చరిత్రలో నిలిచిపోయేట్టుగా మహానాడు వేడుకలు

by Ravi |   (  Updated:2025-05-27 01:15:17  IST  )

1982లో ఆంధ్రప్రదేశ్‌లో 43 ఏళ్ల నాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి కర్షకుల చిహ్నమైన నాగలి

చరిత్రలో నిలిచిపోయేట్టుగా మహానాడు వేడుకలు
X

1982లో ఆంధ్రప్రదేశ్‌లో 43 ఏళ్ల నాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి కర్షకుల చిహ్నమైన నాగలి, కార్మికుల చిహ్నం చక్రం, పేదవాడి గుడిసెను ముద్రించి శుభ ప్రదమైన పసుపు రంగుతో జెండాను రూపొందించారు. ఈ జెండా సకల సమస్యలు తీరుస్తూ, తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ జెండా 43 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఘనతలు సాధించింది.

తెలుగుదేశం పార్టీ స్థాపనతో రూపొందిన ఈ జెండా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయపరంగా, అభివృద్ధి పరంగా ఎంతో కొంత పుంతలు తొక్కింది. 1982లో నందమూరి తారక రామారావు పసుపు జెండాను ఆవిష్కరించినప్పుడు, అది ఒక పార్టీ ప్రారంభం కాదు, అది ఒక ప్రజల స్వాభిమానానికి సంకేతంగా నిలిచింది. తెలుగువాడు తలదించుకోవాల్సిన అవసరం లేదనే ఎన్టీఆర్ నినాదం ప్రజల హృదయాల్లో ముద్ర పడింది. యువతకు ఉద్యోగావ కాశాలు ఏర్పడడంతో పసుపు జెండా అనేది అప్పటి నుంచి అభివృద్ధికి మారు పేరుగా మారింది.

ఆత్మగౌరవానికి గుర్తుగా..

ప్రతి ఏడాది ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మే 27-28-29 తేదీల్లో అన్ని వర్గాలను ఆహ్వానించి నిర్వహించే విశాల వేదిక మహానాడు. కార్యకర్తలు మూడు రోజులు జరుపుకునే అతిపెద్ద పసుపు పండుగ. ప్రజాస్వామ్య విలువల సంకల్పం. ఆనాటి పాలకుల ఏకపక్ష అధికారానికి, అహంకారానికి ప్రత్యామ్నాయంగా ఈ జెండా ఒక కొత్త దారి చూపింది. ఆత్మగౌరవం అనే మాట ప్రజలకు ఆయుధం అయింది. పసుపు రంగు టీడీపీకి ప్రత్యేక గుర్తుగా నిలిచింది. పల్లెల్లో, పేదల గుండెల్లో వెలు గులు నింపింది. నిరు పేదల ఆకలి గాయా లకు చికిత్స అందిం చింది.

ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి..

పేదోడికి పట్టెడన్నం, పక్కా ఇళ్లు నిర్మించి నీడనిచ్చింది, పేదలకు సగం ధరకే చీర-ధోవతి-పేద వర్గాల వారికి గురుకుల పాఠశాలలు.. తాలూ కాలు, సమితుల స్థానంలో మండల వ్యవస్థ ఏర్పాటు చేసి పాలనను ప్రజల వాకిళ్ళ ముందుకు తెచ్చి సమస్యలు పరిష్కారం చేసింది. తెలంగాణలో పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి- మహిళలకు ఆస్తి హక్కు- దేశంలో మొదటిసారి వృద్ధాప్య పింఛన్ల పథకాన్ని ప్రవేశపెట్టి నెలకు రూ.30- 60 ఏళ్లు నిండిన వ్యవసాయ కార్మికులకు పింఛన్లు, దివ్యాంగులకు, వితంతువులకూ పింఛను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలను పేదలకు అందించింది. హైదరాబాద్‌ను ఐటీ శిఖరంగా మార్చడం, లక్షల తెలుగు యువతకు ఐటీ కొలువులకు నిలయంగా నిలపడం, సైబరాబాద్ అనే ఒక శివారు నగరమే నిర్మితం అవడం, ఏటా వేలకోట్ల రూపాయల ఐ‌టీ ఎగుమతులు సాధ్యం అవడానికి ఐ.ఎస్.బి మొదలు ఎన్నో సంస్థలను రాష్ట్రానికి మళ్ళించడానికి కారణం పసుపు జెండానే.

కడపలోనే నిర్వహించడానికి..

2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం జరుగుతున్న వేడుక కావడంతో దీన్ని ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ ముఖ్య నేతలు నెల రోజులుగా శ్రమిస్తున్నారు. సభ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, మంత్రి లోకేశ్‌ ప్రతిపాదించిన 6 సూత్రాల ఆవిష్కరణ, పార్టీ నియామవళిలో సవరణలపై ప్రధాన చర్చ జరగనుంది. ఈ మహానాడుకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి.. సాధారణంగా కడప జిల్లా వైసీపీ బలంగా ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాలను టీడీపీ శాసించినా కడపలో మాత్రం వైసీపీనే పైచేయి సాధించేది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కంచుకోటను టీడీపీ బద్దలు కొట్టింది. ఉమ్మడి జిల్లా లో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఏడు చోట్ల టీడీపీ జెండా ఎగిరింది. ఇది ఆ పార్టీ శ్రేణుల్లో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపింది. అదే ఊపులో ఈసారి మహానాడును కడపలో నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కడపలో మహానాడు నిర్వహించడం ఇదే మొదటిసారి. టీడీపీ 40 వసంతాలు పూర్తి చేసుకున్న సమయంలో ఒంగోలులో మహానాడును 2022లో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించింది. వైసీపీ పాలన అంతానికి ఒంగోలు మహానాడు నాంది పలికిందని చెప్పాలి.

రాయలసీమ అభివృద్ధికై

రేపటి నుండి వరుసగా మూడు రోజులు కడప గడపలో తొలిసారిగా నిర్వహించనున్న మహానాడును తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. కడపలో తొలిసారిగా నిర్వహిస్తున్న మహానాడు చరిత్రలో గుర్తుండి పోతుంది. రాయలసీమను దశాబ్దాల తరబడి పట్టిపీడిస్తున్న ఫ్యాక్షన్‌ భూతాన్ని సమూలంగా అంతం చేసిన చరిత్ర టీడీపీదే. రాయలసీమను అభివృద్ధి బాట పట్టించేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, తాగునీటి సౌకర్యాల కల్పన, వ్యవసాయ అభివృద్ధి పరిశ్రమల స్థాపన, మౌలిక సదుపాయాలు, ఉపాధి, ఉద్యోగాల కల్పనకు అవసరమైన కార్యాచరణ రూపొందించింది గత తెలుగుదేశం ప్రభుత్వం. రాయల సీమలో పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి రాయలసీమ అభివృద్ధికే పెద్దపీట వేసింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ కూడా రాయల సీమలో పారిశ్రామికాభివృద్ధికి చంద్రబాబునాయుడు విశేష కృషి చేశారు.

చంద్రబాబు పట్టుదలతో..

2014-19 మధ్య తెలుగుదేశం హయాంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. నాడు వలసలకు నిలయం అయిన అనంతపురం జిల్లా నాడు కొలువులకు నిలయంగా మారింది. నిత్యం కరువు జిల్లాగా పేరొందిన జిల్లా కార్ల ఖిల్లాగా మారింది. నాడు కరువు జిల్లా అనంతపురంలో కియా వంటి కార్ల పరిశ్రమ 11 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించడం చంద్రబాబు పట్టుదలే కారణం. కియా కార్ల కంపెనీ ఏర్పాటు తో ఏపీ బ్రాండ్ మార్మోగుతోంది. వ్యవసాయ భూములకు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ద్వారా సాగునీటి సదు పాయం కల్పించి రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చి కరువు ప్రాంతమైన రాయలసీమను ఉధ్యాన కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అంతేగాక నదుల అనుసంధానంతో రాయలసీమకు సాగు నీరు అందించి రత్నాల సీమగా మార్చడానికి ప్రయత్నం చేసింది. కరువు కాటకాలతో మగ్గిపోయే రాయలసీమను కరువు రహిత సీమగా మార్చేందుకు గోదావరి, కృష్ణా జలాల అనుసంధానం ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను రాయలసీమ ప్రాంతానికి మళ్లించి ఆ ప్రాంతంలో కరువును రూపుమాపాలని సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను పరుగులు పెట్టిం చారు చంద్రబాబు.

చరిత్రాత్మక నిర్ణయాలకు వేదిక

ఇక పోలవరం పూర్తయ్యే వరకు ఆగకుండా సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని రాయలసీమకు మళ్లించి నీటి వెతల నుంచి దూరం చేసేందుకు ఉద్దేశించి చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టును అతి వేగంగా పూర్తి చేసి వృధాగా పోతున్న గోదావరి జలాలను కృష్ణాకు తరలించి, డెల్టాకి వచ్చే నీటిని శ్రీ శైలంలో నిలిపి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు 451 టీఎంసీల నీటిని తరలించి రాయల సీమలో కరువు ప్రాంతా లను ఆదుకొన్నది గత ప్రభుత్వం. రాయలసీమ ప్రాంతం పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతంగా గుర్తించి పరిశ్రమల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కొత్త పారిశ్రామికీకరణ విధానం ద్వారా రాయలసీమలో పరిశ్రమలు విస్తృతంగా నెలకొల్పి లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా గత ప్రభుత్వం పని చేస్తుంది. రాయలసీమ ప్రాంతంలో సౌర విద్యుదుత్పాదనకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొనే వైపు నిర్దిష్టమైన చర్యలు చేపట్టింది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహానాడులో కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో పాటు పలు చరిత్రాత్మక నిర్ణయాలకు వేదికగా నిలవనుంది.

(నేటి నుంచి మహానాడు సందర్భంగా)

-నీరుకొండ ప్రసాద్

98496 25610

Next Story