వంట గ్యాస్ సంక్షోభం.. విదేశీ ఆధారితత్వం భారత్‌కు కొత్త హెచ్చరిక!

by Ravi |   (  Updated:2026-03-13 00:31:25  IST  )

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి మార్గంలో ఇంధన రవాణా దెబ్బతినడంతో భారత్‌లో వంట గ్యాస్ సరఫరా సమస్యలు తలెత్తుతున్నాయి. దిగుమతులపై ఆధారపడే పరిస్థితి, తక్కువ నిల్వ సామర్థ్యం మరియు భవిష్యత్ ఇంధన భద్రతపై ఈ వ్యాసం విశ్లేషిస్తుంది.

వంట గ్యాస్ సంక్షోభం.. విదేశీ ఆధారితత్వం భారత్‌కు కొత్త హెచ్చరిక!
X

దేశంలోని ప్రజలు వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి పదేపదే ప్రయత్నిస్తున్నా ఏజెన్సీ నుండి స్పందన లేదు.. చాలా మందికి ఇదే సమస్య మొదలైంది. ధర పెరగడం పక్కన పెడితే సరఫరా కూడా పట్టాలు తప్పింది. కారణం సుస్పష్టం. అమెరికా ఇరాన్ యుద్ధం మధ్యలో ప్రపంచ ఇంధన భద్రత చితికిపోతోంది. మన దేశం అందుకు అతీతం కాదు.. కానీ ఇంత త్వరగా దుష్ప్రభావాలు సోకడం ఆలోచించదగ్గది. ఎలాంటి విధానాల ద్వారా బాహ్య ప్రభావాల్ని తక్కువ నష్టానికి నియంత్రించగలమో, పరాధీనత నుండి బయటపడగలమో ఆలోచించి, అమలు చేయకపోతే మున్ముందు కష్టం. దేశంలో వినియోగించే వంట గ్యాస్ కోసం దాదాపు 60 శాతం వరకూ దిగుమతులపైనే ఆధార పడుతున్నాం. అందులో 85 శాతం పశ్చిమాసియా నుండి హోర్ముజ్ జలసంధి మార్గంలో వస్తోంది. ఇప్పుడు ఆ మార్గంలో రాకపోకలు మూసుకుపోవడమే కాకుండా, ప్రమాదభరితంగా తయారైంది. ఇప్పటి వరకు మన దేశం గ్యాస్ దిగుమతి చేసుకొని వచ్చింది వచ్చినట్టు ఉపయోగించుకునేలా తయారైంది. తప్ప నిల్వలు ఉంచుకొనే చర్యలు చేపట్టలేదు.. అవసరం కొండంత.. నిల్వ సామర్థ్యం గోరంత. ఇక దేశీయ ఉత్పత్తిని 25 శాతం పెంచేలా ప్రధాని ఆదేశించినా, అది పూర్తిగా అమలైనా దేశీయ అవసరాలకు చాలదు.. ఎందుకంటే ఒక దశాబ్దంలోనే వంట గ్యాస్ వినియోగం 120 రెట్లు పెరిగింది. అమెరికా నుండి దిగుమతికి ఒప్పందాలు కుదిరినా, అది చేరేటప్పటికి నెలపైనే పడుతుంది. వంట గ్యాస్ కొరత గృహస్తులపైనే కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు, హోటల్స్, ఫుడ్ డెలివెరీ రంగంపై కూడా ప్రభావం చూపనుంది. ప్రభుత్వం నష్ట నివారణ, వినియోగ‌దారునికి కష్టం తగ్గించే ఆలోచన చెయ్యాలి. అలాగే స్వల్పకాలిక సర్దుబాట్లతో పాటు దీర్ఘకాలిక వ్యూహాలను ఆలోచించాలి. ముఖ్యంగా నిల్వ సామర్థ్యం పెంపు, దేశీయ ఉత్పత్తి పెంపు, ప్రత్యామ్నాయ దిగుమతుల ఏర్పాట్లు చూసుకో వాలి. ఇదే అదనుగా సాగే కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్‌లను కట్టడి చెయ్యాలి.

-డా డి.వి.జి శంకరరావు,

94408 36931

Next Story