యమించారు.
సామాజిక అంశాలు..
సరిగ్గా వందేళ్ళ క్రితం నాటి మాట. ఆనాడు భారతీయ సమాజంలో కుల సమస్య అధికంగా ఉంది. అంటరానితనం మూర్ఖత్వానికి పరాకాష్టగా మారింది. ఈ పరిస్థితుల్లో భారతీయుల మధ్య సహనం సామరస్యం, పెంపొందించడానికి గాంధీజీ అస్పృశ్యత నివారణ ఉద్యమాన్ని చేపట్టారు. వివిధ కులాల మధ్య పరస్పర సహకారం సంఘీభావం పెంపొందాలని బోధించారు. కుల సమస్యతో పాటు మత సమస్యను కూడా సామరస్యంతో పరిష్కరించుకోవాలని సూచించేవారు. గాంధీజీ పర్యటించిన ప్రతిచోట కులాల ఐక్యత, మత సామరస్యం, స్త్రీపురుషుల పరస్పర గౌరవం వంటి విషయాలను చర్చించేవారు. సర్వమత ప్రార్థనలు చేసేవారు. ఈనాటికి భారతీయ సమాజంలో కుల మత లింగ వివక్షకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నాం.
ఆర్థిక అంశాలు..
మహాత్మా గాంధీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసం నిరంతరం పరిశోధించారు. వ్యవసాయం తర్వాత ఖాదీ గ్రామీణ కుటీర పరిశ్రమల ద్వారా భారత దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంపొందించవచ్చని ఆశించారు. భారతదేశం గ్రామాల్లో ఉందని, ఆ గ్రామాల స్వయం సమృద్ధత సాధించేలా ప్రోత్సహించాలని భావించారు. స్వదేశీ నినాదంతో ఇక్కడి పరిశ్రమలను ప్రోత్సహించాలని విదేశీ దిగుమతులను సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలని సూచించేవారు. స్వదేశీ ఉద్యమం కేవలం బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకత కోసమే కాక దేశీయ పరిశ్రమల అభివృద్ధి ప్రోత్సాహానికి సంబంధించిన అంశంగా గాంధీజీ భావించారు. అందుకే గాంధీజీ జాతీయ ఉద్యమాన్ని రెండు ముఖాలుగా నడిపారు. ఒకటి వలస పాలనను వ్యతిరేకించడం. రెండు దేశంలో జాతి పునర్నిర్మాణం మరియు స్వయం సమృద్ధత సాధించడం. అందుకోసమే చిన్న పరిశ్రమలు చిన్న ప్రాజెక్టులు అనే విషయాన్ని నొక్కి చెప్పారు.
రాజకీయ అంశాలు..
భాగస్వామ్య ప్రజాస్వామ్యం, పరిపాలన వికేంద్రీకరణ గ్రామ స్వరాజ్యం స్వయంపాలన మొదలైన విషయాలను పదేపదే చర్చించారు. పరిపాలన పైనుంచి కిందికి కాకుండా గ్రామీణ స్థాయి నుండి పరిపాలన పై స్థాయికి చేరాలని భావించారు. స్వయం సమృద్ధమైన గ్రామ స్వరాజ్యం స్వయం పాలన సాధించబడాలని గాంధీజీ ఆశించారు. ప్రణాళికలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి కాకుండా గ్రామస్థాయిలో జిల్లా స్థాయిలోనే రూపొందించబడి కేవలం వాటిని ప్రభుత్వాలతో ఆమోదించుకోవాలని అనేవారు. వ్యక్తిగత వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండాలని భావించేవారు.
ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ పెత్తనమా?
గాంధీజీ అభిప్రాయంలో ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ పెత్తనం కాదు. మైనార్టీ హక్కులకు పూర్తి రక్షణ ఉండాలి. వారి అభిప్రాయాలకు గుర్తింపు ఉండాలి. మెజారిటీ ప్రజలు మైనార్టీ ప్రజలకు నమ్మకం కలిగించాలి. వారి అభిప్రాయం కూడా మెజారిటీ అభిప్రాయంతో ఏకీభవించేటట్లు చేయాలి. మైనారిటీ అభిప్రాయంలో సత్యమున్నట్లయితే సమిష్టి శ్రేయస్సుకు సహకరించేదైతే ఆ అభిప్రాయాన్ని మెజార్టీ ప్రజలు స్వీకరించాలి. కొన్ని సందర్భాలలో ప్రజాస్వామ్య అధికారం దుర్వినియోగం కావచ్చు. అప్పుడు ఆ దుర్వినియోగాన్ని ప్రశ్నించాలి కానీ ప్రజాస్వామ్యాన్ని నిరసించరాదు అని అంటాడు. నేటి తరానికి మహాత్మా గాంధీ బోధనలను సందేశాలను అందించాల్సిన అవసరం ఉంది. భారత దేశం నుంచి మహాత్మా గాంధీని విడదీసి చూడలేము. నేటికీ భారతదేశ భవితవ్యానికి మహాత్మా గాంధీ మార్గమే శిరోధార్యం.
(మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా)
-తడక యాదగిరి
93480 09227






