- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరంతర సత్యాన్వేషి మహర్షి దయానంద సరస్వతి
తమ నమ్మకాలే సత్యమని భావించి, అవే ఇతరులూ నమ్మాలని ప్రయత్నించే వారు ప్రతి కాలంలోనూ ఉంటూనే ఉంటారు. కుల, మత, ప్రాంత వ్యామోహాలతో ఏర్పడిన నమ్మకాలు మనుషుల్లోని వివేచనాశక్తిని నశింపజేసి, వారిని అంధవిశ్వాసాల వైపు నడి పిస్తాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో నమ్మకాలు, నిజాలు అత్యంత సున్నితంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.

తమ నమ్మకాలే సత్యమని భావించి, అవే ఇతరులూ నమ్మాలని ప్రయత్నించే వారు ప్రతి కాలంలోనూ ఉంటూనే ఉంటారు. కుల, మత, ప్రాంత వ్యామోహాలతో ఏర్పడిన నమ్మకాలు మనుషుల్లోని వివేచనాశక్తిని నశింపజేసి, వారిని అంధవిశ్వాసాల వైపు నడి పిస్తాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో నమ్మకాలు, నిజాలు అత్యంత సున్నితంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఈ రెండింటికి మధ్య గల తేడాను గుర్తించి సత్యాన్ని వెలికి తీయడం సులభమైన పని కాదు.. అటువంటి క్లిష్టమైన మార్గంలో నిరంతర సత్యాన్వేషణ చేసిన వాడు మహర్షి దయానంద సరస్వతి.
ప్రశ్నించే స్వభావం..
దయానంద సరస్వతి, 1824 ఫిబ్రవరి 12న గుజరాత్ రాష్ట్రంలోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బాల్యంలో శివరాత్రి సందర్భంగా తండ్రితో కలిసి శివాలయానికి వెళ్లిన దయానంద, గర్భగుడిలో శివలింగంపై ఎలుక ఎక్కి నైవేద్యాన్ని తినడం గమనించారు.. ఇది ఆయన మనస్సులో అనేక ప్రశ్నలను రేకెత్తించింది. ‘కైలాసాధిపతి, మహాశక్తిమంతుడైన శివుడు ఒక చిన్న ఎలుకనైనా దూరం చేయలేడా?’ అనే సందేహం ఆయన హృదయంలో చోటు చేసుకుంది. తండ్రి ఇచ్చిన సంప్రదాయ వివరణ ఆయనకు తృప్తి కలిగించలేదు. ఇక అప్పటి నుంచే నమ్మకాలపై ప్రశ్నించే స్వభావం ఆయనలో పెరిగింది.
సత్యార్థ ప్రకాశం..
ఈ సత్యాన్వేషణ ఫలితమే ఆయన రచించిన ‘సత్యార్థ ప్రకాశం’. ఇందులో సమాజంలోని మూఢాచారాలు, అంధ విశ్వాసాలు, మోసపూరిత ఆధ్యాత్మిక వ్యాపారాలు తీవ్రంగా ఖండించబడ్డాయి. ఉపనిషత్తులు ‘సత్యమేవ జయతే’ అని బోధించినప్పటికీ, నేటి సమాజంలో చాలామంది తమ నమ్మకాన్నే సత్యంగా భావించి, దానికి భిన్నమైన ప్రతిదాన్నీ అసత్యంగా పరిగణిస్తున్నారు.. ఈ బలహీనతను గుర్తించిన రాజకీయ నాయకులు, ఆధ్యాత్మిక వ్యాపార వేత్తలు ప్రజలను నమ్మకాల మత్తులో ముంచి, అంధ విశ్వాసాల్లో నెట్టేసి, తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు..
ఆర్య సమాజం స్థాపన..
ఈ పరిస్థితిని గమనించిన దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజంను స్థాపించారు. ఇందులో సత్యానికి అత్యున్నత స్థానం ఇచ్చారు. ఆర్య సమాజ నియమాలలో ముఖ్యమైనవి సత్యాన్ని గ్రహించడానికి, అసత్యాన్ని త్యజించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం. సమాజ హితమే పరమ లక్ష్యంగా భావించడం. ప్రతి కార్యాన్ని ధర్మానుసారంగా, సత్యాసత్య విచార ణతో చేయడం. ప్రేమ, ధర్మంతో ప్రవర్తించడం, స్వీయ ఉన్నతితో తృప్తి చెందకుండా, సమస్త మానవాళి ఉన్నతికి కృషి చేయడం.
వాళ్లు గురువులు కాదు..
ఈ సిద్ధాంతాలు బుద్ధుని బోధనలను తలపించినప్పటికీ, దయానంద సరస్వతి పూర్తిగా వేదాధారిత ఆలోచనలకు కట్టుబడి ఉన్నారు. గురువు లోభి, మోహి, క్రోధి, కామి అయితే అతడిని విడిచిపెట్టాలని, అవసరమైతే ఖండించాలని ఆయన స్పష్టం చేశారు.. కేవలం వేషధారణతో, మాలలు, తిలకం ధరించి, వేద విరుద్ధ బోధనలు చేసే వారు గురువులు కాదని, వారు శిష్యులను మోసగించే గొర్రెల కాపరులే అని తీవ్రంగా విమర్శించారు.. గురువులందరూ దేవతల ప్రతిరూపాలు కాదని, బ్రాహ్మణత్వం పుట్టుకతో కాక గుణం, జ్ఞానం, సద్గుణ ప్రవర్తనతోనే వస్తుందని స్పష్టం చేశారు.. మహర్షి దయానంద సరస్వతి జీవితం, ఆలో చనలు అధ్యయనం చేస్తే, నేటి అనేక గురువులు, స్వాముల మాటలు సూర్యుని ఎదుట దీపాల్లా కనిపిస్తాయి. ఆయన సత్యానికి అంకితమైన జీవితం నేటి తరానికి మార్గదర్శకం.
(నేడు మహర్షి దయానంద సరస్వతి జయంతి)
- నరసింహ ప్రసాద్ గొర్రెపాటి
94407 34501






