మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ' - అవమానాన్ని అవకాశంగా మార్చిన భారత గర్వగాథ

by Ravi |   (  Updated:2026-07-04 01:16:14  IST  )

అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న 'మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ' సిరీస్‌పై సమగ్ర సమీక్ష. జె.ఆర్.డి. టాటా, జెర్క్సెస్ దేశాయ్ కలలు, టైటాన్ బ్రాండ్ ఆవిర్భావం, భారత ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించే ప్రేరణాత్మక కథనంపై విశ్లేషణ.

మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ - అవమానాన్ని అవకాశంగా మార్చిన భారత గర్వగాథ
X

దశాబ్దాల కాలం నుంచీ మనిషి ముంజేతికి రిస్ట్ వాచీ ఓ అందం, ఓ గౌరవం, ఓ ప్రతిష్ట. అలాంటిది ఒకనాడు మన దేశంలో తయారైన వాచీ వుండేది కాదు. జే ఆర్ డి టాటా ‘మేడ్ ఇన్ ఇండియా’ వాచీ కోసం కొలాబరేషన్ అడిగితే భారతదేశంలో గడియారం తయారీ విషయంలో కొలా బరేషన్‌కి విదేశీ సంస్థ అంగీకరించక అవమా‌నపరిచిన కాలం అది. అప్పుడు టాటా, మేడ్ ఇన్ ఇండియా తయారయ్యే దాకా ముంజేతికి గడియారం పెట్టనని శపథం లాంటిది చేస్తాడు. గడియారం తయారీకి చొరవ చూపిస్తాడు. ఆ ప్రస్తానమే ‘మేడ్ ఇన్ ఇండియా టైటాన్ స్టొరీ’.

గడియారంలోని ముళ్ళులు కాలాన్ని కొలుస్తాయి. కథల్ని చెబుతాయి. కానీ కొన్ని కథలు రిస్క్ తీసుకుని కాలాన్ని మార్చిన మనుషుల గురించి చెబుతుంది ‘మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ’ అలాంటి కథ. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న ఈ సిరీస్ చెప్పే అనేక కోణాల్లో విస్తరించిన కథ. చెప్పేది గడియారాల గురించే అయినా అది కాలాన్ని సవాలు చేసిన కొందరు మనుషుల గురించి చెబుతుంది. కేవలం పరిశ్రమ, వ్యాపారాల గురించే కాదు, నమ్మకాన్ని విశ్వాసాన్ని మూలధనంగా చేసుకున్న కొందరు సాహసికుల గురించి కూడా చెబుతుంది. ఇది ఒక బ్రాండ్ విజయగాథ మాత్రమే కాదు, “మనమూ చేయగలం” అనే భారతీయ ఆత్మవిశ్వాసానికి ప్రతీక.

ప్రపంచాన్ని మార్చేది వనరులు కాదు..

పారిశ్రామిక వేత్త జె.ఆర్.డి. టాటా వంటి దార్శనికులు, జెర్క్సెస్ దేశాయ్ వంటి కలలకనే మనుషులు మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తారు. ప్రపంచాన్ని మార్చేది వనరులు కాదు, దూరదృష్టి, అవకాశాలు కాదు, వాటిని సృష్టించే ధైర్యం. విజయాలు మాత్రమే కాదు, వాటి వెనుక నిలిచిన మనుషులు విలువలు. మన దేశంలో ప్రతి యువకుడిలో ఒక ఆవిష్కర్త ఉన్నాడు. ప్రతి విద్యార్థిలో ఒక స్వప్న దృష్టి ఉంది. ప్రతి సాధారణ మనిషిలో ఒక అసాధారణ ప్రయాణం దాగి ఉంది. ఆ ప్రయాణాన్ని ప్రారంభించడానికి కావలసింది ఒక నమ్మకం మాత్రమే. చివరికి ఈ టైటన్ కథ మనకు చెప్పేది ఒక్కటే కాలం ఎవరికోసం ఆగదు. కానీ కాలం గుర్తుంచు కునేలా జీవించడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది.

టైటాన్ చరిత్రకు మూలమైన అవమానం..

ఈ ‘మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ’ మనల్ని 1970–80 దశకాల భారతదేశానికి తీసుకువెళ్తుంది. లైసెన్సులు, అనుమతులు, పరిమితులు, దిగుమతుల మీద ఆధారపడే ఆర్థిక వ్యవస్థలో “భారతదేశం ప్రపంచ స్థాయి గడియారాలను తయారు చేయలేదా?” అని ఒక మనిషి ఒక ప్రశ్న వేస్తాడు. తర్వాత అదే టైటాన్ అనే చరిత్రగా మారుతుంది. ఈ కథలో కేంద్రబిందువు జెర్క్సెస్ దేశాయ్. తాను కంటున్న ఒక కలను వాస్తవం చేయాలనే పట్టుదలతో ముందుకు సాగే వ్యక్తి. ఆ పాత్రలో జిమ్ సర్బ్ తన నటనతో జీవం పోశాడు. అతని కళ్లలో కనిపించే ఆవేశం, ఆలోచనల్లో కనిపించే దూరదృష్టి, ఎదురుదెబ్బల ముందు కనిపించే మొండితనం ఇవన్నీ కలిపి ఒక సృష్టికర్తను మన ముందుంచు తాయి. మరోవైపు జె.ఆర్.డి. టాటాగా నసీరుద్దీన్ షా కనిపించిన ప్రతిసారీ తెరపై ఒక విలక్షణమైన గంభీరత ఆవహిస్తుంది. నాయకత్వం అంటే ఆదేశాలు ఇవ్వడం కాదని, కలలు కనగలిగిన వారిని నమ్మడం అని ఆయన పాత్ర చెబుతుంది. యువకుడి కలకు తన విశ్వాసాన్ని జోడించి అతన్ని ముందుకు నడిపించే గురువు పాత్రలో నసీరుద్దీన్ షా అసాధారణంగా రాణించారు.

విజయం వెనుక ఎంత శ్రమ ఉంటుందంటే..

ఈ సిరీస్ గొప్పతనం కథనంలో ఉంది. అది విజయాన్ని మాత్రమే చూపించదు. విజయానికి ముందు వచ్చిన సందే హాలను, అపజయాలను, ఒంటరితనాన్ని, పోరాటాన్ని కూడా చూపిస్తుంది. ఒక సంస్థ పుట్టుక వెనుక ఎంతటి ఆలోచన, ఎంతటి సహనం, ఎంతటి మానవ శ్రమ అవసరం ఉంటుందో సున్నితంగా ఆవిష్కరిస్తుంది. అందుకే ఇది కార్పొరేట్ డాక్యుమెంటరీగా కాక, మనసును తాకే కథగా నిలుస్తుంది. నిర్మాణ విలువల పరంగా కూడా ఈ సిరీస్ ఉన్నత స్థాయిలో ఉంది. ఆ కాలపు భారతదేశాన్ని ఆనాటి స్థితిని పునఃసృష్టించిన తీరు ప్రశంసనీయం. కార్యాలయాల నుంచి ఫ్యాక్టరీల వరకు, దుస్తుల నుంచి సంభాషణల వరకు ప్రతి అంశంలో ఆ కాలపు వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడా ఆర్భాటం లేకుండా, కథనే ప్రధానంగా ఉంచిన నిర్మాణశైలి ప్రేక్షకుడిని ఆ కాలంలోకి తీసుకువెళ్తుంది.

ప్రపంచ స్థాయి విజయాలు విదేశాల్లోనే పుట్టవ్..

నేటి వ్యాపార ప్రపంచంలో ఈ కథకు ప్రత్యేక ప్రాసంగికత ఉంది. స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, గ్లోబల్ పోటీ, కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడుతున్న ఈ కాలంలో, ఏ సంస్థకైనా పునాది నమ్మకమేనని ఈ మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటన్ స్టోరీ’ గుర్తు చేస్తుంది. విజయాల వెంట పరుగులు పెడుతున్న ఈనాటి యువతకు ఇది ఒక పాఠ్యపుస్తకం లాంటిది. కలలు కనడం సరిపోదు. వాటిని సాధించేందుకు నిలకడగా నడవాలి. పరిస్థితులు అనుకూలించకపోయినా అవకాశాలను సృష్టించు కోవాలి. ప్రపంచ స్థాయి విజయాలు విదేశాల్లోనే పుడతాయని కాదు, మన నేలలో, మన భాషలో, మన సామర్థ్యంలో కూడా పుడతాయని టైటన్ గాథ చెబుతుంది.

దేశం ప్రతిభను నమ్ముకున్న క్షణం..

ప్రతి గొప్ప సంస్థ వెనుక ఒక ఉత్పత్తి ఉండదు, ఒక విశ్వాసం ఉంటుంది. ప్రతి విజయవంతమైన బ్రాండ్ వెనుక ఒక వ్యాపార వ్యూహంతోపాటు ఒక స్వప్నం ఉంటుంది. టైటాన్ కథ అలాంటి స్వప్నానికి రూపం. అది భారతదేశం తన ప్రతిభను తాను నమ్ముకున్న క్షణానికి అద్దం. ఒక గురువు తన శిష్యుడిని నమ్మిన కథ. ఒక కల దేశ గౌరవంగా మారిన గాథ. నేటి యువత, వ్యాపారవేత్తలు, విద్యార్థులు తప్పక చూడాల్సిన ప్రేరణాత్మక ప్రయాణం.

-వారాల ఆనంద్

94405 01281

Next Story