కాళ్ళుకట్టేసి, మూతి కుట్టేసి...పర్మిషన్ ఇస్తారా!

by Disha edit |
కాళ్ళుకట్టేసి, మూతి కుట్టేసి...పర్మిషన్ ఇస్తారా!
X

ఆంధ్రప్రదేశ్‌లో నారాలోకేశ్‌ పాదయాత్రకు అనుమతి ఇస్తూ అందులో 15 నిబంధనలు విధించారు. ఇన్ని నిబంధనలతో పాదయాత్రకు అనుమతి ఇస్తే ఏమిటి, ఇవ్వకపోతే ఏమిటి? అని ప్రశ్న. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, నాయకుల పాదయాత్రలపై ఎలాంటి నిర్బంధాలు, నిషేధాలు లేవు. లోకేష్ పాదయాత్రపై ఇంత రాద్ధాంతం అవసరమా? కాళ్ళు కట్టేసి, మూతి కుట్టేసి యువగళానికి పర్మిషన్ ఇస్తారా? దేశంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, శాంతియుతంగా ప్రదర్శనలు, నిరసనలు తెలియజేసే హక్కు పౌరులు కలిగి ఉన్నారు. ఆ హక్కును ప్రభుత్వాలు గౌరవించాలి. ఆ హక్కులను వినియోగించుకోవటాన్ని ప్రోత్సహించాలని రామ్‌లీలా మైదానం కేసులో సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. కానీ ఇప్పుడు ఈ ఏపీలో ఇది రివర్స్ అయింది. ప్రభుత్వం లోకేష్ పాదయాత్రకు విధించిన షరతులను వెంటనే ఉపసంహరించుకోవాలి.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు గీత దాటితే వేటు వేస్తాము అన్న విధంగా పర్మిషన్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. లోకేశ్‌ పాదయాత్రకు అనుమతి ఇస్తూ అందులో 15 నిబంధనలు విధించారు. ఈ నిబంధనలు పోలీసు శాఖ వారు తయారు చేశారా లేక సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి తయారు చేశారా అన్న అనుమానం కలుగుతుంది. ఇన్ని నిబంధనలతో పాదయాత్రకు అనుమతి ఇస్తే ఏమిటి, ఇవ్వక పొతే ఏమిటి? మొక్కుబడి పర్మిషన్ ఎవరి కోసం? ఏమిటి ఈ నిబంధనలు. గతంలో ఎవరి పాదయాత్రకు అయినా ఇలాంటి షరతులు విధించారా? ఇప్పుడు పొరుగు రాష్ట్రం తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాదయాత్రలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ దేశవ్యాప్త పాదయాత్ర చేస్తున్నారు. వారు చేస్తున్న పాదయాత్రలపై ఎటువంటి అణచివేతలు, నిర్భంధాలు, నిషేధాలూ లేవు. స్వేచ్చగా పాదయాత్రలు చేశారు, చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రపై ఇంత రాద్ధాంతం అవసరమా? కాళ్ళు కట్టేసి, మూతి కుట్టేసి యువగళానికి పర్మిషన్ ఇస్తారా?

సభలు ఎక్కడ పెట్టాలి?

గతంలో జగన్‌ పాదయాత్ర చేసినప్పుడు డీజీపీ స్థాయిలో రాష్ట్రమంతా పాదయాత్ర చేయ్యడానికి ఒకేసారి అనుమతి ఇవ్వడం జరిగింది. నేడు లోకేష్ యువగళం పాదయాత్రకు డీఎస్పీ స్థాయి అధికారులతో ఎక్కడిక్కడ, ఎప్పటి కప్పుడు సబ్ డివిజన్ల వారీగా పాదయాత్రకు దరఖాస్తు చేసుకోవాలనడం ఏమిటి? జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పంచాయితీరాజ్‌ రోడ్లపై కూడా సభలు పెట్టరాదట. మరి ఇంకెక్కడ సభలు పెట్టాలి? ప్రభుత్వ దయా దాక్షిణ్యాలపై పాదయాత్ర చెయ్యాలి అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇది ప్రజాస్వామ్యమా లేక జగన్ స్వామ్యమా? రోడ్ షోను బహిరంగ సభగా మార్చవద్దట, పాద‌యాత్రలో మైక్ వాడాలన్నా, బహిరంగ సభ నిర్వహించాలన్నా డీఎస్పీ అనుమతి పొందాలట. పాదయాత్రలో డీజే సిస్టమ్, లౌడ్ స్పీకర్ల వినియోగం నిషేధం, సింగిల్ సౌండ్ బాక్స్ మాత్రమే వినియోగించాలని, టపాసులు కాల్చకూడదని, సాయంత్రం ఆరు గంటల వరకే పాదయాత్ర చెయ్యాలని, పాదయాత్ర సజావుగా సాగేందుకు జనాన్ని నియంత్రించే బాధ్యత మీదేనని ఇటువంటి అనేక అసంబద్ధ ఆంక్షలు, షరతులు పెట్టారు.

తాము ఇచ్చిన షరతుల్లో ఏ ఒక్కటి పాటించకపోయినా నోటీసు ఇవ్వకుండా అనుమతి రద్దు చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకొంటామంటూ పర్మిషన్ ఇచ్చారు. రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలు, రోడ్డుషోలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది కాదా? అనుమతులు తీసుకొని సభలు, రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే. ఏమైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకొంటే పోలీసులే బాధ్యత వహించాలి. ఏదో విధంగా పాదయాత్రను అడ్డుకోవాలన్న దుర్బుద్ధితోనే అడుగడుగునా ఆంక్షలు, షరతులు విధించడం సమర్ధనీయం కాదు. రాజకీయ దురుద్దేశంతోనే లోకేశ్‌ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడానికి పోలీసుల ద్వారా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.

ప్రాథమిక హక్కుకు ఇన్ని తూట్లా?

భావ ప్రకటనా స్వేచ్ఛ, ధర్నాలు, పాదయాత్రలు నిర్వహించటం, శాంతియుతంగా నిరసనలు తెలియజేయటం ప్రజాస్వామ్యం మౌలిక లక్షణాలు. భారతదేశంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, శాంతియుతంగా ప్రదర్శనలు, నిరసనలు తెలియజేసే హక్కు పౌరులు కలిగి ఉన్నారు. ఆ హక్కును ప్రభుత్వాలు గౌరవించాలి. ఆ హక్కులను వినియోగించుకోవటాన్ని ప్రోత్సహించాలని రామ్‌లీలా మైదానం కేసులో సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. మరి ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం అణచివేతకు, నిర్బంధాలు, నిషేధాలకు ఆదేశాలు ఇవ్వడం ఏమిటి? ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్చకు అడుగడుగునా అడ్డు తగులుతోంది.ప్రతిపక్షాల స్వాతంత్ర్యాన్ని కాలరాస్తూ సభలకు, సమావేశాలకు అడ్డంకులు సృష్టిస్తోంది.

ప్రభుత్వ నియంతృత్వాన్ని అడ్డుకొని పౌరుల హక్కులకు రక్షణ కల్పించాల్సింది న్యాయస్థానాలే. ప్రభుత్వాలు ప్రతి పౌరుడికి సమావేశాలు నిర్వహించుకోవటానికి ఉన్న ప్రాథమిక హక్కును గమనంలో ఉంచుకుని మాత్రమే నిబంధనలు విధించాలి. నియంత్రణ పేరుతో సభలు, సమావేశాల హక్కును అడ్డుకోరాదని. అదేవిధంగా అన్ని రహదారులలో, వీధుల్లో సమావేశాలను నిషేధించరాదని 1973 లోనే సుప్రీంకోర్టు హిమత్‌ లాల్‌ కె షా కేసులో అభిప్రాయపడిన విషయం పోలీసులు గుర్తించాలి. సెక్షన్‌ 30 వున్నప్పుడే పోలీసులు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల సభలు సమావేశాలకు అనుమతి నిరాకరిస్తున్నారు. ఈ జీవో1 తో ప్రతిపక్షాలను మరింతగా ఇబ్బంది పెట్టనున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలు ప్రశ్నించడం ప్రతిపక్షం బాధ్యత అని పోలీసులు గుర్తించాలి.

లోకేశ్ పాదయాత్రతో గజగజ

జనహితం కాంక్షించే వారిపై వివేకం, విచక్షణ లేకుండా నిబంధనలు, షరతులు విధించి వారి గొంతులు నొక్కడం ప్రజాస్వామ్యం కాదు. ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ కల్పించడంలో పోలీసులదే కీలక పాత్ర. జగన్ రెడ్డి పాలనలో ప్రతిపక్షాలకు సంకెళ్ళ వేసి బ్రిటీష్ వారి పాలనలో కూడా లేని నిర్బంధ కాండ కొనసాగిస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఫాసిస్టు రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారు. జగన్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక, నిరంకుశ పాలనపై ప్రజలందరూ గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైంది. గతంలో ముఖ్యమంత్రులు ఏదైనా ఆదేశం ఇచ్చినా అది ఆచరణీయం కాదని, ఈ విధానం మార్చుకోవాలని సలహా ఇచ్చిన ఐపీఎస్‌లను మనం చూసాం. కానీ ఇపుడు ముఖ్యమంత్రి ఆదేశించగానే ఆంధ్రప్రదేశ్‍‌‌లో జీ హుజూర్ అనే ఐపీఎస్‌లను చూస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు జగన్ రెడ్డి విధానాలను గుడ్డిగా సమర్ధించి పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. పాదయాత్రకు పొంతనలేని అసంబద్ధమైన, అడ్డమైన షరతులు విధించి ఏదో రకంగా అడ్డుకొనే ప్రయత్నం చేస్తుంది జగన్ ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీ ప్రజలతో మమేకం అవ్వడానికి, వారి సమస్యలు తెలుసుకోవడానికి వివిధ రూపాల్లో ప్రజల వద్దకు వెళ్లడం సహజం. ఒక పక్కన నా పరిపాలన బ్రహ్మాండం అని, జనరంజక పాలన అని, జనం మా వైపే వున్నారని బాకాలూదుకొంటూ, మరోపక్కన ప్రతి విషయానికి ఎందుకు ఉలికి పడుతున్నారో, ఎందుకు అడ్డుకోవాలనుకొంటున్నారో, అనైతికంగా, అప్రజాస్వామికంగా వ్యహరిస్తున్నారో అర్ధం కావడం లేదు. లోకేష్ పాదయాత్రకు మేమెందుకు భయపడతాం అంటూ మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మరో పక్క ప్రభుత్వం వాస్తవంగానే వణికిపోతోంది.

లోకేష్ పాదయాత్ర చేసి తమ బండారం బయటపెడతాడేమోనని, అది తమ ప్రభుత్వానికి అంతిమ యాత్ర అవుతుందని ఆందోళన చెందుతున్నారు. నేడు ప్రజలెన్నుకొన్న ప్రభుత్వం వుండి కూడా పరిపాలన శూన్యమై సమస్యలు చుట్టుముట్టి అన్ని రంగాలు నిర్వీర్యం అయి, అన్ని వ్యవస్థలు ధ్వంసం అయి ప్రజలు దిక్కులేనివారిగా దిక్కులు చూస్తున్న సమయమిది. అందుకే బాధ్యత గల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ గ్రామ, పట్టణ ప్రాంత ప్రజలను కలుసుకోవడానికి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించడానికి సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుడితే అధికారపార్టీ నాయకులు తమ కాళ్ళకింద భూమి కంపించినట్లు ఆర్తనాదాలు చేస్తూ పోలీసులను అడ్డుపెట్టుకొని పాదయాత్రను అడ్డుకొంటున్నారు.

పాదయాత్రకు షరతులు వద్దు

అన్ని రాష్ట్రాలు అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో స్వార్ధ రాజకీయ ప్రణాళికలు, అవినీతికి ప్రణాళికలు తప్ప అభివృద్ధి ప్రణాళికలు లేవు. అందుకే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు అయింది. అభివృద్ధి అడుగంటింది. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిని చేశారు. పౌరహక్కులను, భావ ప్రకటనా స్వేచ్చను కాలరాసి రాష్ట్రంలో అరాచకానికి, అశాంతికి తెరతీశారు. 2014-2019 మధ్య అయిదేళ్ళు అభివృద్ధి పధంలో దూసుకు పోయిన ఆంధ్రప్రదేశ్, జగన్ అసమర్ధ, అవినీతి పాలనలో 30 ఏళ్ళు వెనక్కి పోయింది. తిరోగమన బాటపట్టిన ఆంధ్రప్రదేశ్ పురోగమన బాట పట్టాలన్నా,ప్రజలు సుసంపన్నంగా ఉండాలన్నా, వ్యవస్థల పునరుద్దరణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం, యువత భవితకు బంగారు బాటలు వెయ్యడం కోసం ప్రజల బాట పట్టారు నారా లోకేష్. ఏది ఏమైనా పౌర హక్కులపై సహేతుక షరతుల పేరుతో సభలు, సమావేశాలు అడ్డుకొనే విధంగా చర్యలు కానీ, ఉత్తర్వులు కానీ జారీ చేయరాదని ఆదేశించింది సుప్రీం కోర్టు.

రాజ్యాంగం స్పష్టంగా ప్రాథమిక హక్కులలో చేర్చి మరీ సమావేశాలు నిర్వహించుకోవచ్చని చెప్పిన విషయాన్ని గుర్తించి ప్రభుత్వం లోకేష్ పాదయాత్రకు విధించిన షరతులను ఉపసంహరించుకోవాలి. ఏదో విధంగా పాదయాత్రను అడ్డుకోవాలన్న దుర్బుద్ధితోనే అడుగడుగునా ఆంక్షలు, షరతులు విధించడం సమర్ధనీయం కాదు. రాజకీయ దురుద్దేశంతోనే లోకేశ్‌ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడానికి పోలీసుల ద్వారా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.

(నేడు లోకేష్ పాదయాత్ర ప్రారంభం)

నీరుకొండ ప్రసాద్

9849625610

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

మారుతున్న రాజకీయ సమీకరణాలు

Nara lokesh అలా చేస్తే.. తిరుగులేని శక్తిగా టీడీపీ!

Next Story