గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు..

by Ravi |   (  Updated:2025-08-12 00:45:38  IST  )

విద్య అనే ధనం దొంగలు దొంగిలించలేనిది, రాజులు లాక్కోలేనిది, సోదరులు పంచుకోనిది. విద్య లేకపోతే మానవుని

గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు..
X

విద్య అనే ధనం దొంగలు దొంగిలించలేనిది, రాజులు లాక్కోలేనిది, సోదరులు పంచుకోనిది. విద్య లేకపోతే మానవు ని జీవితం అంధకారమయమే. అలాంటి విద్య నిక్షిప్త మై ఉన్న గ్రంథాల భాండాగారమే ‘గ్రంథాలయం’. ఇవి అజ్ఞాన చీకట్లను పారదోలి జ్ఞాన జ్యోతులను వెలిగించే పవిత్ర దేవాలయాలు. మానవుని సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేది విద్య అయితే, ఆ విద్యావకాశాలను పేద, ధనిక బేధం లేకుండా అందరికీ అం దించే సమరసతా నిలయాలు గ్రంథాలయాలు. పూర్వకాలం లో మనదేశంలో కొన్ని లక్షల గ్రంథాలు ఉన్న గ్రంథాలయాలు విలసిల్లేవి. విదేశీ దండయాత్రల వలన ధ్వంసమయినాయి.

గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేసి..

మనదేశంలో గ్రంథాలయ శాస్త్రానికి ఒక గుర్తింపు తెచ్చి అనేక గ్రంథాలయాల స్థాపనకు స్ఫూర్తినిచ్చిన మహోన్నత వ్యక్తి డా.ఎస్.ఆర్. రంగనాథన్. ఆయన గ్రంథాలయోద్య మా నికి అందించిన సేవలకు గుర్తుగా ఆయన జయంతి రోజును జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈయన గ్రంథాలయాల రూపురేఖలను మార్చడానికి అహర్నిశలు కృషి చేశారు. ఇవి అందరికీ అందుబాటులో ఉండాలని తపించారు. ఆయన కృషి ఫలితంగానే గ్రంథాలయ శాస్త్రం ఒక ప్రత్యేక విద్యారంగంగా అభివృద్ధి చెంది లైబ్రరీ సైన్స్‌ డిగ్రీ, పీజీల్లో సబ్జెక్టుగా ప్రవేశ పెట్టబడింది. రంగనాథన్ పుస్తకాలను వర్గీకరించేందుకు గాను "కోలన్ క్లాసిఫికేషన్ సిస్ట మ్"ను అభివృద్ధి చేశారు. ఇది ఒక ప్రయోగాత్మక పద్ధతి. గ్రంథాలయ శాస్త్ర విజ్ఞానానికి ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1957లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

ఆన్‌లైన్‌లో భద్రపరచడం ద్వారా..

గ్రంథాలయాలు మౌన గురువులు..దినపత్రికల దగ్గరి నుండి శాస్త్ర గ్రంథాల వరకు సమస్త జ్ఞాన సమాచారం నిక్షిప్తమై ఉన్న నిధి గ్రంథాలయం. రోజూ గ్రంథాలయానికి వెళ్లి పుస్తక పఠనం చేయడం ద్వారా శ్రద్ధ, ఆసక్తులు అభివృద్ధి చెందుతాయి. ఆలోచనాశక్తి పెరుగుతుంది. నాటి కాలంలో గ్రంథాలయాలు ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుగా ఉండే వి. కానీ నేటి సాంకేతిక యుగంలో కొన్ని గ్రంథాలయాలు నిరుపయోగకరంగా మారుతుండగా మరికొన్ని అత్యాధునిక సాంకేతికతతో కొత్తరూపు సంతరించుకున్నాయి. గ్రంథాలయాలను కేవలం గ్రంథ రూపంలో భద్రపరచకుండా ఆన్‌లైన్‌లో భద్రపరచడం వల్ల భవిష్యత్ తరాలకు కూడా విలువైన జ్ఞాన సంపదను అందించగలుగుతున్నాం. అయితే పెరుగుతున్న ఇంటర్నెట్ వాడకం వల్ల పుస్తకాలపై ఆధారపడకుండా మొబైల్‌లోనో, కంప్యూటర్ ట్యాబ్‌లోనో కావాల్సిన సమాచారాన్ని పొందుతుండడం వల్ల రాను రాను గ్రంథాలయాల ఉనికి ప్రశ్నార్థకంగా మారి లైబ్రేరియన్ ఉద్యోగాల భవితవ్యం గందరగోళంగా మారింది. ఇందుకోసం ప్రభుత్వా లు తగిన చొరవ చూపి గ్రంథాలయాలకు కొత్త రూపురేఖలనివ్వాలి.

సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా..

చిన్ననాటి నుండి విద్యార్థులలో పఠనాసక్తిని పెంచితే రాబోయే కాలంలో వారు గొప్ప మేధావులుగా, శాస్త్రవేత్తలుగా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారనేది నిర్వివాదాంశం. అందుకోసం ప్రతి పాఠశాలకు నూతన గ్రంథాలయం ఏర్పాటు చేయాలి. కొన్ని కొన్ని గ్రామాల్లో యువత స్వయంగా లైబ్రరీలు ఏర్పాటు చేసి చదువుకోవాలనే ఆశగల గ్రామీణ నిరుపేద యువకులను ప్రోత్సహిస్తుండడం నిజంగా అభినందనీయం. రాష్ట్రం ప్రభుత్వం కూడా పాఠ శాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు గురించి ప్రత్యేక చొరవ చూపడం నిజంగా హర్షణీయం. ఎంత సాంకేతికత అభివృద్ధి చెందినా, కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందిన గ్రంథాలయాల విలువ ఏ మాత్రం తగ్గదని మనం గ్రహించాలి. ప్రతి గ్రామంలో గ్రంథాలయ ఏర్పాటుకు ప్రభుత్వాలు, ప్రజలు నడుం బిగించాలి.

(నేడు జాతీయ గ్రంథాలయ దినోత్సవం)

- సుధాకర్ ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS,

90006 74747

Next Story